Mothers Day 2025 Special: అమ్మా నీకు వందనం..ఈ తల్లులు ప్రపంచాన్నే ఎదిరించి కుటుంబాన్ని నిలబెట్టారు

ప్రతి ఏటా మే నెలలోని రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. మదర్స్ డే ఆధునిక సంప్రదాయం మొదట అమెరికాలో స్టార్ట్ అయింది.అన్న జూర్విస్ అనే మహిళ తన తల్లి జ్ఞాపకార్థం ఒక రోజును కేటాయించాలని ఉద్యమం ప్రారంభించింది. ఆమె తల్లి ఆన్ రీవ్స్ జార్విస్ సామాజిక కార్యకర్తగా తన జీవితాన్ని గడిపారు. 1908లో అన్న మొదటి అధికారిక మదర్స్ డే వేడుకను వెస్ట్ వర్జీనియాలో నిర్వహించారు. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే రెండవ ఆదివారాన్ని జాతీయ మదర్స్ డేగా ప్రకటించారు. అయితే మాతృత్వాన్ని గౌరవించే ఆచారం చాలా పురాతనమైనది.

మదర్స్ డే..తల్లులు మన జీవితాలలో పోషించే అమూల్యమైన పాత్రను గుర్తుచేసుకోవడానికి, వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక అవకాశం. తల్లులు మన మొదటి ఉపాధ్యాయులు, సంరక్షకులు. వారి నిస్వార్థ ప్రేమ, అనంతమైన సహనం, రోజువారీ త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. ఇవాళ మదర్స్ డే(మే 11,2025)సందర్భంగా 5గురు స్ఫూర్తిదాయకమైన తల్లుల గురించి ఇక్కడ చూడండి.

Mother s Love is Unstoppable These Five Women Proved It

గాయత్రి కనుమూరి

తల్లిపాల సమస్యలకు పరిష్కారం చూపిన అమ్మగా ఈమె చాలా మంది స్ఫూర్తినిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన గాయత్రి 2020లో పుట్టిన తన కూతురికి పాలివ్వడంలో ఊహించని సవాళ్లను ఎదుర్కొన్నారు. మాజీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయిన గాయత్రి..కుటుంబ సభ్యులు,ఫ్రెండ్స్ నుంచి ఒత్తిడి, అపరాధ భావనను ఎదుర్కొన్నారు. దీంతో తనలాంటి ఇతర తల్లులకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఆమె 'నారికేర్(NariCare)'అనే స్టార్టప్ ను ప్రారంభించారు. నారీకేర్ ద్వారా ప్రసవానంతర కాలంలో తరచుగా లభించని కీలకమైన తల్లిపాల మద్దతును అందించడం, తల్లులను శక్తివంతం చేయడం, వారి శిశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం గాయత్రి లక్ష్యం. వాట్సాప్‌ లో 24/7 సపోర్ట్ గ్రూప్‌ ను, శిక్షణ పొందిన నిపుణుల నుండి మార్గదర్శకత్వాన్ని ఈ స్టార్టప్ అందిస్తుంది. ఈ స్టార్టప్ భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో తల్లిపాలు ఇవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వందల మందికి పైగా తల్లులకు సహాయం చేసింది.

నేహా బగారియా
బెంగళూరుకు చెందిన నేహా బగారియా.. కెరీర్ బ్రేక్ తర్వాత తిరిగి ఉద్యోగాల్లోకి వచ్చే మహిళలకు మద్దతుగా హెర్‌కీ(Herkey)అనే కంపెని స్థాపించారు. ఆమె స్వయంగా ఎదుర్కొన్న ఇబ్బందులే ఇందుకు కారణం. మొదట్లో కేవలం 40 రోజుల ప్రసూతి సెలవు అనుకున్న నేహా.. దాదాపు నాలుగేళ్ల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె తన గుర్తింపును, ఆశయాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు."నా ఉన్నతమైన ఆశలన్నింటినీ నా చిన్న కొడుకు భుజాలపై వేయడం మొదలుపెట్టాను. అతను ఏదో ఒక విషయంలో పరిపూర్ణంగా లేకపోతే నేను నిరాశపడేదాన్ని. సంతోషంగా ఉండే తల్లిగా ఉండాలంటే ముందు నేను సంతోషంగా ఉండే వ్యక్తిగా ఉండాలని గ్రహించాను. దానికోసం నేను మళ్లీ పనిలోకి వెళ్లాలి" అని ఆమె తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ ఆలోచన నుంచే హెర్‌కీ పుట్టింది. ఈ వేదిక 3.5 మిలియన్లకు పైగా మహిళల కెరీర్‌లను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడింది. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో, ఉద్యోగ అవకాశాలను కనుగొనడంలో, విశ్వాసంతో తిరిగి ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడంలో తోడ్పాటునందించింది.

