వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి

వర్షాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఒకవైపు మనసుకు హాయినిచ్చినా, మరోవైపు అనేక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి వాటిని మోసుకొస్తుంది. వర్షాకాలం మొదలవగానే చాలా ఇళ్లలో వినిపించే మొదటి మాట జలుబు చేస్తుంది, పండ్లు తినొద్దు. ముఖ్యంగా నారింజ, అరటిపండు, పుచ్చకాయ వంటి పండ్లను పూర్తిగా దూరం పెడతారు. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని, వాస్తవానికి ఈ కాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే శక్తి పండ్లకు ఉందని నిపుణులు చెబుతున్నారు.

పండ్లు తింటే జలుబు వస్తుందన్నది శాస్త్రీయంగా నిరూపితం కాని విషయం. నిజానికి పండ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు మన శరీర రోగనిరోధక శక్తిని ఒక కవచంలా కాపాడతాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ మనల్ని వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. కాబట్టి పండ్లను శత్రువులుగా కాకుండా, మన ఆరోగ్య మిత్రులుగా భావించాలి. ఈ విషయంపై తమిళనాడుకి చెందిన ప్రముఖ డాక్టర్ కార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ కార్తికేయన్ ప్రకారం జలుబు రాకుండా నివారించాలన్నా, ఇప్పటికే వచ్చిన జలుబు నుండి త్వరగా కోలుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన పండ్లను తప్పక తీసుకోవాలి.

6 Immunity Boosting Fruits You Must Eat During the Monsoon Season

డాక్టర్ సూచించిన ఆ అద్భుతమైన పండ్లు ఇవే

యాపిల్

యాపిల్స్‌ లో ఫ్లేవనాయిడ్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా వైరస్‌ లతో పోరాడే శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. కాబట్టి జలుబు భయంతో యాపిల్‌ ను పక్కన పెట్టకండి.

అరటిపండు
అరటిపండు తింటే జలుబు ఎక్కువవుతుందన్నది మరో పెద్ద అపోహ. వాస్తవానికి అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడి, నీరసం నుండి బయటపడేస్తుంది. అంతేకాకుండా ఇది సులభంగా జీర్ణమై, జలుబుతో బాధపడుతున్నప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇవ్వడంలో కూడా అరటిపండు సహాయపడుతుంది. బలహీనపడిన రోగనిరోధక వ్యవస్థకు ఒత్తిడి ఒక కారణం కాబట్టి అరటిపండు తినడం ఎంతో మేలు.

నారింజ,నిమ్మ
జలుబు అనగానే అందరూ భయపడేవి సిట్రస్ పండ్లు. కానీ వీటిని మించిన ఔషధం లేదు. నారింజ, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థకు ప్రాణం లాంటిది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించి, ఇన్ఫెక్షన్లతో పోరాడే మన శరీర సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది. కాబట్టి జలుబు చేసినప్పుడు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం లేదా నారింజ పండు తినడం వల్ల త్వరగా కోలుకుంటారు.

ఫైనాపిల్
పైనాపిల్‌ లో బ్రోమెలైన్ అనే ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ (వాపును తగ్గించే) గుణాలు ఉన్నాయి. ఇది గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో కూడా విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

6 Immunity Boosting Fruits You Must Eat During the Monsoon Season

పుచ్చకాయ
పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుందని, ఇది జలుబుకు కారణమవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ జలుబు చేసినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌ కు గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్‌ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అనారోగ్యం నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది.

దానిమ్మ
దానిమ్మ గింజలు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలతో నిండి ఉంటాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. రక్తహీనతను తగ్గించి, శరీరానికి బలాన్నిస్తాయి. వీటితో పాటు కొబ్బరి నీళ్లు, ఖర్జూరాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. కొబ్బరి నీళ్లు సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్ లా పనిచేసి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఖర్జూరాలు తక్షణ శక్తిని అందించి, నీరసాన్ని దూరం చేస్తాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, August 11, 2025, 13:50 [IST]
Desktop Bottom Promotion