కామద ఏకాదశి 2026 తేదీ, పూజా ముహూర్తం, విష్ణుమూర్తి ఆశీస్సులు పొందే శక్తివంతమైన మంత్రం

హిందూ నూతన సంవత్సరం (ఉగాది) ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కామదా ఏకాదశి' మన సనాతన ధర్మంలో ఈ పర్వదినానికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. పేరులోనే ఉన్నట్లుగా, భక్తుల కోరికలను తీర్చ ఏకాదశి ఇది. శ్రీ మహావిష్ణువు,సిరిసంపదల అధిదేవత అయిన లక్ష్మీదేవిల ఆశీస్సులు మెండుగా పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

కామద ఏకాదశి పవిత్రమైన రోజున నిష్ఠగా ఉపవాసం ఉండి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోయి, పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజున తులసి మాతకు చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి, సుఖసంతోషాలను నింపుతాయి.

Kamada Ekadashi 2026 Date Puja Muhurat Parana Time and Fasting Rules Tulsi Remedy to Clear Debts

కామద ఏకాదశి ఎప్పుడు? మార్చి 28నా లేక 29నా?

పంచాంగం ప్రకారం 2026వ సంవత్సరంలో చైత్ర శుక్ల ఏకాదశి తిథి మార్చి 28న ఉదయం 8:45 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అనగా మార్చి 29న ఉదయం 7:46 గంటలకు ముగుస్తుంది. హిందూ సాంప్రదాయంలో మనం ఎల్లప్పుడూ సూర్యోదయంతో ఉన్న తిథిని (ఉదయ తిథిని) ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి ధర్మశాస్త్రాల ప్రకారం 2026 మార్చి 29, ఆదివారం నాడు కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అత్యంత శ్రేయస్కరం.

ముఖ్యమైన పూజా ముహూర్తం
పూజా ముహూర్తం: ఉదయం 7:48 నుండి మధ్యాహ్నం 12:26 వరకు.
ఉపవాస విరమణ (పారణ సమయం): మరుసటి రోజు, ద్వాదశి తిథి (మార్చి 30, 2026) నాడు ఉదయం 6:14 నుండి 7:09 నిమిషాల లోపు ఉపవాసాన్ని విరమించాలి.

కామదా ఏకాదశి వ్రత ఆచరణ, పూజా విధానం
ఈ పవిత్ర వ్రతం దశమి తిథి నాటి నుండే ప్రారంభమవుతుంది. దశమి నాడు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి, స్నానం ఆచరించి, శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఇంటిని, పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒక పీటపై పసుపు వస్త్రం పరిచి, శ్రీ లక్ష్మీ నారాయణుల ప్రతిమను లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి, అగరబత్తీలు వెలిగించాలి.

శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పసుపు రంగు పూలు, పండ్లు, తులసి దళాలను సమర్పించాలి. పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్య మంత్రాన్ని నిరంతరం జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. రోజంతా భక్తి గీతాలు, కీర్తనలతో గడుపుతూ, ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు బ్రాహ్మణులకు, పేదలకు దానధర్మాలు చేసి ఆ తర్వాతే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.

Kamada Ekadashi 2026 Date Puja Muhurat Parana Time and Fasting Rules Tulsi Remedy to Clear Debts

ఆర్థిక ఇబ్బందులు తొలగించే అద్భుత పరిహారాలు

-దీర్ఘకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే కామదా ఏకాదశి రోజున ప్రత్యేక తులసి పూజ చేయండి. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, భక్తితో తులసి మాత చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల క్రమంగా మీ దారిద్ర్యం తొలగిపోయి, ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

-అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ ఏకాదశి రోజున ఒక చిన్న పరిహారం చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత, తులసి మొక్క వేరు వద్ద ఉన్న పవిత్రమైన మట్టిని తీసుకుని నుదుటిపై తిలకంగా పెట్టుకోండి. భక్తిశ్రద్ధలతో ఈ పరిహారం చేస్తే, మీకు త్వరలోనే అప్పుల భారం తగ్గిపోయి, జీవితంలో ఊహించని సానుకూల మార్పులు వస్తాయి.

Disclaimer: ఈ కథనంలో అందించిన సమాచారం మతవిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు తెలిపిన సమాచారం మేరకు ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించడం లేదు.

Desktop Bottom Promotion