Just In
- 1 hr ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 4 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 9 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 17 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
Lancet & Cancer: క్యాన్సర్ కేసులు అబ్బాయిల్లోనే ఎక్కువ, లింగ వివక్షే కారణం!
Lancet & Cancer: భారత దేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ ఎక్కువగా గుర్తించబడుతోందని అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ ఆంకాలజీ అధ్యయనం వెల్లడించింది. ఇలా అబ్బాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్ ను గుర్తించడానికి తరతరాలుగా వస్తున్న లింగ వివక్షే కారణం అయి ఉండొచ్చని కూడా అంచనా వేసింది. క్యాన్సర్ వస్తే అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ లక్షణాలు కనిపిస్తాయి. అయితే అమ్మాయిల్లో లక్షణాలు కనిపించినా వారిని ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించకపోవడం వల్లే అమ్మాయిల్లో క్యాన్సర్ తక్కువ గుర్తించబడుతోందని లాన్సెట్ తెలిపింది. దేశంలోని యువతలో క్యాన్సర్ కేసులు బయటపడుతున్న తీరుపై భారత పరిశోధకులు జరిపిన అధ్యయన నివేదిక ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితం అయింది.
క్యాన్సర్ చికిత్సలోనూ వివక్షే..
భారత్ లో క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్న తీరు తెలుసుకునేందుకు చెన్నై క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్, దిల్లీ ఎయిమ్స్ కు చెందిన నిపుణులు పరిశోధన చేపట్టారు. ఇందుకోసం దేశంలోని మూడు క్యాన్సర్ ఆసుపత్రుల్లోని బాధితుల రికార్డులను పరిగణనలోకి తీసుకున్నారు. 20015 జనవరి 1వ తేదీ నుండి 2019 డిసెంబర్ 31 వరకు నమోదు అయిన సమాచారాన్ని అధ్యయనకర్తలు విశ్లేషించారు. ఈ సమాచారాన్ని దిల్లీలోని పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా, మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీలోని వివరాలతో పోల్చి చూశారు. ఆయా రిజిస్ట్రీల్లో నమోదు అయిన క్యాన్సర్ రోగుల్లో అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే చికిత్స కోసం వచ్చే వారిలో అబ్బాయిల శాతం ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
మూడు క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఎంత మందికి క్యాన్సర్ నిర్ధారణ అయింది.. అందులో పురుషులు ఎంత మంది ఉన్నారు, స్త్రీలు ఎంత మంది ఉన్నారు.. వారి నిష్పత్తి ఎంత అనేది నమోదు చేసుకున్నారు. పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ(Population Based Cancer Registry- PBCR)ల్లో మొత్తం 11 వేల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మొత్తం క్యాన్సర్ కేసుల్లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మూడు ఆస్పత్రుల్లో 22 వేల క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. అందులోనూ బాలికల కంటే బాలురే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రకారం అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడినా ఆ విషయాన్ని నిర్ధారించుకోవడం చాలా తక్కువ. అలాగే ఒకవేళ క్యాన్సర్ ఉందని తెలిసినా.. అబ్బాయి అయితేనే చికిత్స కోసం సుదూరంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్తున్నారు. అమ్మాయిలు అయితే ఉదాసీనంగా ఉంటున్నారని పరిశోధన వెల్లడిస్తోంది.
చికిత్స కోసం 100 కిలోమీటర్లు లేదా అంతకు మించి దూరం వెళ్తున్న బాధితుల్లో బాలికలు చాలా చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ చికిత్సకు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నారని, అదే అబ్బాయిలు అయితే ఆస్పత్రులకు తీసుకు వెళ్తున్నారని తేలింది. దీనిని బట్టి లింగ వివక్ష కనిపిస్తోందని అధ్యయనకర్తలు తేల్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువ
క్యాన్సర్ పరీక్షల విషయంలోనే కాకుండా.. అత్యంత ఖరీదైన మూలకణ మార్పిడి చికిత్స చేయించుకుంటున్న వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారని, ఇందులోనూ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశోధకులు తేల్చారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే ఎక్కువగా ఈ చికిత్స చేయిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. అయితే దేశ రాజధాని దిల్లీలో గత పదిహేను సంవత్సరాల్లో ఈ వివక్ష కొంత మారినట్లు పరిశోధకులు తెలిపారు. దక్షిణ భారత్ తో పోలిస్తే ఈ లింగ వివక్ష ఉత్తరాదిన ఎక్కువగా ఉందని తేల్చారు. అందులోనూ మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ బాధితులకు చికిత్స విషయంలో ఈ లింగ వివక్ష ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
ప్రజల్లో ఉన్న ఈ తరహా ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లింగ వివక్షకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.