సాయంత్రం స్నాక్‌ గా కరకరలాడే చికెన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

Posted By:

సాయంత్రం కాగానే ఏదైనా వేడిగా, కరకరలాడుతూ తినాలనిపించడం సహజం. అటువంటి సమయంలో నాన్ వెజ్ ప్రియులకు వెంటనే గుర్తొచ్చే అద్భుతమైన స్నాక్ చికెన్ పకోడి. బయట కరకరలాడుతూ, లోపల మృదువుగా, జ్యూసీగా ఉండే చికెన్ పకోడీలను ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు.

రుచిలోనే కాదు, పోషకాలను అందించడంలోనూ చికెన్ మేటి. మన శరీరానికి, కండరాల నిర్మాణానికి అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల ప్రోటీన్ చికెన్ ద్వారా లభిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, జింక్, సోడియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

చికెన్ పకోడి తయారీకి కావాల్సిన పదార్థాలు

బోన్‌ లెస్ చికెన్ - 150 గ్రాములు
గుడ్డు - 1
శనగపిండి - 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 2
కారం - 1 టీస్పూన్
పసుపు - 1 చిటికెడు
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
కొత్తిమీర తరుగు - గుప్పెడు
వంట సోడా - 1 చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

చికెన్ పకోడి తయారీ విధానం

-ముందుగా బోన్‌ లెస్ చికెన్‌ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, కొద్దిగా నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా కుక్కర్‌లో ఉడికించడం వల్ల చికెన్ ముక్కలు లోపల మెత్తగా, పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్‌ గా ఉడుకుతాయి.

-బాగా ఉడికిన చికెన్ ముక్కలను నీళ్లు లేకుండా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, శనగపిండి, వంట సోడా వేయాలి. చివరగా ఒక గుడ్డును పగలగొట్టి వేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి.

-మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తేనే కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. పిండి మరీ పల్చగా జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ముక్కలకు పిండి కోటింగ్ కరెక్ట్‌ గా పట్టేలా కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌ లో పెట్టి చికెన్ మిశ్రమాన్ని చిన్న పకోడీల్లా నూనెలో వేయాలి. పకోడీలను మరీ లావుగా వేస్తే లోపల సరిగ్గా ఉడకవు. కాబట్టి మీడియం సైజులో వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

-అంతే వేడి వేడి చికెన్ పకోడి రెడీ. వీటిని టొమాటో సాస్ లేదా ఆనియన్ రింగ్స్‌తో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion