ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేసుకోండి..అన్నం,చపాతీలోకి సూపర్

Posted By:

ఉల్లిపాయలు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇంట్లో మనం చేసే దాదాపు అన్ని వంటల్లో ఉల్లిపాయ వాడుతుంటాం. అయితే ఉల్లిపాయతోనే పచ్చడి చేస్తే..ఊహిస్తేనే నోరూరిపోతుంది కదా. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడయినా లేదా కొత్తగా ఏదైనా తినాలనిపిస్తుంటే మాత్రం ఓ సారి ఉల్లిపాయ పచ్చడి ట్రై చేయండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యిలో కలుపుకొని తింటుంటే నోటికి స్వర్గమే. ఇడ్లీ,దోశ వంటి వాటితో కూడా ఇది చాలా బాగుంటుంది. దీనిని తయారుచేయడం కూడా చాలా సులభం. కేవలం 10 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆయిల్
-ఉల్లిపాయ
-జీలకర్ర
-చింతపండు
-పసుపు
-ఉప్పు
-కారం
-కొత్తిమీర
-కరివేపాకు
-వెల్లుల్లి
-తాలింపు గింజలు
-ఎండు మిరపకాయలు

No Veggies No Problem Make Onion Pickle Recipe in Just 10 Minutes

ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో సన్నగా, పొడవుగా కట్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయల ముక్కలు, పొట్టు తీసిన 7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు ఉల్లిపాయలను వేయించుకోవాలి.

-ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో అరకట్ట కాడలతో సహా కొత్తిమీర, 2 టీస్పూన్ల కారం, ఉసిరికాయ సైజు అంత చింతపండు, చిటికెడు పసుపు వేసి మీడియం మంట మీద మరో నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.

-ఉల్లిపాయల మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత దానిని మిక్సీ గిన్నెలో వేసి అందులోనే 1 టీస్పూన్ జీలకర్ర వేసి మొత్తాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లా వేసుకోవద్దు.

-ఈ పచ్చడిని ఓ బౌల్ లోకి తీసుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెడయ్యాక అందులో 1 టీస్పూన్ తాళింపు గింజలు, 2 ఎండు మిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.

-వేగిన తాళింపుని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. తర్వాత అందులోనే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతే నోరూరించే ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఇది దాదాపు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, September 26, 2025, 8:04 [IST]
Desktop Bottom Promotion