For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి ప్రసవమా...అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

|

How to take Care of Baby and Urself after Delivery
ప్రసవంతర్వాత నిశ్చింతగా ఉండటం సరికాదు. ఆ తర్వాత కూడా అటు తల్లి, ఇటు బిడ్డ విషయంలో జాగ్రతలు పాటించాలి. కాన్పు తర్వాత 24 నుంచి 48 గంటల వరకు ఉండే సమయం ఎంతో కీలకం. సాధారణ ఆరోగ్యంతో పాటు జ్వరం, బీపీ, రక్తస్రావం వంటి అంశాలను గమనించుకుంటూ ఉండాలి.

ఆహారం: కాన్పు తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు ఇవ్వవచ్చు. మాంసాహారం, పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది కేవలం అపోహ మాత్రమే. రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. ఇలా నీరు తాగడం వల్ల పొట్ట పెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహే. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గుతుంది. కుట్లు త్వరగా మానుతాయి. పాలు బాగా పడతాయి.

వ్యక్తిగత పరిశుభ్రత: కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల, మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. యోనిస్రావాలు పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.

రొమ్ములపై శ్రద్ధ: తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవాలి. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టిస్తే అవి మరింత త్వరగా ఊరతాయి. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్) ఉత్పత్తి అవుతుంది. ఇందులో బిడ్డకు రోగనిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్ ఉంటాయి. మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే బిడ్డకు సంపూర్ణాహారం.

విశ్రాంతి: కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. కాబట్టి ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. దీనివల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది.

అటు ఇటు తిరగడం: సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించాలి. ఆపరేషన్ చేసిన వాళ్ల విషయంలో అయితే 4-6 గంటల తర్వాత మంచంలోనే కాళ్లు అటూ-ఇటూ కదపడం, ముడుచుకోవడం వంటివి చేయవచ్చు. ఆరోగ్యపరిస్థితిని బట్టి 12-24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని, ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే రిస్క్‌ను నివారించవచ్చు.

వ్యాయామాలు: కొన్ని వ్యాయామాల వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ప్రారంభంలో కాళ్లు కదపడం, శ్వాసవ్యాయామాలు చేయాలి. క్రమేపీ డాక్టర్ సలహా మేరకు ఆరు వారాల తర్వాత పొత్తికడుపు కండరాలు, పెల్విక్‌ఫ్లోర్ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయడం వల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్ బెల్ట్ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్‌గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు అనంతరం అలసట తగ్గిన తర్వాత మెల్లగా వాకింగ్ మొదలుపెట్టవచ్చు.

English summary

How to take Care of Baby and Urself after Delivery | మొదటి ప్రసవమా...ఐతే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Find out about 'How to take care of baby and urself after delivery.' After Pregnancy. Taking Care of Yourself. Plan to see your healthcare provider two to six weeks after your baby is born for a regular post-partum check up.
Story first published:Thursday, September 20, 2012, 12:24 [IST]
Desktop Bottom Promotion