రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు!

Posted By:

మాంసాహారం పేరు వింటేనే భోజన ప్రియుల మనసు ఉప్పొంగుతుంది. అందులోనూ రాజస్థానీ సంప్రదాయ వంటకం లాల్ మాస్(ఎర్రటి మాంసం) గురించి చెబితే నోట్లో నీళ్లూరక మానవు. ఒకప్పుడు రాజులు వేటకు వెళ్లినప్పుడు అడవిలో దొరికే మాంసంతో దీనిని వండేవారు. అందుకే దీనికి జంగిల్ మాస్ అని కూడా పేరు. ఈ వంటకానికి ఆ ఎర్రటి రంగు, అద్భుతమైన రుచి రావడానికి కారణం ఇందులో వాడే ప్రత్యేక మిరపకాయలు. ఇంట్లోనే అచ్చమైన రాజస్థానీ స్టైల్‌ లో లాల్ మాస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Rajasthani Famous Laal Maas Recipe in Telugu Perfect Mutton Curry for Extreme Non Veg Lovers

లాల్ మాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

మటన్ (లేత మాంసం) - 1 కిలో
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు (70శాతం వెల్లుల్లి,30శాతం అల్లం)
ఆవ నూనె - 1 కప్పు
నెయ్యి -పావు కప్పు
మథానియా మిరపకాయలు - 20
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 250 గ్రాములు
గడ్డ పెరుగు - 200 గ్రాములు
ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
కారం -అర టీస్పూన్
లవంగాలు - 2 నుంచి 3
నల్ల మిరియాలు - 10
చిన్న యాలకులు - 2
పెద్ద యాలకు - 1
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

లాల్ మాస్ తయారీ విధానం

ముందుగా మథానియా మిరపకాయలను గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత నీరు తీసేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌ లా గ్రైండ్ పక్కన పెట్టుకోండి.

మటన్‌ ను శుభ్రంగా కడిగి, దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి కనీసం 1-2 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి.

తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ఆవనూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి అవి గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి. ఆ వెంటనే 1-2 గంటల పాటు పక్కన పెట్టిన మటన్‌ ను అందులో వేయండి.

మటన్ వేసాక బాగా కలపాలి. వేయించేటప్పుడు మటన్ నుండి నీరు బయటకు వస్తుంది. ఆ నీరు పూర్తిగా ఆవిరైపోయి, మాంసానికి మంచి రంగు వచ్చే వరకు ఓపిగ్గా వేయించాలి.

ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మథానియా మిరపకాయల పేస్ట్ వేసి కలపాలి. మటన్ 70 శాతం ఉడికే వరకు ఈ పేస్ట్‌ తో కలిపి వేయించండి.

ఒక చిన్న గిన్నెలో పెరుగు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మటన్‌ లో వేసి కలపాలి. తగినంత ఉప్పు వేసుకుని మూతపెట్టి సన్నటి మంటపై మరో 30 నిమిషాల పాటు ఉడికించండి. మాంసం మెత్తగా ఉడికాక, పైన నెయ్యి, కొత్తిమీర చల్లుకుని దించుకుంటే.. వేడి వేడి లాల్ మాస్ రెడీ. దీనిని అన్నం, రోటీ లేదా బగారా రైస్‌ తో తింటే అద్భుతంగా ఉంటుంది.

Rajasthani Famous Laal Maas Recipe in Telugu Perfect Mutton Curry for Extreme Non Veg Lovers

పోషక విలువలు (ఒక సర్వింగ్‌ కు సుమారుగా)
క్యాలరీలు: 450 - 500 kcal
ప్రోటీన్: 30 - 35 గ్రాములు
ఫ్యాట్స్: 30 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 10 గ్రాములు
ఫైబర్: 2 గ్రాములు

ఆరోగ్య ప్రయోజనాలు

-మటన్‌ లో ఉండే అధిక నాణ్యత గల ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు చాలా సహాయపడుతుంది.

-ఎర్ర మాంసంలో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించి, శరీరంలో శక్తిని పెంచుతాయి.

-మథానియా మిరపకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion