శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడే రాగి రోటీ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే

Posted By:

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాగి రోటీ ఒక ప్రసిద్ధ, ఆరోగ్యకరమైన అల్పాహారం లేదా భోజన వంటకం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, రాగులలో ఉండే అద్భుతమైన పోషక ప్రయోజనాల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి రోటీని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించి, ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది. రాగి రోటీని మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాగి రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగి పిండి: 2 కప్పులు (సుమారు 250 గ్రాములు)
-నీరు: 2 కప్పులు
-ఉల్లిపాయ: 1
-పచ్చిమిర్చి: 2-3
-కరివేపాకు: 1 రెబ్బ
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
-తురిమిన క్యారెట్ లేదా దోసకాయ లేదా సోరకాయ: 1/2 కప్పు
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నూనె: 2-3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో 2 కప్పుల నీటిని తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నీరు బాగా మరిగే వరకు వేడి చేయాలి.

-నీరు మరిగేటప్పుడు మంటను తగ్గించి ఆ మరుగుతున్న నీటిలో రాగి పిండిని నెమ్మదిగా వేస్తూ ఒక గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.

-పిండి అంతా నీటిని పీల్చుకుని ఒక ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆపి మూత పెట్టి 5-10 నిమిషాలు ఆవిరిలో మగ్గనివ్వాలి. ఇది పిండిని మెత్తగా చేయడానికి సహాయపడుతుంది.

-పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకోవాలి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర,తురిమిన కూరగాయలు వేయాలి.

-ఈ మిశ్రమాన్ని చేతితో బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు చిలకరించి పిండిని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే రోటీలు పగులుతాయి మరీ మెత్తగా ఉంటే సరిగ్గా రావు. పిండిని బాగా కలిపితే రోటీలు మెత్తగా వస్తాయి.

-ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ లేదా బటర్‌ పేపర్‌ పై కొద్దిగా నూనె రాయాలి. సిద్ధం చేసుకున్న రాగి పిండి ముద్దలో నుండి ఒక నిమ్మకాయ సైజు ముద్దను తీసుకుని షీట్‌పై పెట్టి చేత్తో నెమ్మదిగా వలయాకారంగా పలుచగా తట్టాలి. అంచులు పగలకుండా చూసుకోవాలి.

-కాటన్ గుడ్డను తడిపి, దానిపై పిండిని తీసుకుని చేత్తో తట్టవచ్చు.

-స్టవ్ మీద ఒక పెనం వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా తట్టిన రాగి రోటీని పెనంపై వేయాలి. మీడియం మంటపై రోటీకి అంచుల వెంబడి కొద్దిగా నూనె వేసి కాల్చాలి.

-ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు తిప్పి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చాలి. రోటీలు బాగా కాలి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.

-అదే విధంగా మిగిలిన పిండితో రోటీలను తయారు చేసుకోవాలి.

-వేడి వేడి రాగి రోటీలను పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, బెల్లం, పెరుగు లేదా ఏదైనా నచ్చిన కూరతో సర్వ్ చేసుకోవడమే.

[ of 5 - Users]
Desktop Bottom Promotion