Plane crash: ప్రపంచాన్ని షేక్ చేసిన ఘోర విమాన ప్రమాదాలివే

ఘోర విమానప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా 787 విమానం రన్ వే మీద నుంచి టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే 825 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కూలిపోయింది. ఎయిర్ పోర్ట్ సమీపంలోని మేఘని నగర్ ఏరియాలో జనావాసాల విమానం కూలిపోయింది. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ విమానంలో 242మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

విమానం కూలిపోవడంతో ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు వెంటనే ఫైరింజన్లు అక్కడిక చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ప్రయాణికుల పరిస్థితిపై,కూలిన ప్రాంతంలో ఎవరెవరికి ఏం జరిగిందనేదానిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

242 Aboard Air India Flight Crash In Ahemedabab Check Here Some Deadliest Air Disasters

ప్రపంచాన్ని షేక్ చేసిన కొన్ని విమాన ప్రమాదాలు

నేపాల్ విమాన ప్రమాదం

నేపాల్‌ రాజధాని ఖాట్మండు నుండి జనవరి 15,2023న పొఖారాకు బయలుదేరిన యతీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 691.. ల్యాండింగ్‌ కు కొద్ది నిమిషాల ముందు కూలిపోయింది. ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో, సేతి నది లోయలో కూలిపోయింది. విమానం పడిపోవడానికి ముందు తీవ్రంగా కుడివైపుకు ఒరిగి, ఆ తర్వాత నియంత్రణ కోల్పోయి నేలకూలింది. ఈ చివరి క్షణాల దృశ్యాలు కొందరు ప్రయాణికులు తీసిన వీడియోల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 68 మంది ప్రయాణికులు, 4 మంది సిబ్బందితో సహా మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 30 ఏళ్లలో నేపాల్‌ లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి. కేవలం పైలట్ల పొరపాటు వల్ల ఈ ఘోరం జరిగిందని విచారణలో తేలింది.

మలేషియా ఎయిర్‌ లైన్స్ ఫ్లైట్ 17 క్రాష్

మలేషియా ఎయిర్‌ లైన్స్ ఫ్లైట్ 17 (MH17) ప్రమాదం విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటి. 2014 జూలై 17న మలేషియా ఎయిర్‌ లైన్స్ ఫ్లైట్ MH17, బోయింగ్ 777-200ER నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌ డామ్ లోని షిపోల్ విమానాశ్రయం నుండి మలేషియాలోని కౌలాలంపూర్ కు బయల్దేరింది. 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో మొత్తం 298 మందితో విమానం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్ ప్రాంతంలో రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండగా గాలిలోనే కూలిపోయింది. విమానంలో ఉన్నవారందరూ మరణించారు. విమానం శకలాలు దాదాపు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడ్డాయి.

ఉక్రెయిన్‌లోని పెర్వోమైస్కీ సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రం నుండి వేర్పాటువాదులు ప్రయోగించిన ఓ క్షిపణి విమానం ముందు భాగానికి కొన్ని అడుగుల దూరంలో పేలింది. పేలుడు వల్ల వందలాది పదునైన శకలాలు విమానంలోకి దూసుకువెళ్లాయి..విమానం ముందు భాగం విడిపోయింది, ఆ తర్వాత మిగిలిన భాగాలు కూడా గాలిలోనే విచ్ఛిన్నమై నేలకూలాయి. ఈ క్షిపణి రష్యా నుండి వచ్చిందని, అది రష్యా మద్దతు ఉన్న దళాలచే ప్రయోగించబడిందని డచ్ కోర్టు తీర్పునిచ్చింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) కూడా ఈ ప్రమాదానికి రష్యన్ ఫెడరేషన్ బాధ్యత వహించాలని నిర్ధారించింది.

242 Aboard Air India Flight Crash In Ahemedabab Check Here Some Deadliest Air Disasters

ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 విమాన ప్రమాదం
చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటి. 1985 జూన్ 23న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747-237B విమానం కెనడా నుండి ముంబైకి బయల్దేరిన విమానం.. ఐర్లాండ్ తీరానికి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంపై 31,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానంలో బాంబు పేలింది. విమానంలో ఉన్న మొత్తం 329 మంది మరణించారు. వీరిలో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటీష్ పౌరులు, 22 మంది భారత పౌరులు ఉన్నారు. ఈ ప్రమాదానికి సిక్కు తీవ్రవాదులు బాధ్యత వహించారు. బబ్బర్ ఖల్సా అనే తీవ్రవాద సంస్థ ఈ దాడిని చేసిందని దర్యాప్తులో తేలింది.

ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 ప్రమాదం
సాంకేతిక లోపాలు, పైలట్ల మానవ తప్పిదాలు మరియు శిక్షణ లోపాల కలయికతో జరిగిన ఒక విషాదం ఇది. 2009 జూన్ 1న ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447, ఎయిర్‌బస్ A330-203 విమానం బ్రెజిల్‌ లోని రియో డి జనీరో నుండి ఫ్రాన్స్‌లోని పారిస్‌ కు బయల్దేరింది. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా భారీ ఉరుములతో కూడిన తుఫాను ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఎలాంటి సంకేతం లేకుండా రాడార్ నుండి అదృశ్యమైంది. సుమారు 2 సంవత్సరాల తర్వాత విమానం శకలాలు, బ్లాక్ బాక్స్‌ లను సముద్రం అడుగున దాదాపు 3,900 మీటర్ల లోతులో కనుగొనగలిగారు. విమానంలో ఉన్న 216 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 228 మంది ప్రాణాలు కోల్పోయారు.

242 Aboard Air India Flight Crash In Ahemedabab Check Here Some Deadliest Air Disasters

జపాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 123 క్రాష్

1985 ఆగస్టు 12న జపాన్ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన బోయింగ్ 747SR-46 విమానం టోక్యోలోని హనేడా విమానాశ్రయం నుండి ఒసాకాలోని ఇటామి విమానాశ్రయంకు వెళ్తుండగా టేకాఫ్ అయిన సుమారు 12 నిమిషాల తర్వాత విమానం 24,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం వెనుక భాగంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. విమానం వెనుక భాగంలోని ప్రెషర్ బల్క్‌హెడ్ విఫలమై, విమానం తోక భాగం, అన్ని నాలుగు హైడ్రాలిక్ సిస్టమ్‌ లు దెబ్బతినడంతో జపాన్ లోని మౌంట్ టకమాగహరా పర్వతంపై కూలిపోయింది. విమానంలో ఉన్న 524 మందిలో 520 మంది మరణించారు. కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 981 క్రాష్

టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 981 ప్రమాదం 1974 మార్చి 3న జరిగింది. ఇది అప్పటివరకు విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచిపోయింది. టర్కీలోని ఇస్తాంబుల్‌ లోని యెసిల్కోయ్ విమానాశ్రయం నుండి లండన్ వెళ్తున్న విమానంకి పారిస్ లో ఒక స్టాప్‌ ఓవర్ ఉంది. పారిస్ ఓర్లీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే,సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, విమానం వెనుక భాగంలో ఉన్న కార్గో డోర్ ఊడిపోయింది. దీనివల్ల భారీ పేలుడు సంభవించింది. పారిస్ శివార్లలో ఉన్న ఎర్మెనాన్‌విల్లే ఫారెస్ట్ లో విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 346 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం విమానం కార్గో డోర్ డిజైన్‌ లో ఉన్న లోపం, దానిని సరిగ్గా మూసివేయకపోవడం అని తేలింది.

Desktop Bottom Promotion