సంక్రాంతి స్పెషల్.. కరకరలాడే వెన్న జంతికలు..ఇలా చేస్తే రుచి అదుర్స్!

Posted By:

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ అంటేనే భోగి మంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, ముఖ్యాంగా నోరూరించే పిండి వంటలు. సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటా ఘుమఘుమలాడే వాసనలు వస్తుంటాయి.

అరిసెలు, సకినాలు, గారెలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే, సాయంత్రం పూట టీతో పాటు అద్భుతంగా రుచినిచ్చే స్నాక్ జంతికలు. వీటిని కొన్ని ప్రాంతాల్లో మురుకులు అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం సంక్రాంతికి మీ ఇంట్లో కరకరలాడే రుచికరమైన జంతికలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sankranti Special How to Make Crispy and Tasty Janthikalu at Home Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పెసరపప్పు
-మినపప్పు
-వెన్న
-వాము
-నువ్వులు
-ఉప్పు
-కారం
-పుట్నాల పప్పు
-ఇంగువ
-ఆయిల్

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కేజీ బియ్యం(4 గ్లాసులు)వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరగ్లాసు(125 గ్రా)తెల్ల మినపప్పు వేసి ఎర్రగా వేయించుకున్నాక వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో అర గ్లాసు పెసరపప్పు(125గ్రా)వేసి లైట్ గా కలర్ మారేవరకు వేయించుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు బియ్యం,వేయించిన మినపప్పు,పెసరపప్పు,అరగ్లాసు తినే శనగపప్పు(పుట్నాల పప్పు)మొత్తాన్ని మిల్లుకి ఇచ్చి మెత్తని పిండిలా పట్టించుకోవాలి.

-తర్వాత పిండిని జల్లించుకోవాలి.

-జల్లించుకున్న పిండిలో 1టేబుల్ స్పూన్ వాము, 3 టేబుల్ స్పూన్ల పచ్చి నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ ఇంగువ వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోనే 80 గ్రాముల వెన్న వేసి పిండికి పట్టేలా బాగా కలుపుకోండి.

-కలిపిన పిండిని కొంచెం ఓ ప్లేట్ లోకి తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని నీళ్లను పోసి లైట్ గా మెత్తగా ఉండేలా కలుపుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చెయ్యాలి. జంతికల గొట్టంలో పిండి పెట్టే ముందు ఒకసారి ఆ పిండి మళ్లీ చేత్తో కలుపుకొని పెట్టండి. తర్వాత ఆయిల్ లో జంతికలు వత్తుకోవాలి.

-మీడియం మంట మీద బాగా కాలనిచ్చి పైన వచ్చే నురగలు తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండువైపులా బాగా కాలిన తర్వాత నూనెలో నుంచి బయటకు తీసేయాలి. మిగిలిన పిండితో కూడా ఇలాగే చేసుకోండి. అంతే క్రిస్పీ జంతికలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, January 12, 2026, 11:08 [IST]
Desktop Bottom Promotion