చలిలో వేడి వేడిగా..ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Posted By:

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్స్ జాబితాలో పావ్ బాజీ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ముంబై వీధుల్లో దొరికే పావ్ బాజీ రుచి అద్భుతంగా ఉంటుంది. అదే స్ట్రీట్ స్టైల్ రుచితో పావ్ బాజీ మీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - 3
క్యాలీఫ్లవర్ - 1 కప్పు
పచ్చి బఠానీలు - అర కప్పు
క్యారెట్ - 1
వెన్న- 100 గ్రాములు
నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
క్యాప్సికమ్- 1
టమోటాలు - 3
పసుపు -పావు టీస్పూన్
కశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
పావ్ బాజీ మసాలా - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - సన్నగా తరిగినది
నిమ్మరసం - 1 చెక్క
ఫుడ్ కలర్ - చిటికెడు
పావ్ బన్స్ - 8

Authentic Street Style Pav Bhaji Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్, బఠానీలు, క్యారెట్ ముక్కలను కుక్కర్ లో వేసి, అవి మునిగేంత వరకు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి (సుమారు 3-4 విజిల్స్).

-ఉడికించిన తర్వాత నీటిని వడకట్టి కూరగాయలను పప్పు గుత్తితో లేదా స్మాషర్ తో మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న బాండీ లేదా పెనం పెట్టుకోండి. అందులో వెన్న, కొంచెం నూనె వేడి చేయండి. జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి.

-ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు, కొంచెం ఉప్పు వేసి, టమోటాలు మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి.

-తర్వాత మంట తగ్గించి పసుపు, కశ్మీరీ కారం, పావ్ బాజీ మసాలా,కసూరి మేతి చేత్తో నలిపి వేయాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి, కొంచెం కొత్తిమీర చల్లాలి.

-ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని ఈ మసాలాలో వేసి బాగా కలపాలి. అవసరమైతే వేడి నీటిని పోసి గ్రేవీని సరిచేసుకోవాలి. స్మాషర్ తో మళ్ళీ ఒకసారి బాండీలోనే మిశ్రమాన్ని మెదుపుతూ కలపాలి. ఇది స్ట్రీట్ స్టైల్ టెక్స్చర్ ఇస్తుంది.

-చివరిగా రుచికి సరిపడా ఉప్పు, మరొక స్పూన్ వెన్న, కొత్తిమీర, నిమ్మరసం పిండి, మూత పెట్టి 5-10 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. అంతే వేడి వేడి బాజీ రెడీ

-ఇప్పుడు పావ్ బన్స్ ను మధ్యలోకి కట్ చేయాలి. పెనంపై కొంచెం వెన్న వేసి, దానిపై చిటికెడు పావ్ బాజీ మసాలా,కొత్తిమీర చల్లాలి. పావ్ ను ఆ వెన్నపై పెట్టి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి.

ఒక ప్లేట్ లో వేడి వేడి బాజీని వడ్డించి, దానిపై ఒక వెన్న ముద్ద వేయండి. పక్కన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలు, కాల్చిన పావ్ బన్స్ పెట్టి సర్వ్ చేయండి.

[ of 5 - Users]
Story first published: Friday, December 5, 2025, 7:37 [IST]
Desktop Bottom Promotion