ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు

Posted By:

ఇడ్లీల్లోకి నంజుకోవడానికి రోజూ తినే కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, సాంబార్ తిని విసుగొచ్చిందా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, ఎంతో రుచికరమైన రోడ్డు సైడ్ టమాటా గ్రేవీని మీ ఇంట్లోనే ట్రై చేయండి. తమిళనాడులో రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే ఈ టమాటా గ్రేవీకి ఎంతో క్రేజ్ ఉంది. ఇడ్లీ, దోసెల్లోకి ఇది అమృతంలా ఉంటుంది.

ఈ గ్రేవీని కొద్దిగా నీళ్లలా పలచగా చేస్తే చాలు.. ఇంట్లో వాళ్లు ఇడ్లీలను లెక్కపెట్టకుండా మరీ లాగించేస్తారు. పైగా దీన్ని తయారు చేయడం చాలా సులభం, తక్కువ సమయంలోనే అయిపోతుంది. తమిళనాడు రోడ్ సైడ్ స్టైల్ టమాటా గ్రేవీని మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Tamil Nadu Street Style Tomato Gravy for Idli Recipe in Telugu

కావలసిన పదార్థాలు

టమాటాలు - 4
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 2
పెద్ద ఉల్లిపాయలు - 2
ధనియాల పొడి - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ఇడ్లీ పిండి - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నీళ్లు - గ్రేవీకి తగినంత

కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, అందులో 4 టమాటాలను వేసి సుమారు 10 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టండి. తర్వాత వాటిని నీటిలోంచి తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక వాటిని మిక్సీ జార్‌ లో వేసి మెత్తటి పేస్ట్‌ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేయించండి. వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించండి.

- తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్‌ ను పాన్‌ లో వేయండి. దానికి గ్రేవీకి తగినన్ని నీళ్లు జతచేసి, అందులో ధనియాల పొడి, కాశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయే వరకు సుమారు 5 నిమిషాల పాటు ఉడికించండి.

-గ్రేవీ బాగా మరుగుతున్న సమయంలో, ముందుగా కొద్దిగా నీళ్లలో కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ గ్రేవీలో పోసి.. ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.

-గ్రేవీ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ కలిసేలా మరో 3 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనిచ్చి, చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో గుమగుమలాడే రోడ్డు సైడ్ టమాటా గ్రేవీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 28, 2026, 16:25 [IST]
Desktop Bottom Promotion