Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు!

Posted By:

మనదేశంలో ఎక్కడో ఒకటి అరా తప్ప దాదాపు అందరూ తమ ఇళ్లల్లో వంట కోసం గ్యాస్ స్టవ్ నే ఉపయోగిస్తున్నారు. అయితే వంటగదిలో వంట చేస్తున్న టైంలో గ్యాస్ స్టవ్ మంటను ఎప్పుడైనా తీరికగా గమనించారా? ఆ మంట స్వచ్ఛమైన నీలం రంగులో కాకుండా, పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే..ఏదోలే, మంట వస్తోంది కదా అని లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

చాలామంది ఇది సాధారణమే అనుకుని అస్సలు పట్టించుకోరు. కానీ పసుపు రంగు మంట వస్తుందంటే గ్యాస్ పూర్తిగా మండటం లేదని అర్థం. దీనివల్ల గ్యాస్ వృధా అవ్వడమే కాకుండా వంట పాత్రల అడుగుభాగం నల్లగా మసిబారుతుంది.

Want Your Gas Cylinder to Last Longer Check Your Stove s Flame Color Now

మంట రంగు ఎందుకు మారుతుంది?

గ్యాస్, ఆక్సిజన్ కచ్చితమైన పాళ్ళలో కలిసి, దహన ప్రక్రియ సంపూర్ణంగా జరిగినప్పుడు మాత్రమే మంట స్వచ్ఛమైన నీలి రంగులో వస్తుంది. ఇలా వస్తే ఇంధనం ఏమాత్రం వృధా కాకుండా ఆదా అవుతున్నట్లు లెక్క. ఈ నీలి మంట స్థిరంగా ఉండి, మధ్యలో ముదురు నీలం రంగుతో, చుట్టూ లేత నీలం రంగు శంకువు ఆకారంలో ప్రశాంతంగా మండుతుంది.

కానీ గ్యాస్ బర్నర్‌ లకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు లేదా గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు దహన ప్రక్రియ అసంపూర్తిగా జరుగుతుంది. అప్పుడు గ్యాస్‌ లోని మండని కార్బన్ కణాలు వేడెక్కి, మంట పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్టవ్ భాగాల్లో నూనె, జిడ్డు, దుమ్ము, ఆహార వ్యర్థాలు పేరుకుపోవడమే.

మళ్లీ నీలి రంగు మంటను తిరిగి పొందాలంటే ఇలా చేయండి

గ్యాస్ బర్నర్ రంధ్రాలు

వంట చేసేటప్పుడు పాలు, పప్పు పొంగిపోవడం లేదా నూనె మరకలు పడటం వల్ల బర్నర్‌ లోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. దీన్ని సరిచేయడానికి బర్నర్‌ ను తీసి వెనిగర్, బేకింగ్ సోడా కలిపిన ద్రావణంలో ఓ 15 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత పాత టూత్‌ బ్రష్ లేదా సేఫ్టీ పిన్‌ తో ఆ రంధ్రాల్లో ఉన్న మురికిని వదిలించండి.

కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే..

ఎయిర్ వెంట్ (మిక్సింగ్ ట్యూబ్)

గ్యాస్ స్టవ్ అడుగుభాగంలో బర్నర్ పైపుకి దగ్గరగా ఒక చిన్న ఎయిర్ వెంట్ ఉంటుంది. ఇక్కడే గ్యాస్‌ తో ఆక్సిజన్ కలుస్తుంది. ఇందులో సాలెగూళ్లు, దుమ్ము లేదా జిడ్డు పేరుకుపోతే ఆక్సిజన్ అందక మంట పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని శుభ్రమైన దూది గుడ్డతో లేదా సన్నని బ్రష్‌ తో జాగ్రత్తగా క్లీన్ చేయండి.

గ్యాస్ నాజిల్, పైపు

బర్నర్ కింద ఉండే చిన్న నాజిల్‌ లో తరచుగా మసి లేదా చెత్త పేరుకుపోయి గ్యాస్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. స్టవ్ ఆపేసి, ఆ పైపులో కొద్దిగా గాలి ఊదండి. లేదా నాజిల్ దగ్గర ఉన్న మసిని ఒక సన్నని సూదితో చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా శుభ్రం చేయండి. దీంతో గ్యాస్ ప్రెజర్ పెరిగి మంట వెంటనే మళ్లీ నీలి రంగులోకి మారుతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, August 20, 2026, 15:57 [IST]
q
Desktop Bottom Promotion