నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్

Posted By:

చల్లటి వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం వేళ వేడివేడిగా, కరకరలాడుతూ ఏదైనా స్నాక్ తినాలనిపించడం సహజం. మీరు ఏదైనా పండగ పూజలో ఉన్నా లేదా ఉపవాసం చేస్తున్నప్పుడు రుచికరమైన స్నాక్ తినాలనుకుంటే, ఈ నోరూరించే సగ్గుబియ్యం పాప్స్ మీకు బెస్ట్ ఛాయిస్.

పైన క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండే ఈ స్నాక్ ని ఘాటైన పల్లీ-కొత్తిమీర చట్నీతో అద్దుకుని తింటే ఆ మజాయే వేరు. సగ్గుబియ్యం పాప్స్, పల్లీ-కొత్తిమీర చట్నీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Vrat Special Crispy Sabudana Pops Recipe in Telugu Healthy Snack for a Rainy Evening

సగ్గుబియ్యం పాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

రాత్రంతా నానబెట్టిన సగ్గుబియ్యం - అర కప్పు
బంగాళదుంపలు - 2
పల్లీలు- పావు కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
జీలకర్ర - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ (కచ్చాపచ్చాగా దంచిన ఎండుమిర్చి) - 1 టేబుల్ స్పూన్
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - తగినంత
ఉప్పు -సరిపడా (ఉపవాసం ఉంటే సైంధవ లవణం వాడుకోండి)
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

పల్లీ-కొత్తిమీర చట్నీ కోసం
తాజా కొత్తిమీర - 1 చిన్న కట్ట
వేయించిన పల్లీలు - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
పెరుగు - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - సగం చెక్క
ఉప్పు - రుచికి తగినంత

ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే!

సగ్గుబియ్యం పాప్స్ తయారీ విధానం

-ముందుగా ఒక చిన్న రోలు లేదా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రాత్రంతా నానబెట్టి, నీళ్లు వంపేసిన సగ్గుబియ్యం తీసుకోండి. అందులోనే ఉడికించిన బంగాళదుంపలను ముద్దలు లేకుండా మెత్తగా తురుముకోవాలి. ఈ మిశ్రమంలో కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం-పచ్చిమిర్చి మసాలా పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.

-అన్ని పదార్థాలు ఒకదానికొకటి బాగా కలిసేలా చేత్తో మెత్తగా కలుపుకోవాలి. మిశ్రమం ఒక ముద్దలా తయారవ్వాలి. ఇప్పుడు మీ అరచేతులకు కొద్దిగా నూనె రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి.

-స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి, బాల్స్‌ ను నూనెలో వేయాలి. ఇవి అన్ని వైపులా కరకరలాడుతూ, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌ లోకి మార్చుకోండి.

-అంతే సగ్గుబియ్యం పాప్స్ రెడీ.

పల్లీ-కొత్తిమీర చట్నీ తయారీ విధానం

-మిక్సీ జార్‌ లో శుభ్రం చేసిన కొత్తిమీర, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేయండి. అన్నింటినీ మెత్తటి, క్రీమీ చట్నీలా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకుని కన్సిస్టెన్సీ సరిచేసుకోవచ్చు.

-అంతే రుచికరమైన చట్నీ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion