చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ..

Posted By:

ఆగస్టు 15 మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ రోజు రాగానే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. ఈ రోజున ఇళ్లు, వీధులు, స్కూల్స్ అనే తేడా లేకుండా ప్రతి చోటా త్రివర్ణ శోభ సంతరించుకుంటుంది. ఈ జాతీయ పండుగ రోజున ఆనందాన్ని రెట్టింపు చేయడానికి, మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన, రుచికరమైన స్వీట్ తయారు చేయాలని ఆలోచిస్తున్నారా?

దేశభక్తిని, కమ్మటి రుచిని కలబోసిన త్రివర్ణ కొబ్బరి బర్ఫీ(ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ) మీకు బెస్ట్ ఆప్షన్. కొబ్బరి, పాలతో సులభంగా తయారుచేసుకునే ఈ స్వీట్, నోట్లో వేసుకుంటే కరిగిపోవడమే కాదు, చూసేందుకు మన జాతీయ జెండాను తలపిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Independence Day Special Coconut Burfi Quick and Easy Tiranga Coconut Barfi Recipe for August 15th

ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు

ఎండు కొబ్బరి తురుము - 2 కప్పులు
కండెన్స్డ్ మిల్క్ - 1 కప్పు
పాలు - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టీస్పూన్
యాలకుల పొడి - అర టీస్పూన్
ఫుడ్ కలర్స్ - కుంకుమపువ్వు రంగు (ఆరెంజ్), ఆకుపచ్చ రంగు
అలంకరణకి: బాదం, పిస్తా పప్పులు

పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యి వేడి అయ్యాక, ఎండు కొబ్బరి తురుము వేయాలి. మంటను పూర్తిగా సిమ్‌ లో ఉంచి, కొబ్బరి రంగు మారకుండా 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా నెమ్మదిగా వేయించాలి.

ఇప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి మిశ్రమాన్ని నిరంతరం కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటికి మిశ్రమం చిక్కబడి, పాన్ అంచులకు అంటుకోకుండా ముద్దలా మారుతుంది. ఈ దశలో కమ్మటి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడిని చల్లి, స్టవ్ ఆపేయండి.

-సిద్ధం చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా విడదీసుకోండి. మన జాతీయ జెండాలోని తెలుపు రంగు కోసం ఒక భాగాన్ని అలాగే వదిలేయండి. రెండవ భాగానికి కొద్దిగా కుంకుమపువ్వు (ఆరెంజ్) రంగును, మూడవ భాగానికి ఆకుపచ్చ రంగును కలపండి. రంగులు మరీ ముదురుగా కాకుండా చూసుకుంటే బర్ఫీ మరింత నాజూకుగా కనిపిస్తుంది.

-ఒక ట్రే లేదా పళ్ళెం తీసుకుని దానికి అడుగున నెయ్యి రాసి సిద్ధం చేసుకోండి. ముందుగా ఆకుపచ్చని మిశ్రమాన్ని తీసుకుని అడుగు భాగంలో సమానంగా పరచండి. ఆ తర్వాత తెలుపు రంగు మిశ్రమాన్ని దానిపై సున్నితంగా అద్ది, పైన కుంకుమపువ్వు రంగు మిశ్రమాన్ని పరచండి. ప్రతి పొరను గరిటెతో గట్టిగా నొక్కుతూ, పైన అంతా మృదువుగా ఉండేలా సరిచేయండి.

-ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనిచ్చి, ఆ తర్వాత 1-2 గంటల పాటు ఫ్రిజ్‌ లో ఉంచండి. బర్ఫీ బాగా సెట్ అయి గట్టిపడిన తర్వాత, బయటకు తీసి మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కత్తిరించుకోండి. పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా ముక్కలతో అందంగా అలంకరించుకోండి.

-అంతే నోరూరించే త్రివర్ణ కొబ్బరి బర్ఫీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, August 14, 2026, 13:06 [IST]
Desktop Bottom Promotion