పూరీ, చపాతీలోకి అదిరిపోయే స్పెషల్ చికెన్ గ్రేవీ..ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే!

Posted By:

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు.. ఇంటి నిండా సందడి, ఘమఘమలాడే వంటకాల వాసనలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో పూరీ లేదా చపాతీతో పాటు నాన్-వెజ్ ఉండాల్సిందే. అయితే ప్రతిసారీ చేసే సాధారణ చికెన్ కూర కాకుండా, ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయండి.

ఒక ప్రత్యేకమైన మసాలాను అప్పటికప్పుడు రుబ్బుకుని గ్రేవీలో కలిపితే ఆ రుచే వేరు. రుచికరమైన, హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు- 100 గ్రాములు
పచ్చి కొబ్బరి ముక్కలు - 3
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10
గసగసాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
చికెన్ - ముప్పావు కేజీ
నూనె- 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2
లవంగాలు - 6
యాలకులు - 2
అనాస పువ్వు - 2
బిర్యానీ ఆకులు - 2
పెద్ద ఉల్లిపాయలు - 4
టొమాటోలు - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి -ఒకటిన్నర టేబుల్ స్పూన్
కారం-1 టేబుల్ స్పూన్
గరం మసాలా-అర టీస్పూన్
జీలకర్ర పొడి- పావు టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా ఒక చిన్న గిన్నెలో జీడిపప్పు, గసగసాలను వేసి వేడి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టండి.

-ఆ తర్వాత మిక్సీ జార్‌ లో చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి, మిరియాలు, సోంపు, నానబెట్టిన జీడిపప్పు-గసగసాల మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి వేయించాక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.

-ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి బంగారు రంగులోకి వచ్చాక అందులో తరిగిన టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. టొమాటోలు పూర్తిగా మగ్గి, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.

-ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కుక్కర్‌ లో వేయండి. ఇందులోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి. మూత పెట్టి (విజిల్ లేకుండా) 5 నిమిషాల పాటు సన్నని మంటపై చికెన్‌ ను మగ్గనివ్వండి.

-5 నిమిషాల తర్వాత మూత తీసి, మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి-ఉల్లిపాయ పేస్ట్‌ ను చికెన్‌ లో వేయండి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి బాగా కలపండి. చివరగా 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర చల్లి కుక్కర్ మూత పెట్టండి. మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

-ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూస్తే.. ఘమఘమలాడే చికెన్ గ్రేవీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, December 25, 2025, 8:56 [IST]
Desktop Bottom Promotion