బిర్యానీ, చపాతీ, పరోటాలోకి అదిరిపోయే కాంబినేషన్..కేరళ స్టైల్ చికెన్ రోస్ట్..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

చికెన్ వంటకాల గురించి మాట్లాడుకుంటే కేరళ రాష్ట్రం గురించి ప్రస్తావించకుండా ఉండలేం. అక్కడి సుగంధ ద్రవ్యాలు, వంటల రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. కేరళ వంటకాల్లో వాడే మసాలాలు, కొబ్బరి నూనె, కరివేపాకు సాధారణ చికెన్ కూరను కూడా అద్భుతమైన రుచిగా మారుస్తాయి.

కేరళలోని హోటళ్లకు వెళ్తే అక్కడ దొరికే చికెన్ రోస్ట్ రుచిని అస్సలు మర్చిపోలేరు. వేడి వేడి బిర్యానీ, చపాతీ లేదా పరోటాతో ఈ రోస్ట్‌ ని నంజుకు తింటే ఆ మజానే వేరు. కేరళ స్టైల్ చికెన్ రోస్ట్ ని మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Ultimate Kerala Style Chicken Roast for Spice Lovers Recipe in Telugu

కావలసిన పదార్థాలు
చికెన్: అర కిలో
పెరుగు: 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 4
టమోటా: 1
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
కారం: 2 టీస్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ధనియాల పొడి: 2 టీస్పూన్లు
చికెన్ మసాలా: 1 టీస్పూన్
లవంగాలు: 1 టీస్పూన్
దాల్చిన చెక్క: 1 టీస్పూన్
ఏలకులు పొడి: 1 టీస్పూన్
సోంపు: పావు టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకోండి. అందులో పెరుగు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఫ్రిజ్‌లో పెడితే ముక్కలు ఇంకా మెత్తగా ఉడుకుతాయి.

-తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి బాండీలో నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత సోంపు వేసి వేయించండి. ఇప్పుడు పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మంటను మీడియంలో ఉంచండి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు ఓపికగా వేయించాలి. ఆ తర్వాత తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.

-ఇప్పుడు ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న గరం మసాలా పొడి (లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క పొడి) వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి. మసాలాలు మాడిపోకుండా చూసుకోవాలి.

-ఇప్పుడు అందులో తరిగిన టమోటాలు, కరివేపాకు, చిటికెడు కుంకుమపువ్వు వేసి బాగా కలపండి.

-టమోటాలు మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాక అందులో పక్కన పెట్టుకున్న చికెన్‌ వేసి బాగా కలపండి. ఇందులో ప్రత్యేకంగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.

-సుమారు 20-25 నిమిషాల్లో చికెన్ మెత్తగా ఉడికి, నీరంతా ఆవిరైపోయి నూనె పైకి తేలుతుంది. ఈ దశలో చికెన్ మసాలా పౌడర్ చల్లి, మరో నిమిషం పాటు వేయించి, చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో రుచికరమైన, స్పైసీ కేరళ చికెన్ రోస్ట్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, February 8, 2026, 9:06 [IST]
Desktop Bottom Promotion