వానొచ్చినా, చలేసినా.. పోషకాలు,రుచి కలగలిపిన టమాటో కొబ్బరి రసం..వేడి అన్నంతో తింటుంటే ఇంద్రలోకం!

Posted By:

వర్షాలు పడుతున్న టైంలో లేదా వాతావరణం కూల్ గా ఉన్న సమయంలో ఒకసారి టమాటో కొబ్బరి రసం ట్రై చేయండి. టమాటో కొబ్బరి రసం రుచిగా, కమ్మగా ఉంటుంది. ఇది పోషక విలువలను అందిస్తుంది. ఈ రసాన్ని వేడి వేడిగా అన్నం లేదా రొట్టెలతో కలిపి తీసుకుంటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది.

ముఖ్యంగా చలికాలంలో లేదా జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. టమాటో కొబ్బరి రసం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటో
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఆవాలు
-మినపప్పు
-జీలకర్ర
-వెల్లుల్లి
-మిరియాలు
-ఉల్లిపాయ
-కొత్తిమీర
-కరివేపాకు
-కొబ్బరి
-చింతపండు
-పసుపు
-ఉప్పు
-కారం
-ఆయిల్

తయారీ విధానం

-ముందుగా నాలుగు టమాటోలకు గాట్లు పెట్టుకోండి. ఒక్కో టమాటోకి నాలుగు భాగాలుగా చాకుతో గాట్లు పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కొంచెం వేడయ్యాక గాట్లు పెట్టిన నాలుగు టమాటోలను అందులో వేయండి. టమాటోలకి గాటు పెట్టడం వల్ల అవి ఉడికినప్పుడు తొక్క ఈజీగా వచ్చేస్తుంది.

-టమాటోలు బాగా ఉడికి తొక్క ఈజీగా వచ్చేస్తుందన్నప్పుడు స్టవ్ ఆపేయండి. టమాటోలను ఒక ప్లేట్ లోకి తీసుకోండి. వేడి చల్లారక టమాటోల మీద తొక్కను చేత్తో తీసేయాలి. తొక్కను పడేసేయాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో తొక్క తీసేసిన టమాటోలు, పావు కప్పు కొబ్బరి ముక్కలు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి

-తర్వాత 1 టీస్పూన్ మిరియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. రోలు లేకుంటే మిక్సీ గిన్నెలో సపరేట్ గా వేసి అయినా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి తాళింపుకి తగినంత ఆయిల్ పోసి వేడి చేశాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయల ముక్కలు, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ ఆవాలు,1 ఉల్లిపాయ సన్నని తరుగు, 3 పచ్చిమిరపకాయల చీలికలు, కొంచెం కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి మిరియాల మిశ్రమం వేసి వేయించాలి.

-ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిన వెంటనే అందులో గ్రైండ్ చేసిన టమాటో కొబ్బరి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, సరిపడా కారం వేసి బాగా కలిపి 7 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి.

-దించేసే 1నిమిషం ముందు అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని, టీస్పూన్ నెయ్యి వేసుకోండి. అంతే టమాటో కొబ్బరి రసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 30, 2025, 11:15 [IST]
Desktop Bottom Promotion