మగాళ్లకు మెగా ఆఫర్: ఆ ట్యాబ్లెట్ వచ్చేసింది.. ఇక రెచ్చిపోండి!

By Staff

సాధారణంగా కుటుంబ నియంత్రణ లేదా గర్భినిరోధక బాధ్యత అనగానే కేవలం మహిళలే గుర్తుకు వస్తారు. ఇప్పటివరకు పురుషులకు ఉన్న ఏకైక మార్గాలు కండోమ్స్ లేదా వాసెక్టమీ ఆపరేషన్ మాత్రమే. కానీ ఈ అసమానతను తొలగించే దిశగా వైద్య రంగం ఓ భారీ ముందడుగు వేసింది. పురుషుల కోసం హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్ర 'YCT-529' తొలి దశ మానవ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఏమిటీ 'YCT-529' ట్యాబ్లెట్?
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'యువర్ ఛాయిస్ థెరప్యూటిక్స్' అనే బయోటెక్నాలజీ సంస్థ ఈ మాత్రను అభివృద్ధి చేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకుల కృషితో ఇది రూపుదిద్దుకుంది. ఇది పూర్తిగా హార్మోన్ రహిత ట్యాబ్లెట్. గతంలో పురుషుల కోసం చేసిన ప్రయోగాలు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ప్రభావితం చేసేవి.. దీనివల్ల మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి దుష్ప్రభావాలు ఉండేవి. కానీ ఈ 'YCT-529' మాత్రతో అటువంటి సమస్యలు ఉండవు.


Good News for Men Hormone-Free Male Contraceptive Pill YCT-529 Shows Promise

ఇది ఎలా పనిచేస్తుందంటే?
పురుషులలో వీర్యకణాల ఉత్పత్తికి 'విటమిన్-ఏ' కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ నుంచి వచ్చే రెటినోయిక్ యాసిడ్, వృషణాలలోని 'రెటినోయిక్ యాసిడ్ రిసెప్టర్ ఆల్ఫా' (RAR-a) అనే ప్రోటీన్‌తో కలిసినప్పుడే వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి. 'YCT-529' మాత్ర ఈ ప్రోటీన్ మార్గాన్ని తాత్కాలికంగా అడ్డుకుంటుంది. దీనివల్ల వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. కానీ పురుష హార్మోన్ల స్థాయిపై లేదా లైంగిక సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. మాత్రలు వేసుకోవడం ఆపేస్తే, మళ్లీ యథావిధిగా వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

సైంటిస్టులు, వైద్యుల అభిప్రాయం
ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) గైనకాలజీ హెడ్ డాక్టర్ నీనా మల్హోత్రా అభిప్రాయం ప్రకారం.. ఇండియాలో కుటుంబ నియంత్రణ అనేది ఇప్పటికీ మహిళల చుట్టూనే తిరుగుతోంది. 100 మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే.. పురుషులు మాత్రం ఒకరు కూడా ముందుకు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త మాత్ర అందుబాటులోకి వస్తే బాధ్యతను ఇద్దరూ పంచుకునే అవకాశం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

బిర్లా ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ వేదిక బాలి మాట్లాడుతూ, "పురుషులు తమ పౌరుషం దెబ్బతింటుందేమోనని భయపడుతుంటారు. కానీ ఈ మాత్ర హార్మోన్ల మీద పని చేయదు కాబట్టి ఎటువంటి భయం అవసరం లేదు. ప్రతి 72 రోజులకు పురుషులలో కొత్త వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి, కాబట్టి భవిష్యత్తులో సంతానోత్పత్తికి ఎలాంటి ఢోకా ఉండదు" అని వివరించారు.

పురుషుల స్పందన ఏమిటంటే?
కొందరు యువకులు ఈ ప్రయోగాన్ని స్వాగతిస్తుండగా.. మరికొందరు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న యువత బాధ్యతను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో శాశ్వతంగా సంతానలేమి సమస్య వస్తుందేమోనన్న భయం కొందరిలో ఉంది. దీర్ఘకాలిక ఫలితాలు, మరిన్ని ప్రయోగాలు పూర్తయితేనే దీనిని నమ్ముతామని మరికొందరు అంటున్నారు.

తదుపరి దశ ఏమిటి?
ప్రస్తుతం తొలి దశలో భద్రతను పరీక్షించిన శాస్త్రవేత్తలు, తదుపరి దశలో ఈ మాత్ర ఎంతవరకు గర్భాన్ని నిరోధించగలదనే దానిపై సుదీర్ఘ కాలం పాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఇది మార్కెట్లోకి రావడానికి మరికొన్ని ఏళ్లు పట్టవచ్చు. గర్భనిరోధకం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. ఈ కొత్త 'మేల్ పిల్' అందుబాటులోకి వస్తే ఆర్థిక బాధ్యతల్లాగే, పునరుత్పత్తి బాధ్యతను కూడా జంటలు సమానంగా పంచుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

Credit: Oneindia

Story first published: Wednesday, December 31, 2025, 11:53 [IST]
Desktop Bottom Promotion