For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Literacy Day 2021:అక్షరం అందరికీ అవసరమే... అక్షరాలతోనే ఆదాయం...ఆత్మవిశ్వాసం..

|

అక్షరం ఆయుధం కన్నా గొప్పది..
అక్షరంతో అజ్ణానం తొలగిపోతుంది..
అక్షరంతో అపారమైన జ్ణానం లభిస్తుంది..
అక్షరంతో ఆదాయమూ వస్తుంది..
అక్షరంతో అభివృద్ధి జరుగుతుంది..
అక్షరంతో ప్రశ్నించడం తెలుస్తుంది..
అక్షరంతో జవాబూ తెలుస్తుంది.
అక్షరం సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది.
అక్షరం అద్భుతాలను చేస్తుంది..
అక్షరం అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతుంది..

అలాంటి అక్షరానికి ఓ రోజు ఉంటుందని తెలుసా... అది ఈరోజే. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఒక కొత్త థీమ్ ను తీసుకొచ్చి అక్షరాస్యతపై అందరికీ అవగాహన కల్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యతను పెంపొందించడం మరియు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ అందరికీ దీనిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, కొత్త థీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2021 థీమ్..
2021 సంవత్సరంలో అక్షరాస్యతకు సంబంధించి ఒక కొత్త థీమ్ ను తీసుకొచ్చారు. అదేంటంటే.. "Literacy for a human-centred recovery:Narrowing the digital divide". 'మానవ-కేంద్రీకృత పునరుద్ధరణ కోసం అక్షరాస్యత: డిజిటల్ విభజనను తగ్గించడం'
ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ బాట పడుతున్నా.. అక్షరంపై నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. ఇప్పటికీ చాలా మంది అక్షరాల గురించి తెలుసుకోకుండా వేలిముద్రలకే అంకిమవుతున్నారు. అక్షరాస్యత పరంగా మనం మెరుగవుతున్నప్పటికీ.. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల మనం సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోతున్నాం. అక్షరాస్యత అంటే ప్రతి ఒక్క మనిషి తన డైలీ లైఫ్ లో రాయడం, చదవడం మాత్రమే కాదు.. అక్షరాస్యత అంటే మనిషి గౌరవం, అవకాశం, అభివృద్ధి గురించి తెలుసుకోవడం.. అందరితోనూ షేర్ చేసుకోవడమే నిజమైన అక్షరాస్యతకు నాంది అని పెద్దలు చెబుతుంటారు.

అక్షరాస్యత దినోత్సవ చరిత్ర..
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిద తేదీన 'అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం' జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1965వ సంవత్సరంలో నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ఈ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించగా.. 1966 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఆయా దేశాల్లో అందరికీ విద్య అనే నినాదంగా లక్ష్యాలను పెట్టుకుని పని చేస్తున్నాయి.

యునెస్కో(UNESCO) 1990 సంవత్సరాన్ని అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి (UNO)అయితే 2003-2012 దశాబ్దాన్ని అక్షరాస్యత దశాబ్దంగా ప్రకటించింది. 'అందరికీ అక్షరాస్యత, అందరి కోసం గొంతెత్తుదాం.. అందరం అన్నీ నేర్చుకుందాం' అనే అంశాలను ఈ దశాబ్ద లక్ష్యంగా నిర్దేశించింది.

ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ణాన, కల్చరల్ సంస్థ(UNESCO), అనేది ఐక్య రాజ్య సమితిలో ఒక ప్రధాన భాగం. దీన్ని 1945 సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థ తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తోడ్పాటునందించడమే కాకుండా అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ణానం, సాంస్క్రుతిక పరిరక్షణ కోసం పాటు పడుతుంది. ఇందులో 193 మంది సభ్యులు, ఆరుగురు అసోసియేట్ సభ్యులు కలిగిన యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉంది. ఇవి మొత్తం మూడు ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. వీటిలో మొదటిది తన పాలసీ తయారీ కోసం.. రెండోది అధికార చెలామణి కోసం.. మూడోది రెగ్యులర్ ప్రోగ్రామ్స్ గురించి పని చేస్తాయి.

ప్రాముఖ్యత..
UNESCO తన కార్యక్రమాలను ఐదు రంగాల్లో నిర్వహిస్తోంది. అవేంటంటే.. విద్య, ప్రక్రుతి, విజ్ణానం, సామాజిక, మానవ శాస్త్రాలు, సంస్క్రుతి, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్. UNESCO ఎడ్యుకేషన్ ద్వారా 'అంతర్జాతీయ నాయకత్వం'కోసం అవకాశాల కల్పనలో తన వంతు పాత్రను పోషిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం వివిధ దేశాలలో విద్యా విధానాలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్ లు చేపట్టడం. ఇది శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా సాంస్క్రుతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారు చేయడం, వివిధ ఈవెంట్లను ప్రోత్సహించడం వంటివి చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత విషయంలో ఇతర దేశాలు ముందుకు దూసుకెళ్తుంటే.. మన దేశం మాత్రం తిరోగమనం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 75 సంవత్సరాలు దాటుతున్నా.. మనం 60 శాతానికి పైగా అక్షరాస్యత సాధించామంటే.. అందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 90 నుండి 100 శాతం అక్షరాస్యత సాధించడం వల్లే. ప్రస్తుతం బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అక్షరాస్యత విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్నాయి. మనం ఉన్నతమైన జీవనాన్ని కొనసాగించాలన్నా.. మన దేశం అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. అక్షరాస్యత అనేది ఎంతో అవసరం. అప్పుడే ప్రపంచంతో మనం పోటీ పడగలం. అన్ని రంగాల్లో ముందుకు సాగగలం. కొన్ని దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇకనుంచైనా పిల్లలతో పాటు వయోజన విద్యను కూడా ప్రోత్సహిద్దాం. అందరికీ అక్షరాలను నేర్పిద్దాం.. అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాం.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఒక కొత్త థీమ్ ను తీసుకొచ్చి అక్షరాస్యతపై అందరికీ అవగాహన కల్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యతను పెంపొందించడం మరియు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ అందరికీ దీనిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

English summary

International Literacy Day 2021: Date, History, Theme And Significance in Telugu

International Literacy Day is an important day celebrated across the world. Every year it is celebrated on 8 September. The theme for International Literacy Day 2021 is “Literacy for a human-centred recovery:Narrowing the digital divide".
Story first published: Wednesday, September 8, 2021, 8:00 [IST]