పిల్లలకు బలం,పెద్దలకు ఆరోగ్యం..మన పూర్వీకుల హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రాగి పిట్టు ఎలా చేసుకోవాలంటే..

Posted By:

భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రాగులు అనాదిగా ఆహారంలో ముఖ్య భాగంగా ఉంది. రాగులతో తయారుచేసే వంటకాలలో రాగి పిట్టు లేదా రాగి పుట్టు ఒకటి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన సాంప్రదాయ అల్పాహారం. రాగుల సహజ పోషకాలు, బెల్లం, కొబ్బరి వంటి పదార్థాల కలయికతో ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ బలాన్నిచ్చే ఆహారంగా నిలుస్తుంది. ప్రత్యేకించి రక్తహీనతతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, పెరుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది.

ముఖ్యంగా పెద్దమనిషి అయిన సమయంలో ఆడపిల్లలకు చేసిపెట్టాల్సిన వంటకం ఇది. దీన్ని తింటే భవిష్యత్తులో వారికి ఎలాంటి నడుము నొప్పులు ఉండవు. ఆడపిల్లలకే కాకుండా మగపిల్లలకు కూడా వారానికి 2 సార్లు ఇది చేసిపెట్టడం వల్ల భవిష్యత్తులో వారికి నడుం నొప్పి రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన రాగి పిట్టును ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

The Ancient Superfood Boost Your Health with Traditional Ragi Puttu Recipe in Telugu

రాగి పిట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగులు
-బెల్లం తురుము
-కొబ్బరి తురుము
-యాలకల పొడి
-ఉప్పు
-నీళ్లు

రాగి పిట్టు తయారీ విధానం

-ఒక బౌల్ రాగులను తీసుకొని వాటిని మిక్సీలో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.

-తర్వాత ఓ గిన్నెలో గ్రైండ్ చేసిన రాగిపిండి వేసి,ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి.

-ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఎలా కలుపుకోవాలంటే.. ముద్ద చేస్తే ముద్దలా రావాలి, పొడి చేస్తే పొడిలా రాలిపోవాలి.

-తర్వాత మూతి వెడల్పు ఉండే గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి నీటిలో తడిపిన క్లాత్ ని గిన్నె మీద పరిచి తాడుతో క్లాత్ ని కట్టేయాలి.

-తర్వాత కలిపిన పిండిని ఈ క్లాత్ మీద వేసుకొని ఎక్స్ ట్రా ఉన్న క్లాత్ ని పిండిమీదకు లాగి ఓ గిన్నెను లేదా డీసును దీనిమీద బోర్లించుకోవాలి.

-ఇప్పుడు రాగి పిట్టు ఉన్న గిన్నెను పైన బోర్లించిన డీసుతో సహా అలాగే స్టవ్ మీద పెట్టి 15-20 నిమిషాలు ఉడికించాలి.

-రాగి పిట్టు ఉడికిన తర్వాత చాక్లెట్ రంగులోకి మారుతుంది. స్పూన్ తో పిండిని లోపల వరకు గుచ్చి లోపలి వరకు ఉడికిందో లేదో చూడండి

-ఉడికిన రాగి పుట్టుని మరో గిన్నెలో వేసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఇందులోనే పావుకప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము(మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు పెట్టే పనయితే పచ్చికొబ్బరికి బదులు ఎండుకొబ్బరి వేయాలి) 1 టీస్పూన్ యాలకల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే టేస్టీ రాగి పిట్టు రెడీ. ఇది 1 రోజు మాత్రమే నిల్వ ఉంటుంది.

-కావాలనుకుంటే రాగిపిట్టు కొంచెం వేడిగా ఉణ్నప్పుడే అందులో నెయ్యి వేసుకొని కలుపుకొని అయినా తినవచ్చు.

[ of 5 - Users]
Story first published: Saturday, October 11, 2025, 7:48 [IST]
Desktop Bottom Promotion