ఇలాంటి కొడుకు పగోడికి కూడా వద్దు : ఆస్తి కోసం తల్లి శవాన్ని కూడా వదల్లేదు..చితిపైనే అలా చేశాడు..వీడియో చూడండి

రాజస్తాన్‌ లోని కోట్‌ పుట్లి-బెహ్రోర్ జిల్లాలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి మరణించి ఆమె పార్థివదేహం చితిపై ఉండగా ఓ ప్రబుద్ధుడు ఆమె వెండి గాజులు, ఇతర ఆభరణాల కోసం అంత్యక్రియలను అడ్డుకున్నాడు. ఈ దారుణ ఘటన మే 3న రాజస్తాన్‌ లోని కోట్‌ పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని లీలా కా బాస్ కీ ధని గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో సదరు వ్యక్తి చితికి నిప్పు పెట్టే సమయంలో తనకు నగలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ కనిపించడం కలకలం రేపింది.

గ్రామస్థుల కథనం ప్రకారం చిత్రమల్ రేగర్ భార్య అయిన భూరి దేవి మే 3న మరణించారు. ఆమెకు ఏడుగురు కుమారులు కాగా వారిలో ఆరుగురు ఒకే గ్రామంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అయితే,ః ఐదవ కుమారుడైన ఓంప్రకాష్ మాత్రం వారితో ఉండకుండా విడిగా నివసిస్తున్నాడు. ఓంప్రకాష్‌ కు అతని సోదరులకు మధ్య చాలా సంవత్సరాలుగా ఆస్తి విషయంలో తీవ్రమైన వివాదాలు నడుస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ కుటుంబ కలహాలే ఈ అమానవీయ ఘటనకు దారితీశాయని స్పష్టమవుతోంది.

Son Stops Mother s Cremation for Silver Bangles

సంప్రదాయం ప్రకారం భూరి దేవి మరణానంతరం ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తిచేశారు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర ఆభరణాలను తొలగించి, పెద్ద కుమారుడైన గిర్ధారికి అప్పగించారు. తర్వాత కుమారులు, బంధువులు ఆమె పార్థివదేహాన్ని సమీపంలోని శ్మశాన వాటికకు అంతిమ సంస్కారాల కోసం తీసుకెళ్లారు. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఓంప్రకాష్‌ కు, అతని సోదరులకు మధ్య ఆభరణాల విషయమై తీవ్ర వాగ్వాదం చెలరేగింది. శవపేటికను మోసుకెళ్లడంలో పాలుపంచుకున్న ఓంప్రకాష్ దహన సంస్కార స్థలానికి చేరుకున్నాక తన అసలు రంగు బయటపెట్టాడు. గ్రామస్థులు చితిని సిద్ధం చేస్తుండగా ఓంప్రకాష్ అందరూ చూస్తుండగానే చితిపైకి ఎక్కి పడుకున్నాడు.

తన తల్లి వెండి గాజులు, ఇతర ఆభరణాలు తనకు అప్పగించే వరకు దహన సంస్కారాలు జరగనివ్వనని భీష్మించుకు కూర్చున్నాడు. చెక్క దుంగలపై పడుకుని, ఆభరణాలు తనకు దక్కేవరకూ కదలనని మొండిపట్టు పట్టాడు. అతని అనూహ్య ప్రవర్తనతో అక్కడున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు ఓంప్రకాష్‌ను శాంతింపజేయడానికి, నచ్చజెప్పడానికి పదేపదే ప్రయత్నించారు. కన్నతల్లికి కడసారి వీడ్కోలు పలకాల్సిన సమయంలో ఇలా ప్రవర్తించడం తగదని హితవు పలికారు. అయినా ఓంప్రకాష్ వారి మాటలను ఏమాత్రం లెక్కచేయలేదు. చివరికి అతని మొండిపట్టుదల ముందు అందరూ తలవంచాల్సి వచ్చింది. ఆభరణాలను శ్మశాన వాటికకు తీసుకువచ్చి అతనికి అప్పగించారు.

దాదాపు రెండు గంటల పాటు ఈ గందరగోళం కొనసాగింది. ఆభరణాలు చేతికి చిక్కిన తర్వాతే ఓంప్రకాష్ శాంతించి, చితిపై నుంచి దిగాడు. అనంతరం ఆలస్యంగానైనా భూరి దేవి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నతల్లి మరణశయ్యపై ఉండగా కూడా ఆస్తి కోసం ఇంతలా దిగజారిన కుమారుడి ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

Story first published: Saturday, May 17, 2025, 14:17 [IST]
Desktop Bottom Promotion