Garuda Puranam: మనుషులు చేసే 7 సాధారణ తప్పులు..చనిపోయాక నరకంలో వీరికి విధించే శిక్షలు ఏంటో తెలుసా

జీవితంలో ఏదో ఒక సందర్భంలో గరుడ పురాణం అనే పదం గురించి వినే ఉంటాం. భూలోకంలో మనుషులు చేసే తప్పులకు మరణం తర్వాత నరకంలో విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది అని చెబుతుంటారు. హిందూమతంలోని 18 మహాపురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుడకి కొన్ని ముఖ్య విషయాలను చెప్పాడు..వాటి సారాంశమే గరుడ పురాణం.ఈ పురాణంలో నీతి,ధర్మం, పునర్జన్మ, మరణం తర్వాత జరిగే కర్మకాండలు, ఆత్మ ప్రయాణం, స్వర్గం, నరకం గురించిన వివరాలు విస్తృతంగా వివరించబడ్డాయి.

మీరు జీవితంలో మెరుగుపడాలనుకుంటే లేదా సరైన మార్గంలో నడవాలని కోరుకుంటే గరుడ పురాణాన్ని చదవమని తరచుగా మన పెద్దలు లేదా పండితుల చెబుతుంటారు. ఎందుకంటే గరుడ పురాణంలో మరణానంతర జీవితంలో మానవునికి జరిగే కర్మ ఫలాలు కావచ్చు లేదా వారి పాప శిక్షలు కావచ్చు ప్రతిదాని గురించి వివరంగా ఉంది. వాస్తవానికి వివిధ పాపాలకు సంబంధించిన 28 రకాల నరకాలు, శిక్షలు గరుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. అయితే మనుషులు అత్యంత సాధారణంగా చేసే కొన్ని తప్పులు, గరుడ పురాణం ప్రకారం ఆ తప్పులకు విధించే శిక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Garuda Puranam horrifying punishments in hell after death for your 7 common mistakes

అంధకుపం
బతికి ఉన్నప్పుడు మీరు కలిగిన శక్తిని, వనరులను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించకపోతే.. మీకు తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తుంటే మీరు కళ్ళు మూసుకుంటే చనిపోయాక మీరు వెళ్లే చోటే అంధకుపం. ఇది నరకంలోని చీకటి బావి. ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో, ఇతరుల బాధలను పట్టించుకోరో, ఒక బాధ్యతగల పౌరులుగా తమ కర్తవ్యాన్ని విస్మరిస్తారో వారందరికీ అంధకుపం ఒక భయంకరమైన శిక్ష. అంధకుపంలో పాపాత్ములు ఒంటరిగా, నిస్సహాయంగా ఉంటారు. వారి చుట్టూ భయంకరమైన అడవి జంతువులు, విషపూరితమైన కీటకాలు, భయంకరమైన సరీసృపాలు నిరంతరం దాడి చేస్తూ ఉంటాయి. వారు బ్రతికున్నప్పుడు ఎవరి బాధను పట్టించుకోలేదో, ఇప్పుడు ఆ బాధను అనేక రెట్లు ఎక్కువగా అనుభవిస్తారు. వారి కేకలు వినిపించే నాథుడు ఉండడు, వారిని రక్షించే వారెవరూ ఉండరు. అంధకుపం.. సహాయం చేయగల శక్తి ఉండి కూడా ముఖం చాటేసిన వారికి అంతిమ గమ్యం.

తమిశ్రం
ఎవరైతే బ్రతికున్నప్పుడు ఇతరుల భావాలతో ఆడుకుంటారో, పవిత్రమైన నమ్మకాన్ని వమ్ము చేస్తారో, మోసం చేసి ఎదుటివాళ్ల కష్టార్జితాన్ని కాజేసి తమ జేబులు నింపుకుంటారో ఇలాంటి వారందరూ వెళ్లే చోటు తమిశ్రం. నరకంలోని భయంకరమైన లోకాల్లో ఇది ఒకటి. తమిశ్రమంలో ఆత్మలు కదలకుండా కట్టేసి వారి శరీరంపై కొరడా దెబ్బలు పడుతూనే ఉంటాయి, క్షణం కూడా విశ్రాంతి లేదా ఉపశమనం ఉండదు. వారు బతికున్నప్పుడు ఎవరినైతే మోసం చేశారో, ఎవరికైతే గుండెపోటు కలిగించారో, మరొకరి జీవితాల్లో ఎంతటి ఒత్తిడిని, ఉద్రిక్తతను నింపారో ఆ బాధను వీరు తమిశ్రమంలో ప్రతి క్షణం అనుభవిస్తారు. వారి వేదన ఎవ్వరికీ కనిపించదు, వారి ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించవు. తమ పాపాలకు పశ్చాత్తాపపడేవరకు కొరడాలతో యమభటులు కొట్టి కొట్టి చంపుతారు. ఇది కేవలం శిక్ష కాదు, వారు చేసిన పాపాలకు ప్రతిరూపం.

