అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్!

Posted By:

సొరకాయ పేరు చెప్పగానే చాలామంది మొఖం చిట్లిస్తారు. దీనికి ప్రధాన కారణం..ఇంట్లో తరచుగా చేసే సొరకాయ పప్పు,పులుసు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే కూరలే అయినప్పటికీ తరచుగా ఇంట్లొ చేసి తినడం వల్ల చాలామందికి బోర్ కొట్టేస్తుంది. అయితే సొరకాయతో చాలామంది వడలు వంటి స్నాక్స్, పాయసం వంటి స్వీట్లు తయారుచేస్తున్నారు.

అయితే మీరెప్పుడైనా సొరకాయ కోఫ్తా కర్రీ రుచి చూశారా? తినకపోతే ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూడండి. సొరకాయ అంటే పక్కకు జరిగేవాళ్లు ప్లేట్ పట్టుకొచ్చి కూర మొత్తం తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీలు, రోటీల్లోకి ఇది అద్భుతంగా ఉంటుంది. హోటల్ స్టైల్‌ లో దూదిలాంటి మెత్తటి కోఫ్తాలు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే చిక్కటి గ్రేవీతో సొరకాయ కోఫ్తాను ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.

Sorakaya kofta curry recipe in telugu restaurant style rich and thick gravy at home

కావలసిన పదార్థాలు

కోఫ్తాల కోసం:
సొరకాయ - 1 (మధ్యస్థ పరిమాణం)
శనగపిండి - 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయ - 1
కారం పొడి - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

చిక్కటి గ్రేవీ కోసం:
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
జీడిపప్పు - 8 నుండి 10
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్ధ
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కసూరి మెంతి - అర టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా కోఫ్తాలను సిద్ధం చేసుకోండి.సొరకాయ తొక్క తీసి శుభ్రంగా తురుముకోవాలి. తురిమిన సొరకాయ నుండి చేతులతో గట్టిగా పిండి అదనపు నీటిని పూర్తిగా తొలగించాలి. ఈ నీటిని పారబోయకుండా గ్రేవీలో వాడుకోవచ్చు.

-ఇప్పుడు సొరకాయ తురుములో శనగపిండి, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసి మెత్తని ముద్దలా అయిన వెంటనే చిన్న చిన్న ఉండలుగా (కోఫ్తాలుగా) చుట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి అందులో సిద్దం చేసుకున్న కోఫ్తాలను వేసి మీడియం మంట బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి. అవి మంచి బంగారు గోధుమ రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించి, పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకోండి. ఇందుకోసం మరొక బాండీలో కొద్దిగా నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, జీడిపప్పు వేసి టమోటాలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-తర్వాత బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు రుబ్బుకున్న జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలి. అందులో పసుపు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు చేర్చి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.గ్రేవీ చిక్కదనాన్ని బట్టి తగినంత వేడినీళ్లు పోసి 5-7 నిమిషాల పాటు మరగనివ్వాలి. గ్రేవీ పూర్తిగా సిద్ధమయ్యాక గరం మసాలా, కసూరి మెంతి చల్లాలి.

-చివరగా స్టవ్ ఆర్పివేసే ముందు వేయించిన కోఫ్తాలను వేసి మెల్లగా కలిపి, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

-అంతే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, November 5, 2026, 8:00 [IST]
Desktop Bottom Promotion