డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్!

Posted By:

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) పర్వత ప్రాంతాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన, నోరూరించే నాన్ వెజ్ వంటకం మటన్ భుట్వా. పర్వత ప్రాంతాల్లో చలిని తట్టుకోవడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి దీనిని ఎక్కువగా తింటారు. ఇది గ్రేవీలా కాకుండా, మసాలాలు ముక్కలకు బాగా పట్టి వేపుడులా ఉంటుంది. ఉత్తరాఖండ్ సంప్రదాయ వంటకాల్లో భుట్వా అంటే వేయించినది అని అర్థం.

ఇది సాధారణంగా మేక పేగులు, ఇతర అంతర్గత భాగాలతో తయారు చేసే ఒక డ్రై ఫ్రై వంటకం. దీనిని ఎక్కువగా పహాడీ స్టైల్‌ లో ఇనుప కడాయిలో వండుతారు, దీనివల్ల వంటకానికి ప్రత్యేకమైన రుచి,రంగు వస్తుంది. మటన్ భుట్వా రుచి అంతా అది శుభ్రం చేసే విధానం, వాడే మసాలాల మీద ఆధారపడి ఉంటుంది.

Craving Spicy Non Veg Try Dehradun Famous Mutton Bhutwa Recipe in Telugu

మటన్ భుట్వా తయారీకి కావలసిన పదార్థాలు

మేక పేగులు,ఇతర భాగాలు-500 గ్రాములు
ఉల్లిపాయలు-3 పెద్దవి
అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి-5
ఆవ నూనె-4 టేబుల్ స్పూన్లు
గరం మసాలా-1 టీస్పూన్
పసుపు-అర టీస్పూన్
కారం-2 టీస్పూన్లు
ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్
జీలకర్ర1 టీస్పూన్
బిర్యానీ ఆకు,లవంగాలు,యాలకులు-తగినంత
ఉప్పు-రుచికి సరిపడా
కొత్తిమీర-గార్నిష్ కోసం

మటన్ భుట్వా తయారీ విధానం

-మటన్ భుట్వాలో పేగులను వాడతారు కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. మొదట వేడి నీటిలో కొంచెం ఉప్పు, పసుపు, పేగులను 10-15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నాలుగైదు సార్లు చన్నీటితో కడగాలి. దీనివల్ల వాసన పోయి, ముక్కలు శుభ్రపడతాయి. శుభ్రం చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

-శుభ్రం చేసిన ముక్కలను ప్రెజర్ కుక్కర్‌ లో వేసి, కొంచెం పసుపు, ఉప్పు, ఒక గ్లాసు నీరు పోసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ముక్కలు మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.

-ఇప్పుడు ఒక ఇనుప కడాయిలో ఆవ నూనె వేసి బాగా వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు,యాలకులు వేసి వేయించాక అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి.

-ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను (నీరు లేకుండా) కడాయిలో వేయాలి. అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మంటను చిన్నగా ఉంచి, ముక్కలకి మసాలా బాగా పట్టేలా 15-20 నిమిషాల పాటు వేయించాలి. ముక్కలు కొంచెం ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించడం వల్ల పహాడీ రుచి వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి.

-అంతే మటన్ భుట్వా రెడీ. వేడివేడి మటన్ భుట్వాను రోటీ లేదా అన్నంతో కలిపి తింటే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, March 28, 2026, 12:51 [IST]
Desktop Bottom Promotion