Latest Updates
-
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
నోట్లతో మేడలు, పలకరింపుల్లో ప్యాకేజీలు.. ఈనాటి బంధుత్వాల్లో కనుమరుగుతున్న ఆప్యాయతలు.!
మనిషికి విలువ అనేది ఆ వ్యక్తి వద్ద ఉన్న డబ్బు, హోదా, అధికారంపైనే ఆధారపడి ఉందనేది వాస్తవం. నీ దగ్గర ఎంత సంస్కారం ఉన్నా, ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా జీవించే ఆత్మవిశ్వాసం ఉన్నా వాటికి గుర్తింపు లేదు. సొంత తల్లిదండ్రుల నుంచి తోడబుట్టిన వారు, బంధుమిత్రుల వరకు వారి మధ్య ఆప్యాయతలను డబ్బు డామినేట్ చేస్తోందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి జీవన చక్రం చాలా మారిపోయింది. ముప్పై ఏళ్ల క్రితం కుటుంబాల్లో ఉన్న ఆప్యాయతలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. బ్యాంకులో సున్నాలు పెరిగి బ్యాలెన్స్ పెరుగుతుంది. కానీ మన సర్కిల్‌లో బంధుమిత్రులు పలచబడుతున్నారు. నోట్లతో మేడలు కడుతున్నారు. కానీ రక్త సంబంధీకులతో ఆప్యాయతలను గుండెల్లో దాచుకోలేనంత పేదవారిగా బతుకుతున్నారు.
ముప్పై ఏళ్లు వెనక్కి వెళితే..
ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లి మన తాతలు, తండ్రులు.. వారి వారి కుటుంబీకులతో గడిపిన రోజులు అడిగి తెలుసుకుంటే నేటి కాలంలో బంధాలు ఎంత కమర్షియల్‌గా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఆస్తులు పెంచుకోవాలనే ఆరాటం లేదు. విలాసాలు, ఆర్భాటాలు లేవు. బంధాలు చిక్కగా ఉండేవి. ఎప్పుడూ తోబుట్టువులు, బంధుమిత్రుల రాకతో ఇల్లంతా సందడిగా ఉండేది. పొయ్యి నిత్యం వెలుగుతూ ఉండేది. పండుగలొచ్చినా, చిన్న వేడుకలు జరిగినా చిన్న పెద్దా అందరూ కలిసి సంతోషంగా జరుపుకొనేవారు.
ఆత్మీయతలు కలగలిసిన రోజులు
ఆ రోజుల్లో ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకుంటే కష్టసుఖాలు చెప్పుకొనేవారు. ఆత్మీయులు ఆర్థిక బాధల్లో ఉన్నారని తెలిసినా, ఆపదలో ఉన్నారని అనిపించినా వెంటనే చేయూత అందించేవారు. తల్లిదండ్రుల నుంచి వేలు విడిచిన చుట్టం వరకూ ఒకే రకమైన ఆప్యాయత, పలకరింపు కనిపించేవి. అందుకే ఆ రోజుల్లో ఒంటరితనం ఉండేది కాదు. నలుగురి మధ్య కాలం గడుపుతూ జీవిత చరమాంకాన్ని ముగించేవారు. పుట్టిన నాటి నుంచి వృద్ధాప్యం వరకు కుటుంబీకులు ఎప్పుడూ పక్కనే ఉంటూ ధైర్యాన్ని, తోడుని అందించేవారు.
మన తాతలు, తండ్రుల కాలంలో ఇతరుల విజయాన్ని సైతం తమ గెలుపుగా సెలబ్రేట్ చేసుకునేవారు. ఇప్పటిలా ఏసీ గదుల్లో నాలుగు గోడల మధ్య కాకుండా ఆరుబయట, మేడ పైనా మంచం వేసుకుని, హాయిగా కబుర్లు చెప్పుకొంటూ ప్రశాంతమైన నిద్రను పొందేవారు. సూర్యుడు రాకముందే నిద్ర లేచి రోజువారీ పనుల్లో మునిగిపోయేవారు.

రక్త సంబంధీకుల్లోనే పోటీ
కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, కార్పొరేట్ చదువులు మన జీవితాల్లోకి వచ్చిననాటి నుంచి సొంత రక్త సంబంధీకుల్లోనే పోటీ పెరిగింది. ఇద్దరు మనుషులు కలిస్తే వారి మధ్య ఆత్మీయ మాటల కంటే సంపాదన, హోదా, విలాసాలు, ఇల్లు కట్టుకోవడం, దర్జా ఇలాంటి ప్రదర్శనలకే ఆస్కారం ఎక్కువగా ఉంటోంది. సాటి మనిషి కష్టాల్లో ఉన్నారనే సాయం చేయాల్సివస్తుందనే ఆలోచనతో దూరం పెట్టడం చేస్తున్నారు. మీ పిల్లాడి ప్యాకేజీ ఎంత.. మా పిల్లలు ఇంత సంపాదిస్తున్నారంటూ గొప్పలు చెప్పుకొంటారు. ఆత్మీయుల మధ్య కలిసి ఉండటం కంటే విదేశాల్లో ఏసీ గదుల్లో పని చేయడం గొప్పగా భావిస్తున్నారు. ఫలితంగా తోబుట్టువుల మధ్య, బంధుమిత్రుల మధ్య ఈర్ష్య, అసూయ, అహంకారం అనేవి అడ్డుగోడలుగా నిలిచాయి.
బంధాల్లో వ్యాపారం
ఆస్తుల కోసం రక్త సంబంధీకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ రోజుల్లో బంధాలు అనేవి వ్యాపారంగా మారాయి. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోవడం కంటే వాట్సాప్ గ్రూపుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అయిన వారు అందరూ ఉన్న వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఫలితంగా ఒత్తిడి పెరిగి వయసు పెరగకుండానే అకాల మరణాలు పొందుతున్నారు.
భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి
ఈ తరమే ఇలా ఉంది అంటే.. ఇక ఏ ఆత్మీయతలకి నోచుకోని భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మన రాబోయే తరాలకు బంధాల విలువలను తెలియజేయాలి. ఆప్యాయతల మధ్య వారిని పెంచాలి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడటం.. సరికాదని మీ పిల్లలకు చెప్పి పెంచడంతో పాటు మీరు వాటిని పాటించి పంతాలు, పట్టింపులు మానేసి ఆత్మీయులతో కలిసి ఆనందంగా గడపాలి.



Click it and Unblock the Notifications