గీతా పాటిల్
మహారష్ట్రకు చెందిన గీతాపాటిల్..2016లో భర్త ఉద్యోగం కోల్పోవడంతో ఇద్దరు చిన్న పిల్లల బాధ్యతను ఒంటరిగా మోయాల్సి వచ్చింది. స్థిరమైన ఆదాయం లేని ఆ రోజుల్లో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ద్దరు అబ్బాయిలు చదువు ఇతర ఖర్చులు అన్నీ భరించాలంటే ఏం చేయాలనే ఆలోచన కొద్ది రోజులు ఆమె మైండ్ లో తిరిగింది. అయితే వంట మీద గీతాకు నమ్మకం ఉంది. అందుకే తన ఇంటి నుంచే ఆమె 'పాటిల్ కాకి' అనే సంస్థను స్థాపించి మోదక్, పురాన్పోలి, చక్లి, పోహా లాంటి ఎన్నో రుచికరమైన చిరుతిళ్లను అమ్మడం ప్రారంభించారు. ఆమె కుమారులు కూడా ఆర్డర్లు ప్యాక్ చేయడంలో సహాయం చేసేవారు. ముఖ్యంగా గీతా కుమారుడు వినీత్ తెచ్చే టిఫిన్లు స్కూల్లో అందరికీ ఎంతో ఇష్టంగా ఉండేవి. నేడు ఈ బ్రాండ్ నెలకు 3000 మందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. సంవత్సరానికి రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తోంది.

లవీనా జైన్
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన లవీనా భర్త 2010లో క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలియడంతో వారి జీవితం ఒక మలుపు తిరిగింది. ఇద్దరు చిన్న పిల్లల ఆలనాపాలన చూడటం, పెరుగుతున్న వైద్య ఖర్చులను భరించడం వారికి పెను సవాలుగా మారింది. చివరికి తమ ఇంటిని అమ్మేయాలని కూడా అనుకున్నారు. ఆర్థికంగానే కాదు, మానసికంగా, శారీరకంగా కూడా చాలా కుంగిపోయినట్లు లవీనా చెప్పింది. ఇల్లు అమ్మేయడం అంటే ఓటమిని అంగీకరించినట్టనిపించిందని.. మా పిల్లలకు మేము నేర్పించాలనుకున్న పోరాట స్ఫూర్తికి అది విరుద్ధం అని లవీనా అన్నారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. కేవలం రూ.1,500 పెట్టుబడితో మీరట్‌లోని తన ఇంటి వంటగది నుండి ఊరగాయలు, స్క్వాష్, షర్బత్‌లు తయారు చేస్తూ 'త్రిప్తి ఫుడ్స్(Tripti Foods)' ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె నిర్వహణలో ఉన్న ఈ సంస్థ 20 రకాల ఉత్పత్తులను అందిస్తోంది. వారి ఊరగాయలు దేశవ్యాప్తంగా జరిగే ప్రదర్శనల్లో,డైరక్ట్ ఆర్డర్ల ద్వారా అమ్ముడవుతున్నాయి. ఈ వ్యాపారం వారి కుటుంబానికి రూ.15 లక్షలకు పైగా అప్పులు తీర్చడానికి సహాయపడింది.

పూనమ్ శర్మ
హర్యానాకి చెందిన పూనమ్ శర్మ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంది. భర్త ఉద్యోగం కోల్పోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని దుస్థితిలో పూనమ్ ప్రపంచం తలకిందులైంది. పిల్లల్ని స్కూల్ నుంచి పంపించమని చెప్పిన రోజు వాళ్ల ముందు తాను ఎంతగానో ఏడ్చానని.. అది తనకు అవమానంగా, నిస్సహాయంగా అనిపించింది అని ఆమె ఆనాటి బాధను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమెకు పాక్షిక పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యారు. కేవలం 8వ తరగతి వరకు చదువుకున్న పూనమ్ శర్మ తన కష్టాలనే అవకాశంగా మార్చుకుంది. 'దాదీ కా పితారా(Dadi Ka Pitara)' పేరుతో చిరుధాన్యాల ఆధారిత ఆహార వ్యాపారాన్ని ప్రారంభించి నమ్కీన్, లడ్డూలు, చాక్లెట్లు, చిప్స్‌ తో సహా 100కు పైగా ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, కార్పొరేట్ ఈవెంట్స్ కు ఆమె ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ వ్యాపారం ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరించి అమెరికా, కెనడాలోని వినియోగదారులనూ చేరుకుంది.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన విలువలకు కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో మా అమ్మ నాకు నేర్పింది. ఆమె తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది, నేను కూడా ఆమెలా ఉండాలని కోరుకుంటున్నాను అని పూనమ్ శర్మ కుమార్తె హిమాన్షి గర్వంగా చెబుతోంది.

Desktop Bottom Promotion