హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది!

Posted By:

వేడి వేడి ఇడ్లీ అయినా, కరకరలాడే దోశ అయినా.. దానికి సరైన జోడీ చట్నీ ఉంటేనే ఆ మజా వస్తుంది. కానీ రోజువారీ చేసే రొటీన్ చట్నీలతో మీకు బోర్ కొట్టిందా? మీ ఇంట్లో వాళ్లకు పల్లీల చట్నీ అంటే మహా ఇష్టమా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఘాటుగా, రుచికరంగా ఉండే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ ట్రై చేసి చూడండి.

ఈ చట్నీ చేస్తే చాలు మీ ఇంట్లో వాళ్లు రోజూ తినేదాని కంటే మరో రెండు ఇడ్లీలు, దోశలు అదనంగా లాగించేస్తారు. నోరూరించే ఆంధ్రా స్టైల్ వేరుశనగ కారం చట్నీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - పావు కప్పు

నూనె - 4 టేబుల్ స్పూన్లు
సాధారణ ఎండు మిర్చి - 5
కాశ్మీరీ ఎండు మిర్చి - 2
పెద్ద ఉల్లిపాయ - 1
పెద్ద టమాటా - 1
చింతపండు - ఒక చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 3
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక కట్ట

Take a Poll

ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో పావు కప్పు పచ్చి పల్లీలు వేసి, మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి దోరగా వేయించాలి. పల్లీలు మాడిపోకుండా కరకరలాడే వరకు వేయించుకుని, వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక అందులో ఎండు మిర్చి, కాశ్మీరీ ఎండు మిర్చి వేసి కొన్ని సెకన్ల పాటు దోరగా వేయించాలి. అవి వేగుతున్నప్పుడే ఒక చిన్న చింతపండు ముక్క వేసి కలపాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

-ఉల్లిపాయలు కాస్త రంగు మారి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఒకసారి పొడిలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చల్లారిన ఉల్లి-టమాటా-మిర్చి మిశ్రమాన్ని జార్ లో వేయాలి. అవసరమైనన్ని నీళ్లు పోసుకుని, మెత్తని స్మూత్ పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

-చివరిగా చట్నీకి ప్రాణం పోసే పోపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. చివరగా కరివేపాకు వేసి వేయించి, ఆ ఘుమఘుమలాడే పోపును తీసుకువెళ్లి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.

-అంతే నోరూరించే, కమ్మటి, ఘాటైన ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ చట్నీని అద్దుకుని తింటుంటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. దోశ, వడ, ఉతప్పం.. ఇలా దేనితోనైనా ఇది సూపర్ కాంబినేషన్.

[ of 5 - Users]
Story first published: Thursday, March 5, 2026, 16:15 [IST]
Desktop Bottom Promotion