వరల్డ్ ఎయిడ్స్ డే: ఎయిడ్స్ వ్యాధి సోకకుండా తీసుకోవ్సలిన జాగ్రత్తలు...

ప్రతిఏటా డిసెంబర్‌ 01 న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ దినం "గా పాటించడం జరుగుతోంది. 1981 జూన్‌ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా 3.8 కోట్ల మందికి సోకింది. ఇండియాలో మొదటిసారిగా 1986లో ఎయిడ్స్ ను గుర్తించారు. భారతదేశములో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం" అనేది 1987 లో మొదలైనది.

నిజానికి మూడు దశాబ్దాల కిందట ఎయిడ్స్ మాట వింటే గుండెల్లో వణుకు పుట్టేది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి వ్యాపించే మార్గాలు, ఎయిడ్స్ వైరస్‌ను నియంత్రించే ఎఆర్‌టి మందుల ఆవిష్కరణతో ఈ భయం పోయిందనే చెప్పొచ్చు. ఆస్తమా, మధుమేహం మాదిరిగానే ఎయిడ్స్ కూడా దీర్ఘకాలిక వ్యాధిగా రూపాంతరం చెందడం గమనార్హం. ఎయిడ్స్ తొలి కేసు 1981లో అమెరికాలో నమోదైనప్పటికీ.. భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ నేటికి కూడా చర్చగానే మిగిలిపోయింది.

World AIDS Day: Tips To Prevent AIDS

మన దేశంలో 2010 గణాంకాల మేరకు.. 18 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో 3 కోట్ల 40 లక్షల మందికి పైగా హెచ్‌ఐవితో జీవిస్తున్నారన్నారు. స్వల్ప, మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. 31 ఏళ్ళ సుదీర్ఘ ఎయిడ్స్ ప్రయాణంలో2012కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడాదిలోనే ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ సెక్స్‌లో పాల్గొనే భాగస్వాములుకు హెచ్‌ఐవి వ్యాప్తి చెందకుండా ఉపయోగించే ట్రువాడా మందును వాడటానికి ఆమోదం లభించింది.

నిర్వచనం: మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్‌ (హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్‌ లేదా హెచ్‌ఐవి) కారణంగా వ్యాధినిరోధక శక్తి నశించి, పలువ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌ లేదా ఎయిడ్స్‌ అని వ్యవహరిస్తాము. 25నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్స్‌.

లక్షణాలు: హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తరు వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్‌ఐవి క్రిముల కారణంగా కాకుండా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్‌ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్‌ఐవి సోకిందనే అనుమానం కలుగకపోవచ్చు. హెచ్‌ఐవికి సంబంధించిన పరీక్షలను ఒకటికి రెండుసార్లు చేయించుకుని, స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు హెచ్‌ఐవి వ్యాధికి సంబంధించినవి నిర్ధారించకూడదు.

ఇక లక్షణాలు ఎలా ఉంటాయంటే : హెచ్‌ఐవీ ప్రవేశించిన వెంటనే కనిపించే లక్షణాలు జ్వరంగా ఉండడం, గొంతునొప్పి, ఒంటి నిండా కురుపులు, దద్దుర్లు కనిపిస్తాయి, తీవ్రమైన ఒంటి నొప్పులు, నోటిపూత, తలనొప్పి, వికారం, వాంతులు, క్రమంగా బరువు తగ్గడం, నోట్లో అల్సర్లు రావడం, రాత్రుళ్లు హఠాత్తుగా చెమటలు పట్టడం, కీళ్లనొప్పులు, చాలా తీవ్రమైన జలుబు రావడం, గవద బిళ్లలు వాచిపోవడం, కాలేయం, ప్లీహం వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.తరచుగా జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, త్వరగా బరువు తగ్గడం, జుట్టు రాలడం శరీరంలోని లింఫ్ గ్రంథులలో వాపు రావడం, నీరసంగా ఉండడం, కొంత మందిలో క్యాన్సర్లు కూడా ఏర్పడుతాయి. టీబీ మరణించే వారిలో 60 శాతం మంది హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులే. ఒక్కసారి హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులకు టీబీ రావడం జరిగితే అది ఎముకలకు, జీర్ణకోశానికి, మెదడుకు వ్యాపించి మరణానికి దారి తీస్తుంది. రక్త హీనత, నీరసం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.

పరీక్షలు
ఎలీసా పద్ధతిలో హెచ్‌ఐవీ-1ని నిర్థారించడం కష్టం. వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రైడాట్ టెస్ట్ ద్వారా కూడా దీన్ని కనుక్కోవచ్చు. ఆరు వారాల తర్వాత లేదా మూడు నెలల తర్వాత కచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.

హెచ్ ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది: హెచ్‌ఐవి ప్రధానంగా మూడు రకాలుగా వ్యాప్తి చెందుతుంది.
1. అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలు కలిగి ఉండటం.
2. మాదక ద్రవ్యాలవంటి వాటిని తీసుకోవడానికి ఒకే సిరంజిని, సూదిని పలువురు కలిసి ఉపయోగించడం.
3. రక్తమార్పిడి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
4. తల్లి గర్భంలో ఉండే శిశువుకు తల్లినుంచి ఈ వ్యాధి శిశువు గర్భంలో ఉన్నప్పుడు కాని, జనన సమయంలో కాని వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్‌ ఇన్‌ స్ట్రుమెంట్స్‌ వంటివి సరైన విధంగా శుభ్రపరచి వాడకపోతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు: అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా, సెఫ్ ప్రొటెక్షన్, కండోమ్ వంటివి ఉపోగించడం, ఒక్కరే పార్ట్నర్ గా ఉండటం, ఇంజక్షన్ నీడిల్స్ ఒకరి ఉపయోగించినవి మరొక ఉపయోగించకుండా జాగ్రత్తపడటం, కాంటాక్ట్ బ్రెస్ట్ మిల్క్ అవాయిడ్ చేయడం, వాటర్ లూబ్రికేంట్స్ కు దూరంగా ఉండటం.

ఈ వ్యాధి వ్యాప్తి....
1. హెచ్‌ఐవి బాధితుడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అలాగే హెచ్‌ఐవి బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవు. దోమలు కుట్టడం ద్వారా హెచ్‌ఐవి వ్యాప్తి చెందదు. తుమ్ములు, దగ్గు, ఇంట్లో వస్తువులను కలిసి ఉపయోగించుకోవడం మొదలైన వాటి వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.
ఎయిడ్స్ కు మందుల్లేవు, నివారణ ఒక్కటే మార్గం. ఎయిడ్స్ సోకిన వారు చనిపోతారనేది కేవలం అపోహ మాత్రమే. నిత్యం సరైన మందులు వాడితే ఎయిడ్స్ రోగాన్ని రూపుమాపవచ్చు. అయితే ప్రభుత్వం ప్రజల్లో మరింత అవగాహన పెంచి ఎయిడ్స్ రహిత సమాజాన్ని రూపొందించాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion