స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే!

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ఈ మాట మనం తరచుగా వింటుంటాం. ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం ధూమపానమే అని తెలిసినా, స్మోక్ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి రాదు. ఒకరు పదేళ్లకే క్యాన్సర్ బారిన పడితే, ఇంకొకరు జీవితకాలం పొగతాగుతున్నా ఆరోగ్యంగానే కనిపిస్తారు.

Why Some Smokers Never Get Lung Cancer Cambridge Study Reveals the Secret

దీనివెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?
ఈ అంతుచిక్కని ప్రశ్నకు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ తాజా పరిశోధన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. క్యాన్సర్ రావడం, రాకపోవడం అనేది మన అదృష్టం మీద కాదు, మన జన్యువుల మీద ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది.

జన్యువులదే కీలక పాత్ర

సిగరెట్ పొగలో క్యాన్సర్‌ కు దారితీసే 70కి పైగా ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి నేరుగా మన కణాలలోని DNAను దెబ్బతీస్తాయి. అయితే దెబ్బతిన్న DNAను మన శరీరం ఎలా రిపేర్ చేసుకుంటుంది అనేది తల్లిదండ్రుల నుంచి మనకు వారసత్వంగా వచ్చిన జన్యువులపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

పరిశోధకులు వివిధ జన్యు నేపథ్యాలున్న ఎలుకలలోని 600 కణితులను విశ్లేషించారు. ఒకే రకమైన పొగకు గురైనప్పటికీ, క్యాన్సర్ వచ్చే వేగం అందరిలో ఒకేలా ఉండదని కనుగొన్నారు. కొందరి శరీరంలోని జన్యువులు DNA నష్టాన్ని వేగంగా పూడ్చుకుని క్యాన్సర్‌ ను అడ్డుకోగలవు. మరికొందరి జన్యువులు ఆ సామర్థ్యం లేక క్యాన్సర్‌ కు త్వరగా లొంగిపోతాయి.

అయితే స్మోకింగ్ సురక్షితమేనా?

మా తాతయ్యకు ఏమీ కాలేదు, కాబట్టి నా జన్యువులు కూడా స్ట్రాంగ్ అని ధీమాగా సిగరెట్ వెలిగిస్తే మీరు పొరబడినట్లే. ఈ పరిశోధనను సాకుగా చూపి ఎవరూ ధూమపానాన్ని సమర్థించుకోకూడదు అని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మీకు క్యాన్సర్ నుంచి రక్షించే జన్యువులు ఉన్నాయో లేదో చెప్పే మెడికల్ టెస్టులు ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా లేవు.

లంగ్ క్యాన్సర్ రానంత మాత్రాన ప్రమాదం తప్పిపోయినట్లు కాదు. పొగతాగడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం (స్ట్రోక్), ఊపిరితిత్తులను నాశనం చేసే COPD, అలాగే నోరు, గొంతు, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ వంటి ఇతర భయంకరమైన క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది.

భవిష్యత్తుకి ఒక ఆశాకిరణం
ఈ పరిశోధన భవిష్యత్తు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తేనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎవరికి క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందో వారి జన్యువుల ద్వారా ముందుగానే పసిగట్టి, వారికి ప్రత్యేకమైన స్క్రీనింగ్, సరైన కీమోథెరపీ చికిత్సలు అందించడానికి ఈ అధ్యయనం ఒక మార్గదర్శకంగా నిలవనుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, August 1, 2026, 10:39 [IST]
Desktop Bottom Promotion