కుంభిపాకం
మాన జన్మ చాలా పవిత్రమైనది. హిందూ ధర్మం జీవకారుణ్యాన్ని భోధిస్తుంది. మూగ జీవాలను హింసించకూడదని,వాటిని చంపి తినకూడదని సాధువులు,గురువులు సైతం చెబుతుంటారు. ఎందుకంటే మాంసం తామస గుణాలను పెంచుతుందని నమ్ముతారు. అయితే ఎవరైతే ఈ సూచనలను పక్కనపెట్టి మూగజీవాలను చంపి తింటారో వారి కోసం వేచి ఉంచే భయంకరమైన నరకమే కుంభీపాకం. కుంభిపాకంలో వీరిని వేడి నూనెతో నిండిన పెద్ద కుండల్లో వేసి ఉడికిస్తారు. భూమిపై అమాయక జంతువులను ఎలా బాధపెట్టారో, వాటి ప్రాణాలు ఎలా తీశారో.. అదే బాధను, అదే యాతనను వారు నరకంలో అనుభవిస్తారు. వారి శరీరం నూనెలో ఉడుకుతుంటే వారు చేసిన పాపాల భయంకరమైన పరిణామాలను వారు గుర్తిస్తారు. వారి ఆర్తనాదాలు ఆ నరక లోకంలో ప్రతిధ్వనిస్తాయి. కుంభిపాకం మూగజీవుల ఆర్తనాదాలకు ప్రతిస్పందన.

కాలసూత్రం
బతికున్నప్పుడు ఎవరైతే తమను పెంచి పెద్ద చేసినవారిని, తమ బాగు కోసం నిరంతరం శ్రమించిన గురువులను, పెద్దలను అవమానిస్తారో, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారో, వారిని బాధపెడతారో అలాంటోళ్లందరూ చనిపోయాక వెళ్లే ప్లేస్ కాలసూత్రం. ఇక్కడ శిక్ష అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇది నిప్పుల కొలిమిలాంటి ప్రదేశం. నేలంతా భగభగ మండే వేడితో నిండి ఉంటుంది. పాపాత్ములను ఆ మంటల్లో పదే పదే పరిగెత్తిస్తారు. వారి శరీరం కాలి బూడిదవుతున్నా, మళ్లీ లేచి పరిగెత్తాల్సిందే. ఎందుకంటే వారు బతికున్నప్పుడు తమ పెద్దల మనసులను నిప్పులాంటి మాటలతో కాల్చి ఉంటారు కాబట్టి. ఆ పాపానికి ప్రతిఫలమే ఈ అగ్నిగుండం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పెద్దలను గౌరవించాలి. వారి అనుభవాన్ని, వారి ప్రేమను గుర్తించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే కాలసూత్రంలోని భరించలేని వేడి తప్పదు.

విసాసనం
ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా,ఎంత సంపద కలిగి ఉన్నా, ఇతరులను గౌరవంగా చూడటం నేర్చుకోవాలి. అందరినీ సమానంగా ప్రేమించాలి. లేదంటే విసాసనంలోని భయంకరమైన శిక్షలు తప్పవు. ఎవరైతే తమ హోదా,పలుకుబడి,తమ దగ్గర ఉన్న డబ్బుతో బలుపెక్కి కళ్లు నెత్తికెక్కి ఇతరులను చులకనగా చూస్తారో, తాము గొప్పోళ్లమని విర్రవీగుతూ తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని నోటికొచ్చినట్లు తిట్టడం, అవమానించడం, నిత్యం అసూయతో కుమిలిపోతారో వారందరూ చనిపోయాక విసాసనం అనే భయంకరమైన లోకానికి పంపబడతారు. ఇక్కడ శిక్షలు మామూలుగా ఉండవు. యమభటులు పాపులను పట్టుకుని ఈడ్చుకెళ్లి, చిత్రహింసలకు గురిచేస్తారు. వారి గర్వాన్ని అణచేలా కొరడాలతో కొడతారు, భరించలేని నొప్పులు కలిగిస్తారు. ఎందుకంటే వారు బతికున్నప్పుడు ఇతరుల మనసులను మాటలతో, చేతలతో ఎంతగానో బాధపెట్టారు. ఆ బాధకు ప్రతిఫలమే ఈ నరకయాతన.

రౌరవం
బతికున్నప్పుడు ఎవరైతే ఇతరుల కష్టార్జితాన్ని కాజేస్తారో, వారి ఆస్తులను, డబ్బును, విలువైన వస్తువులను దొంగిలిస్తారో, మోసంతో చుట్టూ ఉన్నవారిని నష్టపరుస్తారో వారికోసమే ఈ భయంకరమైన లోకం సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ శిక్ష అత్యంత భయానకంగా ఉంటుంది. రౌరవంలో.. పాపాత్ములను భయంకరమైన సర్పాల వంటి జీవులు చుట్టుముడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ జీవులు ఎవరి సొమ్మును దొంగిలించారో, ఎవరిని మోసం చేశారో వారి ముఖాలను కలిగి ఉంటాయి. తమను మోసం చేసినవారే తమను హింసిస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. వారు కాటు వేస్తారు, శరీరాన్ని చీల్చివేస్తారు, అనుభవించిన మానసిక క్షోభకు రెట్టింపు నొప్పిని కలిగిస్తారు. కాబట్టి ఎప్పుడూ ఇతరుల సొమ్మును ఆశించకూడదు. నిజాయితీగా బతకాలి. మోసం, దొంగతనం వంటి నీచమైన పనులకు పాల్పడితే రౌరవంలోని భయంకరమైన శిక్ష తప్పదని గరుడ పురాణం చెబుతోంది.

Story first published: Friday, April 25, 2025, 8:29 [IST]
Desktop Bottom Promotion