Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
యోగా అంటే ఏంటీ? ప్రపంచానికి దీన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా..
సినిమా సెలబ్రిటీలు, క్రీడాకారులు,రాజకీయ నాయకులు ఇలా ఎందరో ప్రముఖులు ప్రశాంతంగా యోగాసనంలో మునిగి తేలడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇది కేవలం ఆరోగ్యంగా ఉండటానికి ఎంచుకున్న ఒక మార్గం కాదు.. ఆధునిక ప్రపంచంలో ఇది ఒక శక్తివంతమైన జీవనశైలిగా రూపాంతరం చెందింది. భారతదేశం నుండి అమెరికా వరకు ప్రపంచంలోని ప్రతి మూలనా ప్రజలు యోగా అపారమైన శక్తిని గుర్తించి దానిని తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. ఇంతకీ ఏమిటీ యోగా? కేవలం కొన్ని ఆసనాలు వేయడమేనా? ఈ అద్భుత ప్రయాణం ఎక్కడ మొదలైంది?
ఆత్మతో అనుసంధానం: యోగా అసలైన అర్థం
చాలామంది యోగాను కేవలం ఒక శారీరక వ్యాయామంగా పొరబడుతుంటారు. వాస్తవానికి యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య ఒక సేతువును నిర్మించే అద్భుతమైన శాస్త్రం. ఈ మూడింటినీ ఏకం చేసి, సమతుల్యతను సాధించడమే దాని లక్ష్యం. యోగా అనే పదం సంస్కృతంలోని 'యుజ్' అనే మూలపదం నుండి వచ్చింది. యుజ్ అంటే కలపడం లేదా అనుసంధానం చేయడం. యోగా మనలోని శారీరక, మానసిక శక్తులను విశ్వశక్తితో అనుసంధానిస్తుంది. ఇది కేవలం శరీరాన్ని వంచడం కాదు, మనసును లగ్నం చేయడం. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, శుద్ధి క్రియలు వంటి అనేక అంగాల సమాహారమే యోగా. ఇది ఒక వ్యక్తి శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతతను అందించి, వారి వ్యక్తిత్వాన్నే మార్చేస్తుంది.

పురాణాల నుండి పుట్టిన శక్తి
యోగా ప్రస్థానం వేల సంవత్సరాల నాటిది. హిమాలయాల్లో ఆదియోగి అయిన శివుడు తన దివ్యజ్ఞానాన్ని సప్తరుషులకు ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే మొట్టమొదటి యోగి, మొట్టమొదటి గురువు. సుమారు 15,000 సంవత్సరాల క్రితం ఈ ఏడుగురు శిష్యుల ద్వారా యోగ విద్య ప్రపంచమంతటా విస్తరించింది. చారిత్రకంగా చూస్తే దాదాపు 3500 సంవత్సరాల క్రితం మన ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదంలో యోగా గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అంతకంటే ముందు సింధు లోయ నాగరికత కాలం (సుమారు 5,000 సంవత్సరాల క్రితం) నాటి ముద్రికలపై కూడా యోగాసన భంగిమలు కనిపించాయని చరిత్రకారులు నమ్ముతారు. ఇది యోగా ప్రాచీనతకు నిదర్శనం. అథర్వణవేదంలో శ్వాసను నియంత్రించే పద్ధతుల గురించి స్పష్టంగా వివరించారు. కాలక్రమేణా, పతంజలి మహర్షి యోగ సూత్రాలను క్రోడీకరించి దానిని ఒక తాత్విక మార్గంగా మలిచారు. జ్ఞానాన్ని బట్టి యోగాను ప్రధానంగా నాలుగు మార్గాలుగా విభజించారు: రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగం,భక్తియోగం.
విశ్వవేదికపై యోగా ప్రస్థానం
1893 సంవత్సరం యోగా చరిత్రలో ఒక మైలురాయి. ఆ సంవత్సరం చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో యువ సన్యాసి స్వామి వివేకానంద తన ప్రసంగంతో పాశ్చాత్య ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయన భారతీయ తత్వశాస్త్రం, వేదాంతంతో పాటు యోగా యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి వరకు కేవలం భారతదేశానికే పరిమితమైన యోగా.. వివేకానందుడి మాటలతో ప్రపంచ వేదికపై తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పరమహంస యోగానంద, బికెఎస్ అయ్యంగార్ వంటి గొప్ప యోగా గురువులు పాశ్చాత్య దేశాలకు యోగాను తీసుకెళ్లి, దానిని వారి జీవనశైలిలో ఒక భాగంగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు.
హాలీవుడ్ వెలుగులు, డిజిటల్ విప్లవం
యోగాను ఒక ట్రెండ్ గా మార్చడంలో హాలీవుడ్ పాత్రను విస్మరించలేం. 1940ల్లో రష్యన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి యూజీనియా పీటర్సన్ యోగాను స్వీకరించి ఇందిరా దేవిగా పేరు మార్చుకున్నారు. ఆమె వెస్ట్ హాలీవుడ్ లో ఒక యోగా స్టూడియోను ప్రారంభించి అమెరికాలోని ధనవంతులు, సెలబ్రిటీలకు యోగాను పరిచయం చేశారు. ఆమెను యోగా ప్రథమ మహిళ (First Lady of Yoga) అని పిలుస్తారు.

మోదీ కారణంగా
ఇక ఈ డిజిటల్ యుగంలో 2014లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడంతో యోగాకు ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన గుర్తింపు లభించింది. అయితే 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు యోగా నిజమైన సంజీవనిలా మారింది. లాక్ డౌన్ ల సమయంలో శారీరక, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొన్న కోట్లాది మందికి యోగా ఒక వరంలా లభించింది. యాప్ లు, యూట్యూబ్ ఛానెల్ లు, ఆన్‌లైన్ తరగతుల ద్వారా యోగా ప్రతి ఇంటికీ చేరింది. నేడు ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ ప్రపంచ యోగా రాజధానిగా విలసిల్లుతోంది. దేశవిదేశాల నుండి లక్షలాది మంది యోగా నేర్చుకోవడానికి ఇక్కడికి తరలివస్తున్నారు. ఇది యోగా పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. ఆదియోగి నుండి నేటి డిజిటల్ యోగి వరకు యోగా ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం ఒక వ్యాయామం కాదు, అది మనల్ని మనతో కలుపుకునే ఒక ప్రయాణం.



Click it and Unblock the Notifications