ప్రోటీన్ పవర్: రాగి పెసళ్ల దోశ ఇలా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

Posted By:

మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రాగులు ఒక పెద్ద వరం. రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు తరచూ చెబుతుంటారు. అలాంటి శక్తివంతమైన రాగులతో, హై ప్రొటీన్ ఉండే పెసళ్లతో కమ్మనైన దోశ చేస్తే అదిరిపోతుంది.

రాగి పెసళ్ల దోశ అనేది కేవలం ఒక వంటకం కాదు, అది ఒక సంపూర్ణ పోషకాహారం. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ దోశను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మీ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అటు రాగుల శక్తి, ఇటు పెసళ్ల ప్రోటీన్ కలిసి మీ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. సాధారణ బియ్యం దోశ లేదా మినప దోశ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రాగి పెసళ్ల దోశ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి పెసళ్ల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగులు
-తెల్ల మినపప్పు
-బియ్యం
-పెసళ్లు
-మెంతులు
-క్యారెట్ తురుము
-ఉల్లిపాయ తరుగు

రాగి పెసళ్ల దోశ తయారీ విధానం

-ముందులో ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులో 1 కప్పు రాగులు, 1 కప్పు పెసళ్లు, అర కప్పు తెల్ల మినపప్పు, 2 స్పూన్ల బియ్యం, 1 స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి 8-10 గంటలు నానబెట్టుకోవాలి.

-తర్వాత నీటిని వంపేసి మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

-రుబ్బుకున్న పిండిని ఓ గిన్నెలో వేసి స్పూన్ తో ఒకసారి కలుపుకున్నాక మూతపెట్టేసి 6-7 గంటలు వదిలేయాలి.

-తర్వాత మూత తీస్తే పిండి బాగా పులిసి ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలపాలి.

-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి.

-వేడెక్కిన పెనం మీద గరిటెడు పిండితో దోశ పోసుకోండి. దోశ మీద క్యారెట్ తురుము, ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి. దీంతో రుచి మరింత పెరుగుతుంది. దోశ బాగా కాలిన తర్వాత ఓ ప్లేట్ లోకి తీసుకోండి. దోస రెండు వైపులా తిప్పి కాల్చుకోనక్కర్లేదు, ఒకవైపు కాల్చితే సరిపోతుంది.

-అంతే హెల్దీ రాగి పెసళ్ల దోశ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion