సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం..

ఈ మధ్య కాలంలో టీవీల్లో చూసినా, పేపర్లు తిప్పినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా అన్ని చోట్ల కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు జెన్ జీ. గతేడాది నేపాల్లో జెన్ జీ విద్యార్థులు చేసిన పోరాటంతో అక్కడి రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. యువ నాయకడు దేశ ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత నుంచి అనేక దేశాల్లో కూడా రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా, రాజకీయ జవాబుదారీతనం కావాలంటూ, స్కూల్స్ లో మెరుగైన సౌకర్యాల కోసం అంటూ ఇలా జెన్ జీ ఆందోళనలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారుతున్నాయి. ఇటీవల భారత్ లో కూడా జెన్ జీ ఆందోళనల కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇదిలాఉంటే, తాజాగా సెర్బియాలో జెన్ జీ తన సత్తా చూపించింది. సెర్బియా ఎన్నికల్లో దశాబ్దాలుగా సెర్బియాను ఏలిన తిరుగులేని నాయకుడు, అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిచ్‌ కు అనూహ్యమైన, నిరుత్సాహపూరితమైన ఓటమి ఎదురైంది. ఈ చారిత్రక ఓటమిని శాసించింది ఉద్దండులైన రాజకీయ నాయకులు కాదు.. కేవలం 20 ఏళ్ల వయసున్న యువత, విద్యార్థులు. అక్టోబర్ 25న జరిగిన సెర్బియా పార్లమెంటరీ ఎన్నికల్లో.. స్టూడెంట్స్ లిస్ట్ పేరిట బరిలోకి దిగిన విద్యార్థుల ఉద్యమ పార్టీ ఏకంగా 52.7 శాం ఓట్లతో, 250 స్థానాలకు గాను 139 సీట్లు సాధించి అఖండ విజయం నమోదు చేసింది. వుసిచ్ నేతృత్వంలోని కూటమి కేవలం 97 సీట్లకే పరిమితమైంది.

Gen Z Revolution in Serbia Students List Defeats President Aleksandar Vucic in 2026 Elections

ఒక విషాదం.. మహా ఉద్యమానికి నాంది

ఈ అద్భుత విజయానికి బీజం రెండేళ్ల క్రితం జరిగిన ఒక ఘోర విషాదంలో పడింది. 2024 నవంబర్ లో నోవి సాద్ నగరంతోని రైల్వే స్టేషన్ పైకప్పు కూలిపోయి ఇద్దరు చిన్నారులతో సహా 16 మంది చనిపోయారు. నాసిరకం నిర్మాణాలు, ప్రభుత్వ అవినీతి, పాలకుల్లో జవాబుదారీతనం లేకపోవడమే ఈ ఘోరానికి కారణమని విద్యార్థులు రగిలిపోయారు. తొలుత ప్రతి శుక్రవారం ప్రమాదం జరిగిన కచ్చితమైన సమయానికి 15 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కానీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి వారిని అణచివేయాలని చూసినప్పుడు, ఆ మౌనం పెను తుఫానుగా మారింది. రాజధాని బెల్‌ గ్రేడ్ వీధుల్లో ఏకంగా 3 లక్షల మంది కదం తొక్కారు.

అమెరికా పౌర హక్కుల ఉద్యమం తరహాలో..

1960ల నాటి అమెరికా పౌర హక్కుల ఉద్యమాన్ని తలపిస్తూ, విద్యార్థులు చేతుల్లో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని 100 కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేశారు. మీడియాపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉండటంతో, పల్లెపల్లెకూ వెళ్లి ప్రజలను చైతన్యపరిచారు. ఈ ఉద్యమం అత్యంత క్రమశిక్షణతో సాగింది. ఇందులో ఐటీ విద్యార్థులు సురక్షితమైన కమ్యూనికేషన్ యాప్‌లు రూపొందించగా, న్యాయ విద్యార్థులు అరెస్టయిన వారికి న్యాయసహాయం అందించారు. మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ముస్లిం, బోస్నియా విద్యార్థులను కలుపుకుని పౌర ఐక్యతను చాటారు. ఒక నిర్దిష్ట నాయకుడు లేని వికేంద్రీకృత వ్యవస్థ కావడం వల్లే ప్రభుత్వం వీరిని టార్గెట్ చేయలేకపోయింది.

మీడియాను, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న వుసిచ్ ఆటలు విద్యార్థుల ముందు సాగలేదు. విద్యార్థుల ఆందోళనలతో అధికార పార్టీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. తన పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల ముందే ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడం కోసం 2026 సెప్టెంబర్ లో అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా చేశారు. అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పార్టీ ఓటమి పాలయ్యింది. న్యాయం కోసం మొదలైన పోరాటం, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వైపు మళ్లి, స్టూడెంట్స్ లిస్ట్ గా సంస్థాగతమై ఓట్ల రూపంలో సునామీ సృష్టించింది.

ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా..ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా..

ముందున్న అసలు సవాలు

దాదాపు 14 ఏళ్లుగా సెర్బియాలో తిరుగులేని శక్తివంతమైన నేతగా ఉన్న వుసిచ్ ను విద్యార్థుల ఉద్యమం ఎన్నికల ద్వారా గద్దె దించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలతో బెల్‌ గ్రేడ్ సహా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఈ నవశకానికి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, అసలు సవాలు ఇప్పుడే మొదలైంది. ఎన్నికైన వారిలో ఎక్కువ మంది రాజకీయ అనుభవం లేని విద్యావేత్తలు, రైతులు, న్యాయవాదులు, కళాకారులు ఉన్నారు. నియంతను గద్దె దించడంలో విజయం సాధించిన ఈ యువత, ఇప్పుడు నాయకత్వాన్ని ఎంచుకుని, ఇచ్చిన హామీలను ప్రభుత్వ విధానాలుగా మార్చి సెర్బియాను ప్రగతి పథంలో ఎలా నడిపిస్తుందో అని అందరూ ఆశక్తిగా చూస్తున్నారు.

Story first published: Tuesday, October 27, 2026, 14:28 [IST]
Desktop Bottom Promotion