Vaikunta ekadashi 2025: కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు..ఉత్తర ద్వార దర్శనం వెనుక అసలు రహస్యం ఇదే

ఇవాళ దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వైష్ణవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. అయితే వైకుంఠ ఏకాదశి అనగానే అందరికీ ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తులు ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఇదే
పురాణగాధల ప్రకారం పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారు. ఆ ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది. ముక్కోటి ఏకాదశి నాడే పాలకడలి నుంచి అమృతం పుట్టిందని చెబుతారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా చెబుతారు.

ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం దగ్గర దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందంటారు. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారు.

vaikunta ekadashi 2025 significance of uttara dwaara darshanam on mukkoti ekaadasi

ఉత్తరం దిక్కుకి అందుకే
మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాం. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తరభాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు. అంటే విష్ణువు దర్శనం మనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం అని పండితులు చెబుతారు. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి. ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకుని తమలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి.

అఖండ ఐశ్వర్యం

వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోట్లాది మంది భక్తులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా నియమ నిష్ఠలతో పూజ చేసి, ఉపవాసం పాటించి, జాగరణ ఉంటూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుదర్శనం తర్వాత పూజచేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు.

వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణుపూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

2025 సంవత్సరంలో మొదటి ఏకాదశి శుక్రవారం వస్తుంది. శ్రీమహావిష్ణువు భార్య,సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఈ రోజు అంకితం చేయబడినందున ఇది చాలా పవిత్రమైనది.

వైకుంఠ ఏకాదశి పూజ విధానం
ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అప్పుడు విష్ణువును ధ్యానించి ఉపవాసం చేయాలని సంకల్పించండి. ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి, గంగాజలంతో విష్ణువు విగ్రహానికి స్నానం చేయించండి. స్వామికి పసుపు వస్త్రాలు ధరించి, తులసి, పండ్లు, పువ్వులు, పంచామృతాలు, స్వీట్లు సమర్పించండి. విష్ణు సహస్రనామం, భగవద్గీత లేదా ఇతర మత గ్రంథాలను పఠించండి. రాత్రి జాగరణ చేసి భజన కీర్తనలు చేయండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం వలన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ దానాలు శ్రేష్ఠం
వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు వస్త్రదానం,సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడుతుంది

Story first published: Friday, January 10, 2025, 6:51 [IST]
Desktop Bottom Promotion