కొత్త అల్లుడు వారెవ్వా అనాల్సిందే..సంక్రాంతి స్పెషల్ మాల్పువా..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సంక్రాంతి అంటేనే పిండివంటల సందడి. భోగి మంటల వెలుగులు, కొత్త అల్లుళ్ళు, సంప్రదాయ వంటకాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. సాధారణంగా ఈ పండుగకు అరిసెలు, చక్కెర పొంగలి, లేదా నువ్వుల లడ్డులు చేయడం మన ఆచారం. అయితే ఈసారి రొటీన్‌కి భిన్నంగా, ఇంటిల్లిపాదీ మెచ్చేలా, అతిథులు వారెవ్వా అనేలా ఉత్తరాది ఫేమస్ స్వీట్ మాల్పువా ట్రై చేయండి.

ఇది పూర్తి ఆరోగ్యకరమైన స్వీట్. జ్యూసీగా, మెత్తగా ఉండే మాల్పువాను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉత్తరాది వంటకమే అయినా, దీన్ని మన దక్షిణాది రుచులకు తగ్గట్టుగా, పంచదార వాడకుండా స్వచ్ఛమైన బెల్లంతో మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
-బెల్లం
-గోధుమ పిండి
-సోంపు
-యాలకుల పొడి
-పాలు
-బాదం,పిస్తా ముక్కలు
-స్వచ్ఛమైన నెయ్యి

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇందులో తురిమిన బెల్లం వేసి బాగా కరిగేలా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత,అందులో ఏవైనా నలకలు ఉంటే పోయేలా వడకట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని ఇందులోనే దంచిన సోంపు, యాలకుల పొడిని కలపండి. ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాలను కూడా గోధుమ పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, దోశ పిండి కంటే కొంచెం జారుగా ఉండాలి.

-కలిపిన పిండి మిశ్రమంపై మూత పెట్టి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా నానుతుంది, తద్వారా మాల్పువాలు చాలా మృదువుగా, జ్యూసీగా వస్తాయి.

-స్టవ్ మీద వెడల్పాటి పాన్ లేదా కడాయి పెట్టి, తగినంత నెయ్యి వేసి వేడి చేయండి. మంటను మీడియంలో ఉంచండి. ఒక గరిటెతో పిండిని తీసుకొని, వేడి నెయ్యి మధ్యలో నెమ్మదిగా పోయాలి. పిండిని గరిటెతో రుద్దాల్సిన పనిలేదు, అది దానంతట అదే గుండ్రంగా విస్తరిస్తుంది.

-మాల్పువా అంచులు క్రిస్పీగా, అడుగు భాగం బంగారు గోధుమ రంగులోకి వచ్చాక రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా చక్కగా ఉడికిన తర్వాత తీసి అదనపు నెయ్యిని ఒత్తేసి ప్లేట్‌ లోకి తీసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన బాదం, పిస్తాలతో గార్నిష్ చేస్తే వేడి వేడి బెల్లం మాల్పువా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, January 14, 2026, 19:00 [IST]
Desktop Bottom Promotion