బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ఉదయం నిద్రలేవగానే చురుకుదనం కోసం వేడివేడిగా ఓ కప్పు పానీయం తాగడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఆరోగ్య సృహ ఉన్నవాళ్లు కొందరు బ్లాక్ కాఫీ వైపు మొగ్గుచూపితే, మరికొందరు గ్రీన్ టీని ఇష్టపడతారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే చర్చ ఎప్పటినుంచో ఉంది.

పాలు, చక్కెర లేకుండా తాగితే ఈ రెండింటిలోనూ కేలరీలు శూన్యం, యాంటీ ఆక్సిడెంట్లు మెండు. మరి బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ లో ఉంచడానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇక్కడ చూడండి.

Green Tea vs Black Coffee Which is the Best Drink for Diabetes Control and Weight loss

బ్లాక్ కాఫీతో పవర్ ప్యాక్డ్ బెనిఫిట్స్

బ్లాక్ కాఫీ తాగగానే అందులోని కెఫీన్ డోపమైన్ హార్మోన్లను ప్రేరేపించి మెదడును తక్షణమే యాక్టివ్ చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని, శరీరంలో వాపులను తగ్గిస్తాయి. కెఫీన్ జీవక్రియ (మెటబాలిజం) రేటును పెంచి బరువు త్వరగా తగ్గడంలో సహాయపడుతుంది. అడ్రినలిన్ స్థాయిలను పెంచడం వల్ల శారీరక శ్రమను అలసట లేకుండా సులువుగా చేయగలుగుతారు. టైప్-2 డయాబెటిస్‌ ను నివారించడంలోనూ ఇది మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గ్రీన్ టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

గ్రీన్ టీలోని కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగిస్తుంది. ఇందులోని ఎల్ థియానైన్ అనే అమైనో యాసిడ్, కెఫీన్‌ తో కలిసి మెదడును చురుకుగా ఉంచుతూనే, ప్రశాంతమైన ఏకాగ్రతను ఇస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ ను పెంచుతుంది.

ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా?ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా?

షుగర్ వ్యాధికి ఏది చెక్ పెడుతుంది?

ఈ రెండూ కేలరీలు లేనివే. కాఫీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. గ్రీన్ టీ కూడా ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అయితే కాఫీలోని అధిక కెఫీన్ కొంతమందిలో తాత్కాలికంగా షుగర్ లెవల్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్రీన్ టీ తాగడం సురక్షితం లేదా కాఫీ తాగేముందు డాక్టర్‌ ను సంప్రదించాలి.

బరువు తగ్గడానికి ఏది దివ్యౌషధం?

బరువు తగ్గించే విషయంలో రెండూ పోటాపోటీనే. బ్లాక్ కాఫీ తాగితే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి, అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే వ్యాయామానికి ముందు కాఫీ తాగితే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మరోవైపు, గ్రీన్ టీలో కెఫీన్ తక్కువ ఉన్నా.. అందలి EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల శరీరంలో కొత్తగా కొవ్వు చేరకుండా అడ్డుకట్ట పడుతుంది.

ఏది ఎప్పుడు తాగాలి?

మీరు జిమ్‌ లో లేదా ఇంట్లో వ్యాయామం చేయడానికి ముందు బ్లాక్ కాఫీ తాగండి. ఇది తక్షణ శక్తినిచ్చి కడుపు నిండిన భావనను ఇస్తుంది. అలా కాకుండా శరీరానికి ఎక్కువ కెఫీన్ ఇవ్వకుండా ప్రశాంతంగా కొవ్వు కరగాలి, ఇన్సులిన్ సామర్థ్యం పెరగాలి అనుకుంటే మాత్రం మీకు గ్రీన్ టీ పర్ఫెక్ట్ ఛాయిస్. మీ శరీర తత్వాన్ని, మీ లక్ష్యాన్ని బట్టి సరైనది ఎంచుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 3, 2026, 10:37 [IST]
Desktop Bottom Promotion