కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

Posted By:

సాయంత్రం కాగానే ఏదైనా వేడివేడిగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుందా? బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు.. చేతిలో వేడివేడి టీ, ప్లేట్‌ లో క్రిస్పీ స్నాక్స్ ఉంటే ఆ మజాయే వేరు. అలాంటి అద్భుతమైన స్నాక్ కోసం మీరు వెతుకుతుంటే.. కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ మీకు బెస్ట్ ఆప్షన్.

బెంగళూరు - మైసూర్ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే మద్దూర్ వడలను, మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Karnataka Special Maddur Vada Recipe in Telugu Crispy Evening Snack at Home

మద్దూర్ వడ తయారీకి కావలసిన పదార్థాలు

ఉల్లిపాయలు - 300-400 గ్రాములు
బొంబాయి రవ్వ (సూజీ) - 1 కప్పు
మైదా పిండి - 2 కప్పులు
బియ్యం పిండి - 2 కప్పులు
పచ్చిమిర్చి - 3
అల్లం తరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 2 టేబుల్ స్పూన్లు
పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - పావు కప్పు
తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
వేడి నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి

మద్దూర్ వడ తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆ తర్వాత అందులో బొంబాయి రవ్వ, మైదా, బియ్యం పిండి వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. అలాగే వేయించి కచ్చాపచ్చాగా దంచిన పల్లీలు, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి.. ఈ పదార్థాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలా చేత్తో గట్టిగా నలుపుతూ కలపాలి.

-వడలు కరకరలాడుతూ రావాలంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనె లేదా కరిగించిన నెయ్యి పోయాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల వడలు చాలా గుల్లగా వస్తాయి. నూనె వేసిన తర్వాత పిండిని పొడిగా ఉన్నప్పుడే ఓసారి బాగా మిక్స్ చేయాలి.

-ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని తేమ బయటకు వస్తుంది కాబట్టి నీళ్లు ఒకేసారి పోయకూడదు. కలిపిన పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

-చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిలో నుంచి నిమ్మకాయ సైజులో చిన్న ముద్దను తీసుకోవాలి. అరచేతిలో లేదా నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ పైన పెట్టి వడల్లాగా కొంచెం పలుచగా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఉంటే లోపల ఉడకదు.

-స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి, ఒత్తుకున్న వడలను జాగ్రత్తగా నూనెలో వేయాలి. రెండు వైపులా తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చే వరకు ఓపికగా వేయించి బయటకు తీసుకోవాలి.

-అంతే నోరూరించే మద్దూర్ వడలు రెడీ. వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో గానీ, మీకు ఇష్టమైన మరేదైనా చట్నీతో గానీ తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 30, 2026, 12:10 [IST]
Desktop Bottom Promotion