ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది?

ప్రపంచాన్ని తమ స్మార్ట్‌ ఫోన్‌ లో బంధించిన జెన్ జీ యువత.. నిజమైన బంధాలను ఏర్పరచుకోవడంలో మాత్రం చతికిలపడుతోంది. ఒకప్పుడు ప్రేమ, పెళ్లి అంటే ఎంతో ఉత్సాహం చూపించిన యువత, ఇప్పుడు డేటింగ్ యాప్స్ అన్నా, రిలేషన్‌ షిప్స్ అన్నా విరక్తి చెందుతున్నారు. గంటల కొద్దీ సోషల్ మీడియాలో, రీల్స్ ప్రపంచంలో గడుపుతున్న వారు.. వాస్తవ ప్రపంచంలో మనుషులతో సమయం గడపడానికి వెనుకడుగు వేస్తున్నారు. అసలు ఈ తరం యువత ప్రేమకు, బంధాలకు ఎందుకు దూరమవుతోంది? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Swiping Left on Love Why Gen Z Prefers Reels Over Real Relationships or Dating

రిజెక్షన్ భయం.. ఆత్మవిశ్వాసం లోపం
బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన వీట్లీ ఇన్‌ స్టిట్యూట్, ఇన్‌ స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది.

అమెరికాలోని 22 నుంచి 35 ఏళ్ల యువతపై చేసిన ఈ సర్వేలో..ప్రతి ముగ్గురు అబ్బాయిల్లో ఇద్దరు, అలాగే ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో నలుగురు కొత్తగా ప్రేమ బంధాన్ని ప్రారంభించడానికి భయపడుతున్నారని తేలింది. బంధంలోకి అడుగుపెట్టక ముందే భాగస్వామిలో లోపాలు వెతకడం ఈ తరం అలవాటుగా మార్చుకుంది. దీనికి ప్రధాన కారణం రిజెక్షన్ (తిరస్కరణ) భయం, కొత్త బంధాన్ని నడిపించగలమనే ఆత్మవిశ్వాసం లోపించడమే.

బంధాలకు యువత దూరంగా ఉండటానికి ప్రధాన కారణాలు

కెరీర్ రేస్: లైఫ్‌ లో త్వరగా సెటిల్ అవ్వాలి, ఆర్థికంగా స్థిరపడాలి అనే పరుగు పందెంలో పడి వ్యక్తిగత బంధాలను పక్కన పెడుతున్నారు.

సోషల్ మీడియా ఒత్తిడి: ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఇతరుల ఫేక్ జీవితాలతో తమను తాము పోల్చుకుని తీవ్రమైన అభద్రతాభావానికి గురవుతున్నారు.

ఎమోషనల్ భయాలు: ఎక్కడ తమను రిజెక్ట్ చేస్తారో, బ్రేకప్ అయితే ఆ మానసిక క్షోభను ఎలా భరించాలో అన్న భయం వారిని వెంటాడుతోంది. డేటింగ్ చేయడాన్ని వారు ఒక పెద్ద 'రిస్క్'గా భావిస్తున్నారు.

మానసిక సమస్యలు: పైకి నవ్వుతూ కనిపించినా.. లోపల ఒంటరితనం, డిప్రెషన్ లాంటివి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

భ్రమల ప్రపంచం.. కమ్యూనికేషన్ గ్యాప్

టిండర్, బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్ వల్ల యువతలో ఒక విచిత్రమైన భ్రమ ఏర్పడింది. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా" అనే ఆలోచన వల్ల ఎవరితోనూ ఒక స్థిరమైన బంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు. దీనికి తోడు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెరిగింది.

చాటింగ్‌ లు, ఎమోజీలతో భావాలను పంచుకోవడం అలవాటైన ఈ తరం.. ఎదురుగా కూర్చుని మనసులోని మాటలు చెప్పలేకపోతున్నారు. ఇక గతంతో పోలిస్తే నేటి యువత (అమ్మాయిలు, అబ్బాయిలు) ఆర్థికంగా స్వతంత్రులు కావడం వల్ల ఒకరిపై ఒకరు ఆధారపడటం తగ్గింది. ఇది మంచి పరిణామమే అయినా.. బంధాల కోసం అడ్జస్ట్ అయ్యే తత్వాన్ని పూర్తిగా తగ్గించేసింది.

ఒంటరితనం అనే మహమ్మారి
ఈ సమస్య కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాలేదు. మన దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లోనూ, ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. బ్రేకప్ బాధలు భరించలేక, తమ చుట్టూ తామే ఒక అదృశ్య గోడను నిర్మించుకుని ఒంటరి ప్రపంచంలో బతుకుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఒంటరితనం అనేది ఒక మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Story first published: Wednesday, June 24, 2026, 15:55 [IST]
Desktop Bottom Promotion