బెంగళూరు అపార్ట్‌మెంట్లలో వింత దందా! వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు!

By Naga Tilak

సాధారణంగా సిటీల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ ఎక్కువ. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే భద్రత ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ బెంగళూరు(Bengaluru) లోని ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ చేస్తున్న పనులు చూస్తుంటే.. అక్కడ భద్రత కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. నేరాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అసోసియేషన్ సభ్యులు, వాటిని అడ్డం పెట్టుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది.

అసలేం జరిగింది?

బెంగళూరు కెంగేరి సమీపంలోని 'ప్రావిడెంట్ సన్‌వర్త్' (Provident Sunworth) అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కొంటోంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే వీరు ఏకంగా 3.3 లక్షల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఈ జరిమానాలు ఏదో పార్కింగ్ కోసమో, నీళ్ల కోసమో వేసినవి కావు. డ్రగ్స్ వాడకం, అసాంఘిక కార్యకలాపాలు వంటి తీవ్రమైన నేరాల కోసం వీరు సొంతంగా 'కోర్టు' పెట్టేసి ఫైన్లు వసూలు చేసేశారు.

డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా.. మీ పాన్ కార్డ్ కూడా పనిచేయదు!

నేరాల రేట్ కార్డు!

విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ఈ అసోసియేషన్ సభ్యులు నేరస్తుల ఆర్థిక స్థితిని బట్టి జరిమానాలు వసూలు చేశారు. ఫ్లాట్లలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత పదార్థాలు దొరికితే ఒకరి దగ్గర రూ. 30 వేలు, మరొకరి దగ్గర రూ. 50 వేల చొప్పున వసూలు చేశారు. ఒక నివాసి పనిమనిషిని వేధించిన ఘటనలో కేవలం 20 వేల రూపాయలు ఫైన్ వేసి ఆ నేరాన్ని పోలీసులకు తెలియకుండా తొక్కేశారు. కాలేజీ విద్యార్థులు నివసించే ఫ్లాట్లపై కన్నేసి, వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.


bengaluru apartment association controversy fine collection for criminal offenses provident sunworth kengeri police investigation

అసోసియేషన్లకు ఆ అధికారం ఉందా?

చట్టం ఏం చెప్తుందంటే.. అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు (RWA) కేవలం కామన్ ఏరియా నిర్వహణ, మెయింటెనెన్స్, చిన్న చిన్న సివిల్ వివాదాల వరకే పరిమితం కావాలి. కర్ణాటక అపార్ట్‌మెంట్ ఓనర్‌షిప్ యాక్ట్ ప్రకారం.. నేరపూరిత కార్యకలాపాలు (Criminal Offences) జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ, సొంతంగా జరిమానాలు వేసి నేరాలను దాచిపెట్టే అధికారం వారికి అస్సలు లేదు.

ఈ ఘటన బెంగళూరు లోని ఇతర అపార్ట్‌మెంట్లలో కలకలం రేపింది. దీంతో ఇప్పుడు ఇతర అసోసియేషన్లు తమ నివాసితులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. "మేము మెయింటెనెన్స్ కోసం మాత్రమే, నేరాలు జరిగితే నేరుగా పోలీసులకే చెప్పండి" అంటూ చేతులు కడుక్కుంటున్నాయి.

నివాసితులు జాగ్రత్తగా ఉండాలి!

మీరు బెంగళూరు(Bengaluru) లో లేదా మరే ఇతర నగరంలో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా, అసోసియేషన్ బైలాస్ (Byelaws) గురించి అవగాహన ఉండాలి. ఎవరైనా సభ్యులు చట్టవిరుద్ధంగా ఫైన్లు వేస్తున్నా లేదా బ్లాక్ మెయిల్ చేస్తున్నా భయపడకుండా పోలీసులను ఆశ్రయించడం ఉత్తమం. లేదంటే ఆ నేరంలో మీరు కూడా భాగస్వాములయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అపార్ట్ మెంట్ వాసులు జాగ్రత్తగా ఉండాలి.
ఈ 'ఫైన్ల దందా' వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారో, ఇలాంటి వసూళ్లు ఇంకెన్ని అపార్ట్‌మెంట్లలో జరుగుతున్నాయో అని ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Credit: Goodreturns

Desktop Bottom Promotion