రెస్టారెంట్ రుచిని మరిపించే రైస్ ఖీర్.. ఇంట్లోనే చాలా ఈజీగా!

Posted By:

భోజనం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా, చివరలో కాస్త తీపి లేకపోతే ఆ ఆనందం సంపూర్ణం కాదు. పండుగ రోజుల్లోనైనా, వీకెండ్ పార్టీల్లోనైనా మనందరికీ గుర్తొచ్చే మొదటి స్వీట్ రైస్ ఖీర్(బియ్యం పాయసం). అయితే మనం ఇంట్లో చేసే పాయసం కంటే హోటల్స్ లేదా రెస్టారెంట్లలో లభించే ఖీర్ ఎంతో చిక్కగా, క్రీమీగా, అద్భుతమైన రుచితో ఉంటుంది.

ఆ రుచి వెనుక ఉన్న రహస్యం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తినే ఆ హోటల్ స్టైల్ రైస్ ఖీర్ ను మీరు కూడా చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చం రెస్టారెంట్ స్టైల్ రుచితో రైస్ ఖీర్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Ultimate Indian Dessert Creamy Rice Kheer Recipe in Telugu

కావలసిన పదార్థాలు
ముఖ్యంగా ఫుల్ క్రీమ్ మిల్క్ లేదాచిక్కటి పాలు- 1 లీటరు
బాస్మతి బియ్యం- అర కప్పు
చక్కెర - రుచికి సరిపడా (సుమారు 1 కప్పు)
యాలకుల పొడి - అర టీస్పూన్
కుంకుమ పువ్వు రేకులు - చిటికెడు
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, కిస్మిస్, బాదం) - గుప్పెడు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మంచినీటిలో కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యం త్వరగా ఉడకడమే కాకుండా, పాయసం మంచి క్రీమీ ఆకృతిలోకి వస్తుంది.

-అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో లీటరు చిక్కటి పాలను పోసి మీడియం మంటపై మరిగించాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం నుండి నీటిని పూర్తిగా వడకట్టి, బియ్యాన్ని పాలల్లో వేయాలి.

-మంటను సిమ్ లో ఉంచి, బియ్యం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. బియ్యం పాలతో కలిసిపోయి చిక్కబడే వరకు ఓపికగా మరిగించాలి.

-బియ్యం సగం ఉడికిన తర్వాత గరిటెతో బియ్యాన్ని కొద్దిగా మెదపాలి. ఇలా చేయడం వల్ల పాయసం నీళ్లలా కాకుండా, హోటల్ స్టైల్ లా చిక్కగా, క్రీమీగా మారుతుంది.

-బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే మీ రుచికి తగినంత చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. కుంకుమ పువ్వు పాయసానికి మంచి సువాసనతో పాటు, ఆకర్షణీయమైన లేత పసుపు రంగును ఇస్తుంది.

-వేరొక చిన్న పాన్ లో నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ నేతి మిశ్రమాన్ని నేరుగా ఉడుకుతున్న పాయసంలో వేసి కలపాలి.

-అంతే ఎంతో రుచికరమైన, చిక్కటి హోటల్ స్టైల్ రైస్ ఖీర్ రెడీ. దీనిని వేడివేడిగా తిన్నా అద్భుతంగా ఉంటుంది, లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే పిల్లలు ఐస్‌క్రీమ్ లా ఇష్టపడి తింటారు.

[ of 5 - Users]
Story first published: Sunday, February 1, 2026, 16:46 [IST]
Desktop Bottom Promotion