జెన్‌ జెడ్‌ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!

నేటి కాలంలో మన జీవితానికి సంబంధించి ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే కష్టతరంగా మారింది. ముఖ్యంగా డిజిటల్‌ యుగంతో సమానంగా ఎదుగుతున్న జెన్‌ జెడ్‌ తరానికి నేటి అవకాశాలు సవాల్‌గా మారాయి. వృత్తిపరంగా ఏ మార్గం ఎంచుకోవాలి, ఎలాంటి పరీక్షలకి సిద్ధం కావాలి, సోషల్‌ మీడియాలో ఇతరులు సాధించిన విజయాలను మనం జీవితంతో ఎలా పోల్చుకుంటున్నాం.. ఇంకా ఎన్నో.. అయితే వీటన్నిటికీ సమాధానం ఒక్కటే.. అదే శ్రీకృష్ణుడి సందేశం..

Lord Krishna s message to Gen Z today s youth should learn from the Gita

జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. వాటిని తట్టుకుని ధైర్యంగా పోరాడుతూ ఎంతవరకు నిలబడ్డాం అనేది మన పట్టుదలను నిర్దేశిస్తుంది. కానీ నేటి కాలం జెన్‌ జెడ్‌ యువత కొంతవరకు చిన్నవయసులోనే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. చిన్నపాటి వైఫల్యాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ ఓటమి తర్వాత కోలుకుని తిరిగి పుంజుకున్నప్పుడే మన సంకల్పం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ఈ క్రమంలో వైఫల్యం తర్వాత ఎలా కోలుకోవాలి.. కష్టపడినా ఆశించిన ఫలితాలు రానప్పుడు కలిగే ఒత్తిడి, నిరాశను ఎలా ఎదుర్కోవాలి.. ఇలాంటి ప్రశ్నలకి ఒకే ఒక సమాధానం కురుక్షేత్రంలో అర్జునిడికి శ్రీకృషుడు బోధించిన భగవద్గీత. ఇందులోని సారాంశాలను నేటి యువత ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం..

యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!

పని చేయండి.. ఫలితం కోసం ఎదురుచూడొద్దు..

శ్రీకృష్ణుడి బోధనల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సందేశం.. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు- ఫలితాల గురించి చింతించకు. కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు అర్జునుడు ఇదే సందిగ్ధంలో ఉన్నప్పుడు.. జగన్నాథుడు భవిష్యత్తుపై హామీ ఇవ్వలేదు. కేవలం అర్జునుడి కర్తవ్యం, కర్మల గురించి మాత్రమే గుర్తు చేశాడు. నేటి ప్రపంచంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు, పోటీ పరీక్షల విషయంలో కష్టనష్టాల గురించి ఆందోళన వద్దు.. చదువు, రివిజన్‌, మాక్‌ టెస్టులు, ప్రాక్టీస్‌ వంటివి సక్రమంగా, ప్రణాళికా బద్ధంగా ఉంటే చాలు.. ఫలితం గురించి చింతిస్తూ ఒత్తిడి తీసుకోవద్దు.

ఇతరులతో పోలిక వద్దు

సోషల్‌ మీడియా యుగంలోనూ, ఇరుగు పొరుగులోనూ ఒకరి జీవితాన్ని ఎక్కువగా ఇతరులతో పోలికలే ప్రభావం చూపిస్తాయి. జగన్నాథుడి బోధనలు ఇందుకు పూర్తిగా విరుద్ధం.. ఇతరులపై దృష్టి సారించకుండా ధర్మం, కర్తవ్యంపైనే పనిచేయాలని అర్జునుడికి గీతలో బోధించాడు. మీకు తెలిసిన వారో, ఇతరులో ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన మీరు ఓడిపోయినట్లు కాదు.. మీకూ ఒక సమయం వస్తుందని, అందుకు తగిన కష్టం, పట్టుదల అవసరమని గుర్తుంచుకోవాలి. ఇతరులతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు చిన్నతనంగా భావించవద్దు.

Lord Krishna s message to Gen Z today s youth should learn from the Gita

నిర్ణయాలు ఎలా తీసుకోవాలి..

పెరుగుతున్న టెక్నాలజీ, అవసరాల కారణంగా వృత్తిపరంగా అనేక రంగాలకు డిమాండ్‌ ఉంది. ఇంజినీరింగ్‌, వైద్యం, న్యాయశాస్త్రం, డిజైన్‌, వ్యవస్థాపకత, ప్రభుత్వ ఉద్యోగాలు, ఏఐ ఇలా ఒక్కటేమిటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏ రంగం ఎంచుకోవాలనే గందరగోళం ఉంటుంది. అయితే ఏ రంగాన్ని ఎలా ఎంచుకోవాలనేది పూర్తిగా మీ నిర్ణయం. కృష్ణుడు కూడా అర్జునుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతరుల ఆమోదం కోసం చూడకుండా మీ సామర్థ్యాలు, ఆసక్తులు, లక్ష్యాలను అర్థం చేసుకుని మీకు ఏ రంగం సరిపోతుందో అందులో విజయం సాధించేందుకు కష్టపడండి.

ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?

ఓటమితో ఆందోళన వద్దు

జీవితం అన్నాక గెలుపోటములు సహజం. ఓటమి ఎదురైనంత మాత్రాన జీవితంలో మీరు ఓడిపోయినట్లు కాదు. కురుక్షేత్రానికి ముందు కూడా అర్జునుడు తీవ్రంగా మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన అది ఆయన సామర్థ్యంపై ప్రభావం చూపలేదు. ఒక్క బలహీన క్షణం మీ తదుపరి లక్ష్యాలపై ప్రభావం చూపకూడదు. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఓటముల నుంచి పాఠాలను నేర్చుకుంటూ విజయం వైపు అడుగులు వేయాలి.


సహనం కీలకం

ఈ రోజు మీరు పడిన కష్టానికి వెంటనే ఫలితాలు కనిపించకపోవచ్చు. ఇంటర్నెట్‌ స్పందించినంత వేగంగా మీ జీవితంలో ప్రతిఫలం కనిపించాలని లేదు. నిరంతర శ్రమ, చదువు, పట్టుదల, తెలివైన నిర్ణయాలు నెలలు లేదా ఏళ్ల తర్వాత అయినా ఆశించిన ప్రయోజనాన్ని చూపిస్తుంది. మీరు పడిన కష్టం వృథా అని ఎప్పటికీ అనుకోవద్దు. తరాలు మారినా భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలు మాత్రం పాతబడిపోవు. గీత తరతరాలకు ఆదర్శమే.

Story first published: Friday, September 4, 2026, 14:21 [IST]
Desktop Bottom Promotion