రూ.10 నోట్లు ఇక చెల్లవా? చిల్లర కష్టాలకు చెక్ పెట్టేలా ఆర్‌బీఐ కొత్త ప్లాన్!

By Naga Tilak

సాధారణంగా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి చిన్న లావాదేవీలో పది రూపాయల పాత్ర చాలా పెద్దది. పాల ప్యాకెట్ దగ్గర నుండి కూరగాయల మార్కెట్ వరకు.. చిల్లర సమస్య రాకుండా ఉండాలంటే మన దగ్గర పది రూపాయల నోటు (10 rupee note) ఉండాల్సిందే. అయితే గత కొన్నాళ్లుగా గమనిస్తే మార్కెట్లో ఈ పది రూపాయల నోట్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అసలు ఎందుకు ఈ కొరత ఏర్పడింది? ఆర్‌బీఐ వ్యూహం ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నోట్లు వర్సెస్ నాణేలు: ఆర్‌బీఐ లెక్కలేంటి?

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒక రూ. 10 నోటును ముద్రించడానికి ఆర్‌బీఐకి దాదాపు రూ. 1.01 ఖర్చు అవుతుంది. అదే ఒక రూ. 10 నాణేన్ని తయారు చేయడానికి దాదాపు రూ. 5.54 ఖర్చు అవుతుంది. నోటు కంటే నాణేనికి ఎక్కువ ఖర్చవుతున్నా ఆర్‌బీఐ నాణేల వైపే మొగ్గు చూపుతోంది. దీనికి ప్రధాన కారణం లైఫ్ టైమ్. ఒక పది రూపాయల నోటు ఏడాది తిరగకముందే చిరిగిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ, నాణేలు మాత్రం దశాబ్దాల తరబడి చెక్కుచెదరకుండా ఉంటాయి. అందుకే పదే పదే నోట్లు ముద్రించే భారం తగ్గించుకోవడానికి పది నోట్లు (10 rupee notes) కు బదులుగా నాణేలను ఎక్కువగా చలామణిలోకి తెస్తున్నారు.


10 rupee notes shortage reasons RBI currency updates and 10 rupee stamp paper scarcity impact on common people in telugu states

రూ. 10 నాణేలపై వదంతులు నమ్మకండి!

గతంలో పది రూపాయల నాణేలు చెల్లవని వచ్చిన పుకార్ల వల్ల ప్రజలు, వ్యాపారులు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ, ఆర్‌బీఐ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. అన్ని రకాల రూ. 10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, ఎవరైనా వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తే బ్యాంకులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నోట్ల కొరత పెరగడంతో జనాల్లో కూడా నాణేల పట్ల ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి.

విద్యార్థులకు, పేదలకు స్టాంప్ పేపర్ల సెగ!

కేవలం నోట్లే కాదు రూ. 10 విలువ గల స్టాంప్ పేపర్లు కూడా ఇప్పుడు మార్కెట్లో దొరకడం గగనమైపోతోంది. సాధారణంగా కాలేజీ అడ్మిషన్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, స్కాలర్‌షిప్స్ లేదా చిన్న చిన్న అద్దె ఒప్పందాల (Rental Agreements) కోసం ప్రజలు ఈ రూ. 10 స్టాంప్ పేపర్లను ఎక్కువగా వాడేవారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ పథకాలకు ఇవే కీలకం. కానీ, గత ఏడాది కాలంగా వీటి ముద్రణ ఆగిపోవడంతో, సామాన్యులు తప్పనిసరి పరిస్థితుల్లో రూ. 50 లేదా రూ. 100 స్టాంప్ పేపర్లను కొనాల్సి వస్తోంది. పది రూపాయలతో అయ్యే పనికి వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం పేదవారిపై అదనపు భారంగా మారింది.

పరిష్కారం ఏంటి?

స్టాంప్ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పుడు 'ఫ్రాంకింగ్' (Franking) మెషిన్లను ప్రోత్సహిస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మనకు కావాల్సిన విలువను తెల్ల కాగితంపైనే ముద్రించి ఇస్తున్నారు. కాబట్టి ఫిజికల్ స్టాంప్ పేపర్ల కోసం ఎదురుచూడకుండా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.

RBI మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మార్కెట్లో నెలకొన్న చిల్లర కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఆర్‌బీఐ ప్రధానంగా రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి, 'ఈ-రూపీ' (Digital Rupee). ఫిజికల్ నోట్లు లేదా నాణేల అవసరం లేకుండానే, ఆఫ్‌లైన్‌లో కూడా (ఇంటర్నెట్ లేకపోయినా) చిన్నపాటి లావాదేవీలు చేసుకునేలా కొత్త టెక్నాలజీని ఆర్‌బీఐ విస్తరిస్తోంది. ఇది అమలులోకి వస్తే ఇక పది రూపాయల చిల్లర కోసం ఎవరినీ బతిమలాడాల్సిన పని ఉండదు. రెండోది దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో 75% నుండి 90% వరకు కనీసం ఒక బాక్స్‌లో అయినా రూ. 100, రూ. 200 నోట్లు తప్పనిసరిగా ఉండాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. దీనివల్ల పెద్ద నోట్లు మాత్రమే వచ్చే సమస్య తగ్గి, మార్కెట్లో చిన్న నోట్ల చలామణి పెరుగుతుంది. అలాగే మారుమూల గ్రామాల్లో 'కాయిన్ మేళాలు' (Coin Melas) నిర్వహించి నాణేలను నేరుగా ప్రజలకు చేరవేసేలా ప్లాన్ చేస్తోంది.

Credit: Goodreturns

Story first published: Friday, December 26, 2025, 10:20 [IST]
Desktop Bottom Promotion