Myths And Facts: నేను యంగ్.. నాకస్సలే రక్తపోటు రాదని అనుకుంటున్నారా?

రక్తపోటు.. ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. చిన్న వయస్సు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. రక్తపోటు గుండెపోటుకు దారి తీసి ప్రాణాలను సైతం హరిస్తోంది. అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. కొన్ని కారణాల వల్ల గుండెపై పడే ఒత్తిడితో గుండెకు రక్తాన్ని సరఫరా కష్టంగా మారుతుంది. ఇది రక్తనాళాలకు హాని కలిగించవచ్చు. గుండెకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఇది గుండె జబ్బులకు, గుండె పోటుకు దారి తీస్తుంది.

చాలా మంది రక్తపోటు గురించి తక్కువ అంచనా వేస్తుంటారు. మరికొందరు ఎక్కువగా ఆలోచించి బీపీ పెంచేసుకుంటారు. రక్తపోటుకు సంబంధించి చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. అందులో కొన్ని నిజాలు, కొన్ని తప్పులు ఉండొచ్చు. రక్తపోటు గురించి అపోహలు ఏంటి, నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Myths and facts About Blood Pressure All You Need To Know In Telugu

1. 140/90 mm Hg కంటే ఎక్కువ ఉంటేనే అధిక రక్తపోటు!

ఒకప్పుడు 140/90 mm Hg కంటే రక్తపోటు ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటుగా భావించే వారు. అయితే 130/80 mm Hg ఉన్నప్పటికీ.. వారిలో హృదయ సంబంధ వ్యాధుల చరిత్ర ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా గతంలో గుండె జబ్బులు వచ్చిన సందర్భాలు ఉన్నా వైద్యులు దానిని అధిక రక్తపోటుగా భావించి వైద్యులు రాసిస్తుంటారు.

2. అధిక రక్తపోటు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి!

రక్తపోటులో రెండు రకాలు ఉంటాయి. ప్రాథమికం, ద్వితీయం. ప్రాథమిక రక్తపోటులో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. శరీరంలోపలి ధమనుల్లో సమస్య ఉన్నా అది బయటకు కనిపించదు. ద్వితీయ రక్తపోటు ఉన్న వారిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. అందుకే లక్షణాలు బయటకు కనిపించనంత మాత్రాన రక్తపోటు లేదనుకోవడం పొరపాటే.

3. ఉప్పు తినకపోతే చాలు.. రక్తపోటు రాదు!

అధిక రక్తపోటుకు ఉప్పు ప్రధాన కారణం అని చాలా మందికి తెలిసిందే. కూరల్లో, చిరు తిండ్లలో ఉప్పు వేసుకోనంత మాత్రాన ప్రమాదం తొలగిపోదు. ఇతర ఆహారాల నుంచి సోడియం లాంటివి శరీరంలోకి వస్తూనే ఉంటాయి. రొట్టెలు, రోల్స్, పౌల్ట్రీ, మాంసం, చీజ్‌బర్గర్‌లు, శాండ్‌విచ్‌లు, సాల్టెడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది.

4. కాఫీ తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది!

కాఫీ, టీలలో కెఫిన్ ఉంటుంది. అదో ఉద్దీపన పదార్థం. దాని వల్ల రక్తపోటు పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే కాఫీ తాగడం వల్ల పెద్దగా ప్రమాదం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ సోడా, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించుకోవడం ముఖ్యం.

5. అధిక రక్తపోటు స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువ!

ఇది వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. 50 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషుల్లో.. రక్తపోటు వచ్చే అవకాశాలు పురుషులకే ఎక్కువ. అయితే మెనోపాజ్(రుతువిరతి) తర్వాత స్త్రీలలో కూడా రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంది. పురుషుల కంటే కూడా మహిళలు రక్తపోటును ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భనిరోధక మాత్రలు, గర్భధారణ సమయంలో స్త్రీలలో అధిక రక్తపోటు రావొచ్చు.

6. యువకుల్లో రక్తపోటు రాదు!

సాధారణంగా రక్తపోటు సమస్య వృద్ధులను ఎక్కువగా వేధిస్తుంది. అలా అని యువకుల్లో రాదు అని చెప్పడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది యువకులు కూడా బీపీతో బాధపడుతున్నారు. ధమనుల్లో ఏర్పడే సమస్యల వల్ల ఎవరికైనా హైబీపీ, లోబీపీ రావొచ్చు. యువకుల్లో హైబీపీ ఉండే అవకాశాలు ఎక్కువ. అధిక బరువు, ఊబకాయం, కదలకుండా ఉండే జీవనశైలి వల్ల రక్తపోటు సమస్య యువకులు కూడా ఎదుర్కొంటున్నారు.

7. కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఏం చేసినా రక్తపోటు వస్తుంది!

కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు ఉంటే ఇతరులకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సమతుల్యమైన ఆహారం, సరైన బరువు నిర్వహణ, జీవనశైలి మార్పులతో రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Wednesday, June 28, 2023, 11:00 [IST]
Desktop Bottom Promotion