వేడి వేడి అన్నంలోకి వేరుశనగ వెల్లుల్లి చట్నీ.. ఈ కాంబినేషన్ ఉంటే అమృతమే

Posted By:

బయట చలి పెరిగిపోతోంది. ఇలాంటి శీతాకాలం సాయంత్రాల్లో లేదా మధ్యాహ్నం వేళ వేడి వేడి అన్నంలోకి కారంగా,ఘాటుగా ఏదైనా నంచుకుని తినాలనిపిస్తుంది కదూ? రోజువారీ పప్పు, సాంబార్ తిని బోర్ కొట్టిన మీ నాలుకకు ఒక కొత్త రుచిని పరిచయం చేయాలంటే ఉత్తర కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎంతో పాపులర్ అయిన వేరుశనగ వెల్లుల్లి చట్నీబెస్ట్ ఆప్షన్.

వేయించిన పల్లీలు ఇచ్చే కమ్మదనం, వెల్లుల్లి ఇచ్చే ఘాటు కలగలిపి.. అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచిని వర్ణించడానికి మాటలు సరిపోవు. మన వంటింట్లో ఎప్పుడూ ఉండే వాటితోనే చిటికెలో ఈ చట్నీ చేసేయొచ్చు. కేవలం 10 నిమిషాల్లో వేరుశనగ వెల్లుల్లి చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Perfect Side Dish for Hot Rice and Ghee Peanut Garlic Chutney Recipe in Telugu

కావలసిన పదార్థాలు
వేరుశనగలు (పల్లీలు): 1 కప్పు
వెల్లుల్లి: 10 రెబ్బలు
పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి: 5
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 టేబుల్ స్పూన్
నీరు: చట్నీ రుబ్బడానికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో ఒక కప్పు వేరుశనగలు వేసి మీడియం మంట మీద దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా, లోపలి వరకు వేగి మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-మీరు ఎండుమిర్చి వాడుతుంటే, కాస్త నూనెలో ఒక నిమిషం పాటు వేయించండి. పచ్చిమిర్చి అయితే నేరుగా వాడొచ్చు లేదా లైట్‌ గా వేయించవచ్చు. వెల్లుల్లి రెబ్బలను మాత్రం పచ్చిగానే ఉంచాలి, అప్పుడే ఆ ఘాటు చట్నీకి అసలైన రుచిని ఇస్తుంది.

-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ముందుగా నీరు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ మీకు కావలసిన విధంగా మెత్తగా రుబ్బుకోవాలి.

-చట్నీని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో ఒక చిన్న చెంచా పచ్చి ఆవాల నూనె (లేదా సాధారణ వంట నూనె) వేసి బాగా కలపండి. ఈ పచ్చి నూనె కలపడం వల్ల చట్నీకి ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన రుచి వస్తుంది. దీన్ని గట్టిగా చేసుకుంటే చపాతీ, రోటీలకు స్ప్రెడ్ లాగా వాడుకోవచ్చు. కాస్త పల్చగా చేసుకుంటే ఇడ్లీ, దోస, వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్.

శీతాకాలంలో ఈ చట్నీ ప్రయోజనాలు?
వేరుశనగలు, వెల్లుల్లి రెండు కూడా శరీరంలో ఉష్ణాన్ని పెంచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా జలుబు, దగ్గు వంటి చిన్నపాటి సమస్యలను దరిచేరనివ్వదు. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పల్లీల్లో ఉండే ప్రోటీన్, మంచి కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

[ of 5 - Users]
Story first published: Tuesday, December 30, 2025, 7:45 [IST]
Desktop Bottom Promotion