పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చిరుధాన్యాల్లో రారాజు అయిన రాగులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే రాగులను ఏదో ఒక రూపంలో తరచూ మన ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. మామూలు రాగుల కంటే మొలకెత్తిన రాగులు మరీ మంచివి. ఎందుకంటే మొలకలు రావడం వల్ల వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయి. పైగా సులభంగా జీర్ణం అవుతాయి. మొలకెత్తిన రాగులతో, ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి ఇంట్లోనే ఎంతో సులభంగా రాగి మాల్ట్ పౌడర్ తయారుచేసుకోవచ్చు.

Ragi Malt Powder Recipe in Telugu Double the Nutrition Double the Energy Sprouted Ragi Malt at Home

రాగి మాల్ట్ పౌడర్ తయారీకి కావలసిన పదార్థాలు

రాగులు - ఒక కిలో
ఫూల్ మఖానా - ఒక కప్పు
బాదం, జీడిపప్పులు - అర కప్పు
పిస్తా పప్పులు - పావు కప్పు
శొంఠి పొడి - 2 టేబుల్ స్పూన్లు
గుమ్మడి గింజలు - 4 టేబుల్ స్పూన్లు
యాలకులు - 8
పంచదార లేదా బెల్ల పొడి - కప్పున్నర

రాగి మాల్ట్ పౌడర్ తయారీ విధానం

ముందుగా రాగులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి సుమారు పది గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత ఆ నీళ్లను పూర్తిగా వంపేసి, ఒక కాటన్ క్లాత్ లో వేసి కాస్త వదులుగా మూట కట్టాలి. ఆ మూటను ఒక రోజంతా కదపకుండా అలా వదిలేస్తే.. రాగులకు చక్కగా మొలకలు వస్తాయి.

ఇప్పుడు ఆ మొలకెత్తిన రాగులను ఎండ తగలకుండా నీడలో, గాలి తగిలే చోట రెండు రోజుల పాటు ఆరబెట్టాలి. అవి పట్టుకుంటే పొడిపొడిలాడుతూ, పూర్తిగా ఎండిపోయేలా చూసుకోవాలి.

తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టి అందులో బాదం, జీడిపప్పు, పిస్తా, గుమ్మడి గింజలు, ఫూల్ మఖానాలను నూనె లేకుండా విడివిడిగా, దోరగా వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారాక, అందులో యాలకులు వేసి మిక్సీలో మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత బాగా ఆరిన మొలకెత్తిన రాగులను కూడా మిక్సీలో పట్టి మెత్తని పిండిలా చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్, శొంఠి పొడి, పంచదార పొడి లేదా బెల్లం పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.

అంతే ఎంతో బలవర్ధకమైన రాగి మాల్ట్ పౌడర్ రెడీ. దీనిని తడిలేని, ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో భద్రం చేసుకుంటే చాన్నాళ్ల పాటు నిల్వ ఉంటుంది. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో లేదా నీళ్లలో రెండు స్పూన్ల పౌడర్ కలుపుకుని తాగితే అమృతంలా ఉంటుంది.

Ragi Malt Powder Recipe in Telugu Double the Nutrition Double the Energy Sprouted Ragi Malt at Home

పోషక విలువలు

క్యాల్షియం, ఐరన్: రాగుల్లో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తడం వల్ల విటమిన్ సి కూడా తోడై ఐరన్ ను శరీరం వేగంగా గ్రహిస్తుంది.

ప్రొటీన్, ఒమేగా-3: డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజల ద్వారా శరీరానికి మేలు చేసే ప్రొటీన్, మెగ్నీషియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా అందుతాయి.

ఫైబర్ (పీచు): ఇందులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

-ఎదిగే పిల్లలకు, వయసు పైబడిన వారికి ఎముకలు, దంతాలు ధృడంగా ఉండటానికి ఈ రాగి మాల్ట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

- ఇందులో వాడిన శొంఠి, యాలకులు, డ్రై ఫ్రూట్స్ శరీరంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచుతాయి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు దరిచేరవు.

-ఉదయం పూట ఈ మాల్ట్ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి, మెదడు ఎదుగుదల మెరుగుపడుతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, June 18, 2026, 10:56 [IST]
Desktop Bottom Promotion