Animal Rain : జగిత్యాలలో 'జంతువుల వర్షం'.. అంటే ఏంటో తెలుసా?

Animal Rain: జగిత్యాలలో 'జంతువుల వర్షం'.. అంటే ఏంటో తెలుసా?

Rain of animals: దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం కూడా ఉండటంతో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నాలుగైదు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. వానల జోరు తగ్గకపోవడం, మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో రాష్ట్ర సర్కారు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

What is animal rain? Know reasons when animals rained from sky in Telugu

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో వానలు దంచి కొడుతున్నాయి. వర్షాలతో పాటు మరో వింత ఘటన కూడా వెలుగు చూసింది. అరుదైన జంతువుల వర్షం కురవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకాశం నుండి వర్షంతో పాటు చేపలు పడటం చూసి ఆశ్చర్యపోయారు. కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ వీడియోల్లో ఓ దాబా పైన వర్షంతో పాటు చేపలు పడ్డట్టు కనిపిస్తోంది. జగిత్యాల పట్టణం సాయినగర్ లో జరిగిన ఘటన మాదిరే ఖమ్మం జిల్లాలోనూ జరిగింది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో జోరు వాన కురిసింది. ఈ సమయంలోనే పలు చోట్ల చేపలు ఆకాశం నుండి కింద పడ్డాయి.
కొన్ని రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇలాంటి ఘటనే జరిగింది. వర్షపు చినుకులతో పాటు చేపలు పడ్డాయి. ఇలా వానతో పాటు జంతువులు పడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రాణాలతో పాటు పడిన చేపలను కొందరు పట్టుకున్నారు.

జంతువుల వాన అంటే ఏమిటి?
జగిత్యాలలో పడిన ఈ వానను చేపల వాన కాకుండా జంతువుల వానగా సంబోధిస్తారు. ఎందుకంటే.. వానతో పాటు ఇతర జీవులు కూడా ఆకాశం నుండి పడ్డాయి. చేపలతో పాటు పీతలు, కప్పలు అలాగే చిన్న చిన్న నీటి ప్రాణులు వర్షంతో పాటు వచ్చాయి. ఇలా వర్షంతో పాటు ప్రాణులు పడటం చాలా దేశాల్లో జరిగింది. భారత్ లోనూ పలు రాష్ట్రాల్లో ఇలా వానతో పాటు చేపలు, కప్పలు పడిన ఘటనలు నమోదయ్యాయి. ఇలా చేపలు, పీతలు, కప్పలు పడటం అనేది ఈ మధ్య వచ్చిందేం కాదు. క్రీస్తు పూర్వమే ఇలాంటి ఘటనలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

What is animal rain? Know reasons when animals rained from sky in Telugu

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నమోదు అయినప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో పడిన సందర్భాలు మాత్రం కొంత మాత్రమే. 2005లో వాయువ్య సెర్బియా ఒడ్జాసి పట్టణంలో కప్పల వాన కురిసింది. వేలాది కప్పలు వీధులు, బంగ్లాలపై పడ్డాయి. బలమైన గాలులు పెద్ద సంఖ్యలో కప్పలను మోసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 2009లో జపాన్ లోని టాడ్ పోల్స్ లో జంతు వర్షం కురిసింది. 2017లో కాలిఫోర్నియాలో చేపల వర్షం కురిసింది. వేలాది చేపలు ఆకాశం నుండి కింద పడ్డాయి.

