గుమ్మడికాయతో ఇలా చట్నీ చేస్తే..టిఫిన్స్,వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్

Posted By:

సాధారణంగా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ లోకి మన ఇళ్లలో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ చేస్తుంటాం. కానీ రోజూ అవే తిని తిని పిల్లలకే కాదు, పెద్దలకు కూడా బోర్ కొట్టేస్తుంది. ఏదైనా కొత్త రుచిని ప్రయత్నించాలనిపిస్తుంటే పసుపు గుమ్మడికాయతో చట్నీ ట్రై చేసి తీరాల్సిందే.

గుమ్మడికాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సాధారణంగా మనం గుమ్మడికాయను సాంబార్‌ లో వేయడానికో లేదా తీపి కూర వండుకోవడానికో మాత్రమే వాడుతుంటాం. కానీ ఈసారి గుమ్మడికాయతో కమ్మటి చట్నీ చేసి చూడండి.. దీని రుచి మాటల్లో చెప్పలేం. తీపి, పులుపు, కారం కలగలిసిన ఈ చట్నీ ఇడ్లీ, దోసెలే కాదు వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్ గా ఉంటుంది. గుమ్మడికాయ చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పసుపు గుమ్మడికాయ: పావు కిలో
పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు
ఎండు మిరపకాయలు: 4
నువ్వులు: 1 టీస్పూన్
పల్లీలు లేదా జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
చింతపండు: ఉసిరికాయంత
బెల్లం: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టీస్పూన్లు
తాలింపు కోసం:
ఆవాలు: అర టీస్పూన్
మినపప్పు: అర టీస్పూన్
ఎండుమిర్చి: 1
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారీ విధానం

-ముందుగా పసుపు గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కను చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-కుక్కర్ లో గుమ్మడికాయ ముక్కలను వేసి, అందులోనే ఉసిరికాయంత చింతపండు, చిన్న బెల్లం ముక్క, సరిపడా ఉప్పు, ముక్కలు ఉడకడానికి అవసరమైనంత తక్కువ నీటిని పోయాలి. కుక్కర్ మూత పెట్టి కేవలం ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

-గుమ్మడికాయ ఉడికేలోపు స్టవ్ పై ఒక చిన్న పాన్ పెట్టి నూనె లేకుండా ఎండు మిరపకాయలు,నువ్వులను దోరగా వేయించుకోవాలి. అలాగే పల్లీలను కూడా వేయించుకోవాలి.

-ఉడికించిన గుమ్మడికాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము, వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, నువ్వులు, పల్లీలు వేసి ఒకసారి తిప్పాలి. ఆ తర్వాత ఉడికించిన గుమ్మడికాయ ముక్కలను ఉడికించిన నీటితో సహా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-చివరగా చట్నీకి అసలైన రుచినిచ్చేది తాలింపు. దీనికోసం ఒక చిన్న కడాయిలో నూనె వేడి చేసి, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మినపప్పు బంగారు రంగులోకి మారాక, ఆ వేడి వేడి తాలింపును చట్నీలో వేసి బాగా కలపాలి.

-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే పసుపు గుమ్మడికాయ చట్నీ రెడీ. దీనిని వేడి వేడి ఇడ్లీలు, క్రిస్పీ దోసెలు లేదా ఊతప్పంతో సర్వ్ చేస్తే.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion