చపాతీ, పరోటాలోకి అదిరిపోయే కాంబినేషన్..కేరళ స్టైల్ కంఠారి చికెన్..చేయడం చాలా ఈజీ

Posted By:

చపాతీలతో పాటు ఎప్పుడూ చేసుకునే రొటీన్ చికెన్ కర్రీ కాకుండా, కాస్త కొత్తగా, ఘాటుగా ఏదైనా ప్రయత్నించాలని ఉందా? అయితే కంఠారి చికెన్ ట్రై చేయాల్సిందే. కేరళ స్టైల్ వంటకాలను ఇష్టపడే వారికి ఈ పేరు సుపరిచితమే. సాధారణ పచ్చిమిరపకాయల కంటే ఎంతో ఘాటుగా, ఆరోగ్యకరంగా ఉండే కాంఠారి మిర్చితో చేసే ఈ చికెన్ రుచి అమోఘం.

ఇది కేవలం చపాతీకే కాదు.. పరోటా, దోశ, అప్పం, చివరికి ఘీ అన్నం లేదా బగారా రైస్ లోకి కూడా అదిరిపోయే కాంబినేషన్. చాలా తక్కువ సమయంలో, సులభంగా ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spice Up Your Meal Authentic Kerala Style Kanthari Chicken Recipe in Telugu

కావలసిన పదార్థాలు
చికెన్: అర కిలో
కాంఠారి మిరపకాయలు (గుండు పచ్చిమిర్చి): 10
సాంబార్ ఉల్లిపాయ తరుగు: 1 కప్పు
టమోటా: 1
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె: 3 టేబుల్ స్పూన్లు
చిక్కటి కొబ్బరి పాలు: పావు కప్పు
జీడిపప్పు: 10
కరివేపాకు: 1 రెమ్మ
కొత్తిమీర: ఒకటిన్నర టీస్పూన్లు
ధనియాల పొడి: ఒకటిన్నర టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
మిరియాల పొడి: అర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
వేడినీరు: అర కప్పు

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి.

-నూనె వేడెక్కాక తరిగిన చిన్న ఉల్లిపాయలు, 3 కాంఠారి మిరపకాయలు, కొద్దిగా ఉప్పు, తాజా కరివేపాకు వేసి వేయించాలి. చిన్న ఉల్లిపాయలు వాడటం వల్ల కూరకు మంచి తీపి, రుచి వస్తుంది.

-ఉల్లిపాయలు పారదర్శకంగా మారిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగిలిన తరిగిన కాంఠారి మిరపకాయలను వేసి వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయిస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది.

-ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటాలు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు 3-4 నిమిషాలు ఉడికించాలి. సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి.

-ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను మసాలాలో వేసి బాగా కలపాలి. మసాలా ముక్కలకు పట్టేలా 5 నిమిషాలు మధ్యస్త మంటపై వేయించాలి. తర్వాత అర కప్పు వేడి నీళ్లు పోసి, మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

-చికెన్ ఉడికిన తర్వాత గరం మసాలా పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.

-చివరగా స్టవ్ ఆపే ముందు చిక్కటి కొబ్బరి పాలు, మరికొన్ని కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలపాలి. కొబ్బరి పాలు వేసాక ఎక్కువ సేపు ఉడికించకూడదు, కేవలం తక్కువ మంటపై 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి.

-అంతే ఘాటైన, రుచికరమైన కాంఠారి చికెన్ గ్రేవీ రెడీ. వేడి వేడి చపాతీలు లేదా దోశలతో వడ్డిస్తే ప్లేట్లు ఖాళీ అవ్వడం ఖాయం.

[ of 5 - Users]
Story first published: Thursday, January 22, 2026, 10:38 [IST]
Desktop Bottom Promotion