నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

సాయంత్రం వేళ వేడివేడి టీ లేదా కాఫీ తాగుతున్నప్పుడు, తోడుగా ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజానే వేరు. బయట బండ్ల మీద, బేకరీలలో దొరికే మసాలా పల్లీలు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ అవి నూనెలో డీప్ ఫ్రై చేసి ఉంటాయని, ఆరోగ్యానికి మంచిది కాదని తినడానికి వెనుకాడుతుంటాము.

ఇకపై ఆ చింతే అక్కర్లేదు. కేవలం చెంచాన్నర నూనెతో, అస్సలు డీప్ ఫ్రై చేయకుండానే అచ్చం బయట కొన్నట్టుగా అదిరిపోయే మసాలా పల్లీలు ఇంట్లోనే చిటికెలో తయారు చేసుకోవచ్చు. పులుపు, కారం, వెల్లుల్లి ఘాటుతో నోరూరించే ఈ హెల్దీ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

How to Make Crispy No Depp Fry Masala Peanuts Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

వేయించిన పల్లీలు (ఉప్పు లేనివి) - ఒకటి ముప్పావు కప్పులు
వేరుశనగ నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
శనగపిండి - 1 టీస్పూన్

మసాలా మిశ్రమం కోసం:

కశ్మీరీ కారం - ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఆమ్చూర్ పొడి - పావు టీస్పూన్
వెల్లుల్లి పొడి - ఒకటింబావు టీస్పూన్
నల్ల ఉప్పు - చిటికెడు
ఇంగువ - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - చిటికెడు

బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే!

తయారీ విధానం

-ముందుగా ఒక చిన్న గిన్నెలో పైన చెప్పిన మసాలా మిశ్రమం పదార్థాలన్నింటినీ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. శనగపిండిని మాత్రం ఈ మిశ్రమంలో కలపకుండా విడిగా ఉంచండి.

-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాన్ పెట్టి, మంటను పూర్తిగా తగ్గించండి. అందులో వేరుశనగ నూనె వేసి కొద్దిగా వేడి చేయండి. నూనె వేడెక్కగానే, కలిపి ఉంచుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి ఒక్కసారి గరిటెతో కలపండి. మసాలాలు మాడిపోకముందే వెంటనే వేయించిన పల్లీలను అందులో వేసేయండి.

-మసాలా పొడి అంతా పల్లీలకు సమానంగా పట్టేలా, గరిటెతో తరచుగా కలుపుతూ సుమారు 3 నిమిషాల పాటు సన్నని సెగపై వేయించండి.
ఆ తర్వాత విడిగా ఉంచిన శనగపిండిని పల్లీలపై చల్లి, మరో 2 నిమిషాల పాటు ఆపకుండా కలుపుతూ వేయించండి. శనగపిండి పచ్చి వాసన పూర్తిగా పోయి, పల్లీలకు చక్కటి కోటింగ్ వచ్చేవరకు వేయించాలి.

-అంతే కరకరలాడే మసాలా పల్లీలు రెడీ. చాట్ మసాలా, నల్ల ఉప్పులో ఇప్పటికే ఉప్పు ఉంటుంది కాబట్టి సాధారణ ఉప్పును చాలా తక్కువగా, రుచి చూసుకుని వేసుకోండి.

-పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాతే గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. అప్పుడే ఇవి చాలా రోజుల పాటు మెత్తబడకుండా కరకరలాడుతూ తాజాగా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Saturday, November 14, 2026, 18:39 [IST]
Desktop Bottom Promotion