వానతో పాటు జంతువులు ఎలా పడతాయి?
వర్షాలు జోరుగా పడిన సమయంలో సముద్రంపై గాలులు సుడులు తిరుగుతాయి. ఇలా సుడులు తిరిగే గాలులు సముద్రం నుండి నీటిని కూడా పైకి తీసుకువెళ్తాయి. తుపాన్ లు వచ్చినప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి. బలంగా వీచే గాలులు నీటిని పైకి తీసుకెళ్లిన సమయంలోనే చేపలు, పీతలు, కప్పలు లాంటి చిన్న చిన్న ప్రాణులు బలమైన గాలులకు నీటితో పాటు పైకి వెళ్తాయి. భూమి ఉపరితలంపై సంభవించే వాటర్ స్పౌట్ లు లేదా డ్రాఫ్ట్ లలో ఇలా పైకి కొట్టుకుపోయినప్పుడు అలా వెళ్లిన ప్రాణులు.. కొద్ది దూరంలో వర్షంతో పాటు కింద పడిపోతాయి. కొన్ని సందర్భాల్లో గాలులతో పాటు పైకి వెళ్లిన జీవులు.. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించి అక్కడ పడటం లాంటి ఘటనలు నమోదు అవుతుంటాయి.

ఇలా తుపానులు కేవలం సముద్రంలోనే సంభవిస్తాయనుకుంటే పొరబాటు పడినట్లే. ఎందుకంటే చిన్న పాటు కుంటలు, చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లలో కూడా చిన్న పాటి తుపానులు సంభించి ఇలా నీటిలో జీవించే చిన్న చిన్న ప్రాణులు పైకి వెళ్తాయి. అవి సమీపంలోని గ్రామాల వరకు కొట్టుకుపోయి అక్కడ పడి పోతాయి.

ఇలా పడ్డ చేపలను తినొచ్చా?
వర్షాలతో పాటు చేపలు పడతాయి సరే.. కానీ వీటిని తినవచ్చా..? తింటే ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తే ప్రమాదం ఉంటుందా..? వానలతో పాటు పడ్డ పీతలు, చేపలు, కప్పలు ఎంత వరకు సురక్షితం..? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మెదళ్లలో మెదులుతున్నాయి. జగిత్యాలలో పడ్డ జంతువుల వానలో చేపలు నల్లని రంగులో ఉన్నాయి. చూడటానికి కొద్దిగా వింతగా కనిపించాయి. ఆకారం మామూలు చేపల మాదిరి కాకుండా కొద్దిగా వికృతంగా ఉన్నాయి. అయితే ఈ చేపలు తినడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికి రావని వైద్యులు చెబుతున్నారు.

ఈ చేపలను చూసిన కొందరు అవి విషపూరితమైనవని చెప్పారు. ఇలాంటి చేపలు రసాయనాలు వదిలే ఫ్యాక్టరీల సమీపంలో ఉండే చెరువులు, కుంటల్లో ఉంటాయి. సాధారణంగానే ఇవి కలుషితం అవుతుంటాయి. ఈ కలుషిత జలాల్లో ఈ చేపలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు పడుతున్న సమయంలోనే కుంటలు, చెరువుల్లోని జీవులకు ఆక్సిజన్ సరైన మోతాదులో అందదు. అవి ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలం పైకి ఎగురుతుంటాయి. ఇలా ఎగిరిన చేపలు నీటికి ఎదురీది చెరువుల నుండి బయటకు వస్తాయి. ఇలాంటి చేపలను వండుకునే తింటే ప్రాణాలకే ముప్పు అని జువాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

సముద్ర తీరానికి దగ్గర్లో ఉండే ప్రాంతాల్లో ఇలాంటి జంతువుల వాన కురిసిన సందర్భాల్లో వాటిని చక్కగా తినవచ్చని చెబుతున్నారు. సముద్రంలో ఉండే చేపల్లో చాలా వరకు తినేవి ఉంటాయని అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చేప జాతిని బట్టి వాటిని తినవచ్చా లేదా అనేది నిర్ధారించ వచ్చని అధికారులు చెబుతున్నారు. అవి ఎలాంటి చేపలైనా.. ఆకాశం నుండి పడిన సమయంలో వాతావరణంలో నుండే గ్యాస్ లు వాటి శరీరాలను అంటుకునే ప్రమాదం ఉంటుంది. నైట్రోజన్, హైడ్రోజన్ లాంటివి వాటికి తాకుతాయి. కింద పడిన జీవులను వండుకునే ముందు వీటి గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు.

Desktop Bottom Promotion