నోరూరించే స్టఫ్డ్ పాలక్ పనీర్ ఇడ్లీ..హెల్దీ బ్రేక్‌ ఫాస్ట్ చిటికెలో

Posted By:

దక్షిణ భారతదేశంలో ఇడ్లీ అంటే తెలియని వారు ఉండరు. ఉదయం టిఫిన్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మృదువైన, వేడివేడి ఇడ్లీలే. కానీ రోజు తినే సాదా ఇడ్లీలకు కాస్త భిన్నంగా, మరింత రుచికరంగా,ఆరోగ్యకరంగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే స్టఫ్డ్ పాలక్ పనీర్ ఇడ్లీ తినాల్సిందే.

పాలకూరలోని పోషకాలు, పనీర్ లోని ప్రొటీన్ కలగలిసిన ఈ ఇడ్లీలు పిల్లల లంచ్ బాక్స్‌కి, పెద్దల బ్రేక్ ఫాస్ట్‌ కి ఒక అద్భుతమైన ఎంపిక. ఆకుకూరలు తినడానికి మారం చేసే పిల్లలు కూడా ఈ ఇడ్లీలను ఇష్టంగా లాగించేస్తారు. స్టఫ్డ్ పాలక్ పనీర్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Protein Packed Breakfast How to Make Healthy Palak Paneer Idli Recipe in Telugu

కావలసిన పదార్థాలు
ఇడ్లీ బియ్యం: 1 కప్పు
మినపప్పు: అర కప్పు
మెంతులు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
పాలకూర: అర కప్పు
పనీర్ : అర కప్పు (తురిమినది)
ఉల్లిపాయ: 1 చిన్నది
పచ్చిమిర్చి: 1
అల్లం: అర టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
నూనె: తాలింపుకు సరిపడా

తయారీ విధానం

-మొదటగా మినపప్పు, ఇడ్లీ బియ్యం, మెంతులను విడివిడిగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వీటిని వేర్వేరు గిన్నెలలో తగినంత నీరు పోసి సుమారు 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి.

-పప్పు బాగా నానిన తర్వాత, బియ్యం, పప్పును విడివిడిగా గ్రైండర్ లేదా మిక్సీలో వేసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలను ఒక గిన్నెలో వేసి, రుచికి సరిపడా ఉప్పు కలిపి, బాగా మిక్స్ చేసి సుమారు 6-8 గంటలు లేదా రాత్రంతా పక్కన పెట్టండి.

-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక తరిగిన పాలకూర, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి.

-పాలకూరలోని పచ్చి వాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు ఉడికించాలి. చివరగా తురిమిన పనీర్ వేసి అన్నీ బాగా కలిసేలా ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకుని వాటి గుంతలకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని కొద్దిగా (గుంతలో సగం వరకు) పోయాలి. దానిపై తయారు చేసుకున్న పాలక్ పనీర్ మిశ్రమాన్ని ఒక స్పూన్ ఉంచాలి.

-ఇడ్లీ పాత్రలో నీరు పోసి వేడి చేసి ఇడ్లీ స్టాండ్‌ ను అందులో ఉంచండి. మూత పెట్టి మీడియం మంటపై 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఇడ్లీలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ లేదా చాకుతో గుచ్చి చూడండి, పిండి అంటుకోకపోతే ఇడ్లీలు తయారైనట్లే.

-స్టవ్ ఆపి, వేడి వేడి ఇడ్లీలను ప్లేట్ లోకి తీసుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌ తో తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, December 13, 2025, 16:32 [IST]
Desktop Bottom Promotion